Telugu Global
Sports

సఫారీలతో సిరీస్ లో ఓడి..గెలిచిన భారత్!

ప్రపంచకప్ కు సన్నాహాలలో భాగంగా మూడోర్యాంకర్ దక్షిణాఫ్రికాతో జరిగిన మూడుమ్యాచ్ ల టీ-20 సిరీస్ ను భారత్ 2-1తో గెలుచుకొంది. ఇండోర్ లో ముగిసిన ఆఖరి టీ-20లో 49 పరుగులతో ఓటమి ఎదురైనా రోహిత్ సేన విజేతగా నిలువగలిగింది.

సఫారీలతో సిరీస్ లో ఓడి..గెలిచిన భారత్!
X

ప్రపంచకప్ కు సన్నాహాలలో భాగంగా మూడోర్యాంకర్ దక్షిణాఫ్రికాతో జరిగిన మూడుమ్యాచ్ ల టీ-20 సిరీస్ ను భారత్ 2-1తో గెలుచుకొంది. ఇండోర్ లో ముగిసిన ఆఖరి టీ-20లో 49 పరుగులతో ఓటమి ఎదురైనా రోహిత్ సేన విజేతగా నిలువగలిగింది.

రోహిత్ శర్మ నాయకత్వంలోని భారతజట్టు ఓ అరుదైన విజయం నమోదు చేసింది. ప్రపంచ మూడో ర్యాంకర్ దక్షిణాఫ్రికాపై తొలిసారిగా టీ-20 సిరీస్ విజయం సాధించింది.

ఈనెల 16 నుంచి ఆస్ట్ర్రేలియా వేదికగా జరిగే 2022 టీ-20 ప్రపంచకప్ కు సన్నాహాలలో భాగంగా సఫారీలతో ఆడిన మూడుమ్యాచ్ ల టీ-20 సిరీస్ ను భారత్ 2-1తో గెలుచుకొంది.

Advertisement

సఫారీలపై తొలి సిరీస్ విజయం...

దక్షిణాఫ్రికా ప్రత్యర్థిగా భారత్ ఓ టీ-20 సిరీస్ గెలుచుకోడం ఇదే మొదటిసారి. మూడుమ్యాచ్ ల సిరీస్ లో భాగంగా తిరువనంతపురం, గౌహతీ వేదికలుగా జరిగిన మొదటి రెండు మ్యాచ్ ల్లో తిరుగులేని విజయాలు సాధించిన భారతజట్టుకు...ఇండోర్ వేదికగా ముగిసిన ఆఖరి పోరులో 49 పరుగుల పరాజయం తప్పలేదు.

టాస్ నెగ్గి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకొన్న భారత్ ప్రత్యర్థి దక్షిణాఫ్రికాను కట్టడి చేయడంలో విఫలమయ్యింది.

Advertisement

గత రెండుమ్యాచ్ ల్లో డకౌట్లుగా వెనుదిరిగిన యువఆటగాడు రోసో అజేయ శతకం బాదడంతో దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 3 వికెట్లకు 227 పరుగుల భారీస్కోరు నమోదు చేసింది. ఓపెనర్ క్వింటన్ డి కాక్ 68 పరుగులతో తన వంతు పాత్ర నిర్వర్తించాడు.

భారత బౌలర్లలో ఉమేశ్, దీపక్ చహార్ చెరో వికెట్ పడగొట్టారు.

చేజింగ్ లో భారత్ బోల్తా...

బ్యాటింగ్ కు అనువుగా ఉన్న ఇండోర్ పిచ్ పై 228 పరుగుల భారీలక్ష్యంతో చేజింగ్ కు దిగిన భారత్ 18.3 ఓవర్లలోనే 178 పరుగులకే కుప్పకూలింది. రాహుల్, విరాట్ కొహ్లీ లకు విశ్రాంతినివ్వడంతో భారత బ్యాటింగ్ ఒక్కసారిగా తేలిపోయింది. దీనికితోడు కెప్టెన్ రోహిత్ డకౌట్ కాగా..శ్రేయస్ అయ్యర్ ఒక్క పరుగుకు, స్టార్ హిట్టర్ సూర్యకుమార్ యాదవ్ 8 పరుగులకు వెనుదిరగడంతో భారత్ మరి కోలుకోలేకపోయింది.

