Telugu Global
Sports

నేడు భారత్- పాక్ ' సూపర్ సండే ' ఫైట్!

ఆసియాకప్ సూపర్ -4రౌండ్లో అతిపెద్ద సమరానికి కొలంబో ప్రేమదాస స్టేడియంలో రంగం సిద్ధమయ్యింది. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమయ్యే ఈ పోరులో చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ ఢీ అంటే ఢీ అంటున్నాయి.

నేడు భారత్- పాక్  సూపర్ సండే  ఫైట్!
X

నేడు భారత్- పాక్ ' సూపర్ సండే ' ఫైట్!

ఆసియాకప్ సూపర్ -4రౌండ్లో అతిపెద్ద సమరానికి కొలంబో ప్రేమదాస స్టేడియంలో రంగం సిద్ధమయ్యింది. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమయ్యే ఈ పోరులో చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ ఢీ అంటే ఢీ అంటున్నాయి.

2023-ఆసియాకప్ టోర్నీ రెండోదశ సూపర్-4 రౌండ్లో అతిపెద్ద సమరానికి ప్రపంచ మాజీ చాంపియన్లు భారత్, పాక్ సై అంటే సై అంటున్నాయి. లీగ్ దశలో భాగంగా గతవారం పల్లెకెలీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ఈ రెండుజట్ల నడుమ జరిగిన పోటీ వానదెబ్బతో రద్దు కావడంతో..నిర్వాహక సంఘం ముందు జాగ్రత్తగా రిజర్వ్ డే ను ప్రకటించింది.

నేటి పోరుకూ వానముప్పు?

భారత కాలమాన ప్రకారం ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు జరిగే సూపర్- 4 రౌండ్ మ్యాచ్ కు సైతం వానముప్పు పొంచిఉంది. ఒకవేళ వానదెబ్బతో మ్యాచ్ కు అంతరాయం కలిగితే..తిరిగి సోమవారం నిర్వహించడానికి వీలుగా రిజర్వ్ డేను ప్రకటించారు.

రెండుజట్లు విజయమే లక్ష్యంగా బరిలో నిలవడం, సమానబలం కలిగినవి కావడంతో మ్యాచ్ రసపట్టుగా సాగే అవకాశం ఉంది. దీనికితోడు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఈ రెండుజట్ల అభిమానులూ ఈ పోరు కోసం ఎక్కడలేని ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.

భారీస్కోర్లకు రోహిత్, విరాట్ గురి....

లీగ్ దశలో దారుణంగా విఫలమైన భారత సూపర్ స్టార్ల జోడీ రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీ..ఈ రోజు జరిగే పోరులో భారీస్కోర్లు సాధించాలన్న కసితో పోటీకి దిగుతున్నారు.

పాక్ ఓపెనింగ్ బౌలర్ షాహీన్ అఫ్రిదీ కొట్టిన దెబ్బతో బిత్తరపోయిన రోహిత్, విరాట్ జోడీ ప్రస్తుత మ్యాచ్ లో దీటుగా ఎదుర్కొన్నాలన్న పట్టుదలతో ఉన్నారు.

కొత్తబంతితో చెలరేగిపోతున్న షాహీన్ అఫ్రిదీని పవర్ ప్లే ఓవర్లలో టాప్ జోడీ కాచుకోగలిగితే..సగం మ్యాచ్ ను గెలుచుకొన్నట్లేనని టీమ్ మేనేజ్ మెంట్ భావిస్తోంది.

నేపాల్ తో జరిగిన లీగ్ ఆఖరిమ్యాచ్ లో 74 పరుగుల నాటౌట్ స్కోరు సాధించడం ద్వారా ఆత్మవిశ్వాసం కూడ గట్టుకొన్న రోహిత్ పలు రికార్డులకు సైతం గురిపెట్టాడు.

ఇప్పటి వరకూ ఆడిన 246 వన్డేలలో 9922 పరుగులతో 48.87 సగటు నమోదు చేసిన రోహిత్..10వేల పరుగుల మైలురాయిని చేరటానికి తహతహలాడుతున్నాడు.

అత్యంత వేగంగా 10వేల పరుగుల రికార్డు సాధించిన ఓపెనర్ గా కూడా రోహిత్ సరికొత్త రికార్డు నెలకొల్పే అవకాశం ఉంది.

విరాట్ ను ఊరిస్తున్న మరో రికార్డు...

భారత దిగ్గజ బ్యాటర్ విరాట్ కొహ్లీని సైతం మరో అరుదైన రికార్డు ఊరిస్తోంది. 13వేల పరుగుల మైలురాయి చేరాలంటే విరాట్ మరో 98 పరుగులు చేయాల్సి ఉంది.

వన్డే చరిత్రలో ఇప్పటికే 13వేల పరుగుల రికార్డు సాధించిన మొనగాళ్ళ ( సచిన్- 18, 4260), కుమార సంగక్కర ( 14, 234), రికీ పాంటింగ్ ( 13,704), సనత్ జయసూర్య (13, 430 ) సరసన విరాట్ నిలిచే అవకాశం ఉంది.

తన కెరియర్ లో ఇప్పటి వరకూ ఆడిన 277 వన్డేలలో విరాట్ 12వేల 902 పరుగులు సాధించాడు. పైగా ప్రేమదాస స్టేడియం వేదికగా ఇప్పటి వరకూ 8 మ్యాచ్ లు ఆడిన విరాట్ కొహ్లీకి 105 సగటు ఉండటం కూడా భారతజట్టుకు మేలు చేయనుంది.

