Telugu Global
Sports

రేపే భారత్- న్యూజిలాండ్ ఆఖరివన్డే!

భారత్- న్యూజిలాండ్ జట్ల తీన్మార్ వన్డే సిరీస్ ముగింపు దశకు చేరింది. క్ర్రైస్ట్ చర్చి వేదికగా బుధవారం జరిగే కీలక ఆఖరి సమం కివీస్ కు చెలగాటం, భారత్ కు సిరీస్ సంకటంగా మారింది.

రేపే భారత్- న్యూజిలాండ్ ఆఖరివన్డే!
X

రేపే భారత్- న్యూజిలాండ్ ఆఖరివన్డే!

భారత్- న్యూజిలాండ్ జట్ల తీన్మార్ వన్డే సిరీస్ ముగింపు దశకు చేరింది. క్ర్రైస్ట్ చర్చి వేదికగా బుధవారం జరిగే కీలక ఆఖరి సమం కివీస్ కు చెలగాటం, భారత్ కు సిరీస్ సంకటంగా మారింది....

వన్డే ఫార్మాట్లో టాప్ ర్యాంకర్ న్యూజిలాండ్, 3వ ర్యాంకర్ భారతజట్ల తీన్మార్ సిరీస్ క్లైయ్ మాక్స్ దశకు చేరింది. మూడుమ్యాచ్ ల ఈ సిరీస్ లోని తొలిపోరులో న్యూజిలాండ్ విజేతగా నిలిస్తే...రెండోమ్యాచ్ వానదెబ్బతో రద్దుల పద్దులో చేరిపోయింది. ఆతిథ్య న్యూజిలాండ్ 1-0తో ఆధిక్యంలో ఉండడంతో సిరీస్ లోని ఈ ఆఖరిపోరు భారత్ కు డూ ఆర్ డైగా మారింది.

క్ర్రైస్ట్ చర్చి హాగ్లే ఓవల్ స్టేడియం వేదికగా బుధవారం ( భారత కాలమానం ప్రకారం ఉదయం 7 గంటలకు ) ప్రారంభమయ్యే ఈ పోరులో భారత్ విజేతగా నిలిస్తేనే 1-1తో సిరీస్ ను సమం చేయగలుగుతుంది.

తుదిజట్టులో మార్పులు తప్పవా?

ఆఖరివన్డేకి సైతం వానముప్పు పొంచి ఉండడంతో..భారత్ తుదిజట్టులో ఒకటి రెండు మార్పులు చేసే అవకాశం లేకపోలేదు. తొలివన్డేలో 38 బంతుల్లో 36 పరుగులు సాధించిన సంజు శాంసన్ ను రెండోమ్యాచ్ లో దూరం పెట్టిన టీమ్ మేనేజ్ మెంట్..ఆఖరి వన్డే తుదిజట్టులో చోటు కల్పించనుంది. వైస్ కెప్టెన్ కమ్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ వరుసగా విఫలమవుతూ వస్తున్నా తుదిజట్టులో కొనసాగించడం..అదే నిలకడగా రాణిస్తున్న మరో వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ ను జట్టుకు దూరంగా ఉంచడం

తీవ్రవిమర్శలకు గురవుతోంది. అంతేకాదు..ఆల్ రౌండర్ దీపక్ హుడా కోసం సంజును పక్కన పెట్టడం ఎంత వరకూ సమంజసమన్న విమర్శలు సైతం వస్తున్నాయి.

శార్దూల్ ఠాకూర్ ను సైతం పక్కన పెట్టి దీపక్ చహార్ ను తుదిజట్టులోకి తీసుకోడం కూడా చర్చనీయాంశంగా మారింది.

తుదిజట్టులో చోటు కోసం దీపక్ హుడా, దీపక్ చహార్ లతో సంజు శాంసన్, శార్దూల్ ఠాకూర్ లకు గట్టిపోటీనే జరుగనుంది.

కివీస్ పై భారత్ దే పైచేయి..

వన్డే నంబర్ వన్ టీమ్ న్యూజిలాండ్ పైన 3వ ర్యాంకర్ భారత్ దే పైచేయిగా ఉంది. ఈ రెండుజట్ల ఫేస్ టు ఫేస్ రికార్డు చూస్తే..ప్రస్తుత సిరీస్ లోని మొదటి రెండువన్డేల వరకూ..రెండుజట్లూ 112 మ్యాచ్ ల్లో తలపడ్డాయి. భారత్ 55 విజయాలు, న్యూజిలాండ్ 50 విజయాల రికార్డుతో ఉన్నాయి.

ఇక..న్యూజిలాండ్ గడ్డపై 2020 సిరీస్ లో 0-3తో చిత్తుగా ఓడిన భారత్ కు 2019 ప్రపంచకప్ సెమీస్ లోనూ పరాజయం తప్పలేదు.

2018-19 కివీ పర్యటనలో భాగంగా జరిగిన వన్డే సిరీస్ ను విరాట్ కొహ్లీ నాయకత్వంలో 4-1తో నెగ్గిన భారత్..ఆ తర్వాత న్యూజిలాండ్ చేతిలో వరుసగా ఐదుపరాజయాలు చవిచూడాల్సి వచ్చింది.

భారత్ స్టాండ్ ఇన్ కెప్టెన్ గా ఇప్పటి వరకూ 11 మ్యాచ్ లు ఆడిన శిఖర్ ధావన్ కు 7 విజయాలు, 3 పరాజయాల రికార్డు ఉంది.

ఈ నేపథ్యంలో ..ప్రస్తుత సిరీస్ లోని ఆఖరి వన్డేలో ఆరునూరైనా నెగ్గితీరాలన్న పట్టుదలతో భారత్ ఉంది. ఓపెనర్లు ధావన్, శుభ్ మన్ గిల్, టాపార్డర్ ఆటగాళ్లు శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్ కళ్లు చెదిరే ఫామ్ లో ఉండడంతో భారత్ మరోసారి 300కు పైగా స్కోరు సాధించే అవకాశం ఉంది. రిషభ్ పంత్ ను పక్కన పెట్టి సంజు శాంసన్ ను వికెట్ కీపర్ బ్యాటర్ గా తుదిజట్టులోకి తీసుకొంటే...భారత్ మరింత సమతూకం సాధించగలుగుతుంది.

భారత కాలమానం ప్రకారం రేపు ( బుదవారం ) ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యే ఈమ్యాచ్ ఆతిథ్య న్యూజిలాండ్ కు చెలగాటం, భారత్ కు సిరీస్ సంకటం అనడంలో ఏమాత్రం సందేహం లేదు.

ఇప్పటికే తీన్మార్ టీ-20 సిరీస్ ను 1-0తో నెగ్గిన భారతజట్టు..వన్డే సిరీస్ ను 1-1తో సమం చేయగలిగితే..న్యూజిలాండ్ టూర్ ను విజయవంతంగా ముగించినట్లవుతుంది.

First Published:  29 Nov 2022 6:29 AM GMT
Next Story