ఓపెనర్ రిషభ్ పంత్ 27, రెండో డౌన్ దినేశ్ కార్తీక్ 46, లోయర్ ఆర్డర్ ఆటగాళ్లు దీపక్ చహార్ 31, ఉమేశ్ యాదవ్ 20 పరుగులు సాధించారు. దీంతో భారత్ 178 పరుగులకే పరిమితం కావడంతో సఫారీటీమ్ 49 పరుగుల విజయంతో క్లీన్ స్వీప్ పరాజయం నుంచి తప్పించుకోగలిగింది.

17 చేజింగ్ ల్లో తొలి ఓటమి..

స్వదేశీగడ్డపై భారతజట్టు చేజింగ్ కు దిగిన గత 17 మ్యాచ్ ల్లో ఇదే తొలి పరాజయం కావడం విశేషం. అయితే...మూడో ర్యాంకర్ దక్షిణాఫ్రికా ప్రత్యర్థిగా టాప్ ర్యాంకర్ భారత్ కు తొలి సిరీస్ విజయం ఇదే కావడం మరో విశేషం.

ప్రస్తుత సిరీస్ వరకూ భారత్- దక్షిణాఫ్రికాజట్లు 23సార్లు తలపడగా భారత్ 12 విజయాలు, దక్షిణాఫ్రికా 10 విజయాల రికార్డుతో నిలిచాయి. ఓ మ్యాచ్ ఫలితం తేలకుండానే ముగిసింది.

ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ సూర్యకుమార్..

సిరీస్ లోని ఆఖరిమ్యాచ్ లో దక్షిణాఫ్రికా విజయం సాధించడంలో ప్రధానపాత్ర వహించిన వన్ డౌన్ ఆటగాడు రోసోకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. సిరీస్ లోని మొదటి రెండుమ్యాచ్ ల్లో గోల్డెన్ డకౌట్లుగా వెనుదిరిగిన రోసో..ఆఖరిమ్యాచ్ లో మాత్రం సత్తాచాటుకోగలిగాడు. కేవలం 48 బాల్స్ లోనే 7 ఫోర్లు, 8 సిక్సర్లతో 100 పరుగుల నాటౌట్ స్కోరు నమోదు చేశాడు.

మరోవైపు....సిరీస్ లోని మొదటి రెండుమ్యాచ్ ల్లో హాఫ్ సెంచరీలతో పాటు 119 పరుగులు సాధించిన మిస్టర్ 360 హిట్టర్ సూర్యకుమార్ యాదవ్ కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కింది.

ప్రస్తుత ( 2022 ) సీజన్లో వెయ్యి పరుగుల ఘనతతో పాటు అత్యధికంగా 50కి పైగా సిక్సర్లు బాదిన ఆటగాడి రికార్డును, అతితక్కువ ( 574 ) బంతుల్లో అత్యంత వేగంగా 1000 పరుగులు సాధించిన తొలి ఆటగాడిగా నిలిచాడు.

ఓటమి నుంచి ఓటమి వరకూ...

దుబాయ్ వేదికగా ముగిసిన ఆసియాకప్ టోర్నీలో దారుణంగా విఫలమైన భారత్..ఆ తర్వాత ప్రపంచకప్ కు సన్నాహాలలో భాగంగా రెండు అత్యంత పటిష్టమైన ఆస్ట్ర్రేలియా, దక్షిణాఫ్రికాజట్లతో జరిగిన మూడుమ్యాచ్ ల టీ-20 సిరీస్ ల్లో తలపడింది.

ప్రపంచ చాంపియన్ ఆస్ట్ర్రేలియాతో తీన్మార్ సిరీస్ లోని తొలిపోరును ఓటమితో మొదలు పెట్టిన భారత్ ..చివరి రెండు మ్యాచ్ లు నెగ్గడం ద్వారా 2-1తో విజేతగా నిలిచింది.

ఇక...ప్రపంచ మూడో ర్యాంకర్ దక్షిణాఫ్రికాతో ముగిసిన మూడుమ్యాచ్ ల సిరీస్ లోని మొదటి రెండుమ్యాచ్ లు నెగ్గడం ద్వారా సిరీస్ నెగ్గినా...ఆఖరి టీ-20 మ్యాచ్ లో ఓటమితో సిరీస్ ను ముగించినా 2-1తో సిరీస్ కైవసం చేసుకోగలిగింది.

గత రెండు సిరీస్ ల్లోని ప్రారంభ, ముగింపు మ్యాచ్ ల్లో భారత్ పరాజయాలు చవిచూసినా 2-1 విజయాలతో సిరీస్ విజేతగా నిలవడం ఓ అరుదైన రికార్డుగా మిగిలిపోతుంది.

Next Story