తుదిజట్టులో రాహులా?..ఇషానా?

తుదిజట్టులో చోటు కోసం వికెట్ కీపర్ బ్యాటర్లు కెఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ ల నడుమ గట్టిపోటీనే నెలకొని ఉంది. లీగ్ తొలిమ్యాచ్ లో ఫైటింగ్ హాఫ్ సెంచరీతో భారత్ పరువు దక్కించిన ఇషాన్ కిషన్ ప్రస్తుత సూపర్-4 మ్యాచ్ లో మాత్రం తుదిజట్టులో చోటు కోసం పోటీపడాల్సి వస్తోంది. ప్రధాన వికెట్ కీపర్ బ్యాటర్ కెఎల్ రాహుల్ అందుబాటులోకి రావడంతో..ఇషాన్ కు చోటు డౌటుగా మారింది.

ఇషాన్ ఆడిన గత నాలుగు వన్డేలలోనూ 50కి పైగా స్కోర్లు సాధించడం ద్వారా భీకరఫామ్ లో కనిపిస్తున్నాడు. గతంలో వరుసగా ఐదు వన్డే హాఫ్ సెంచరీలు సాధించిన ఘనత విరాట్, సచిన్, రోహిత్ లకు మాత్రమే ఉంది. ఇషాన్ ఈ రోజు జరిగే మ్యాచ్ లో సైతం హాఫ్ సెంచరీ సాధించగలిగితే...వరుసగా ఐదుమ్యాచ్ ల్లో ఐదు హాఫ్ సెంచరీలు సాధించిన భారత నాలుగో బ్యాటర్ కాగలుగుతాడు.

తుదిజట్టులో ఇషాన్, రాహుల్ లలో ఒక్కరికే చోటుంది. అయితే..ఇద్దరికీ తుదిజట్టులో అవకాశంలేకపోలేదు. యార్కర్లకింగ్ జస్ ప్రీత్ బుమ్రా..11 మాసాల విరామం తర్వాత తొలివన్డే మ్యాచ్ ఆటడానికి సిద్ధమయ్యాడు. పాక్ టాపార్డర్ ను భారత పేస్ త్రయం బుమ్రా, షమీ, సిరాజ్ లు ఎంతదీటుగా కట్టడి చేయగలరన్న అంశం పైనే జయాపజయాలు ఆధార పడి ఉన్నాయి.

పాక్ పేస్ కు..భారత బ్యాటింగ్ కు నడుమ పోరు..

శుభ్ మన్ గిల్, రోహిత్, విరాట్, పాండ్యా, శ్రేయస్ అయ్యర్, ఇషాన్, రాహుల్, జడేజాలతో కూడిన భారత పవర్ ఫుల్ బ్యాటింగ్ లైనప్ కు...షాహీన్ అఫ్రిదీ, హారిస్ రవూఫ్, నసీమ్ షాలతో కూడిన భీకర పాక్ పేస్ ఎటాక్ కు నడుమ మరోసారి ఆసక్తికర పోరు జరిగే అవకాశం లేకపోలేదు.

ఇప్పటి వరకూ ఆడిన ప్రతిమ్యాచ్ లోనూ ప్రత్యర్థిజట్లను ఆలౌట్ చేసిన ఏకైకజట్టుగా పాక్ జట్టుకు మాత్రమే రికార్డు ఉంది. భారత్ తో లీగ్ దశ మ్యాచ్ లో 10 కి 10 విట్లనూ పాక్ ఫాస్ట్ బౌలర్ల త్రయమే సాధించడం విశేషం.

కొలంబో పిచ్ ..స్పిన్ బౌలర్లకు అనువుగా ఉండడంతో రెండుజట్ల స్పిన్నర్లు కీలకపాత్ర పోషించే అవకాశం ఉంది. భారతజట్టు పేస్ ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్ స్థానంలో..స్పిన్ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ కు తుదిజట్టులో చోటు కల్పించడం ఖాయంగా కనిపిస్తోంది.

పాక్ కెప్టెన్ బాబర్ అజమ్ పై 38 బంతుల్లో 18 పరుగులు మాత్రమే ఇచ్చి 2 సార్లు పడగొట్టిన రికార్డు కుల్దీప్ యాదవ్ కు ఉండటంతో..భారత తురుపుముక్కగా మరోసారి కుల్దీప్ కీలకంకానున్నాడు.

ఈమ్యాచ్ లో నెగ్గినజట్టుకే సూపర్ -4 రౌండ్ నుంచి ఫైనల్ కు చేరే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో ..రెండుజట్లూ ఆరునూరైనా మ్యాచ్ నెగ్గితీరాలన్న పట్టుదలతో పోటీకి దిగనున్నాయి.

వరుణుడు కరుణిస్తే రసవత్తరంగా జరిగే ఈ పోరు భారత ఉపఖండ క్రికెట్ అభిమానులను ఓలలాడించడం ఖాయమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సూపర్-4 రౌండ్లో సూపర్ విన్నర్ గా ఏ జట్టు నిలుస్తుందో తెలుసుకోవాలంటే...రాత్రి 11 గంటల వరకూ వేచి చూడక తప్పదు.

First Published:  10 Sep 2023 7:30 AM GMT
Next Story