Telugu Global
Sports

అహ్మదాబాద్ లో నేడే ఆఖరిపోరాటం!

భారత్- న్యూజిలాండ్ జట్ల తీన్మార్ టీ-20 సిరీస్ షో క్లయ్ మాక్స్ దశకు చేరింది. అహ్మదాబాద్ నరేంద్రమోడీ స్టేడియం వేదికగా జరిగే ఈ ఆఖరాటలో నెగ్గినజట్టే సిరీస్ విజేతగా నిలువగలుగుతుంది.

అహ్మదాబాద్ లో నేడే ఆఖరిపోరాటం!
X

భారత్- న్యూజిలాండ్ జట్ల తీన్మార్ టీ-20 సిరీస్ షో క్లయ్ మాక్స్ దశకు చేరింది. అహ్మదాబాద్ నరేంద్రమోడీ స్టేడియం వేదికగా జరిగే ఈ ఆఖరాటలో నెగ్గినజట్టే సిరీస్ విజేతగా నిలువగలుగుతుంది.

ధూమ్ ధామ్ టీ-20 ఫార్మాట్లో టాప్ ర్యాంకర్ భారత్ మరో గట్టిపోటీకి సిద్ధమయ్యింది. న్యూజిలాండ్ తో మూడుమ్యాచ్ ల సిరీస్ లోని ఆఖరిపోరులో విజయంతో పాటు సిరీస్ కైవసం చేసుకోవాలన్న పట్టుదలతో బరిలోకి దిగుతోంది.

అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా రాత్రి 7 గంటలకు ప్రారంభమయ్యే ఈమ్యాచ్ కోసం లక్షా 32 వేలమంది అభిమానులు తరలిరానున్నారు.

భారత్ పైనే తీవ్రఒత్తిడి....

స్వదేశీగడ్డపై ఆడిన గత 12 ద్వైపాక్షిక సిరీస్ ల్లో ఓటమి అన్నదే లేని భారత్ కు తొలి సిరీస్ ఓటమి గండం పొంచిఉంది. ప్రస్తుత సిరీస్ లోని తొలిపోరులో న్యూజిలాండ్ 21 పరుగుల విజయంతో 1-0తో పైచేయి సాధిస్తే...లక్నో వేదికగా ముగిసిన రెండోమ్యాచ్ లో భారత్ 6 వికెట్ల విజయంతో సమఉజ్జీగా నిలిచింది. రెండుజట్లూ 1-1తో సమానంగా నిలవడంతో ఈరోజు జరిగే ఆఖరిమ్యాచ్ నిర్ణయాత్మకం కానుంది.

పవర్ ఫుల్ బ్యాటింగ్, పదునైన బౌలింగ్, చురుకైన ఫీల్డింగ్ తో అత్యంత సమతూకం కలిగిన న్యూజిలాండ్ ప్రత్యర్థి భారత్ కంటే నాలుగు ర్యాంకులు దిగువన ఉన్నా..అత్యంత బలమైన ప్రత్యర్థిగా కనిపిస్తోంది.

స్పిన్ ఆల్ రౌండర్ మిచెల్ సాంట్నర్ నాయకత్వంలోని కివీజట్టులో వీరబాదుడు బ్యాటర్లు పలువురు ఉండటం అంతగా అనుభవం లేని భారత బౌలర్లకు సవాలుగా నిలిచింది.

డేవిడ్ కాన్వే, మార్క్ చాప్ మాన్, ఫిన్ అలెన్, డారిల్ మిచెల్, బ్రేస్ వెల్ లలో ఏ ఇద్దరు నిలబడినా భారత్ కు కష్టాలు తప్పవు. వికెట్ బ్యాటింగ్ కు ఏమాత్రం అనువుగా ఉన్నా న్యూజిలాండ్ కే విజయావకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

పృథ్వీ షాకు చోటు దక్కేనా?

మరోవైపు..ఆతిథ్య భారత్ కుదురైన ఓపెనింగ్ జోడీ లేక సతమతమవుతోంది. యువఓపెనర్లు శుభ్ మన్ గిల్, ఇషాన్ కిషన్ మొదటి రెండువన్డేలలో దారుణంగా విఫలమయ్యారు. దీంతో గిల్ స్థానంలో డాషింగ్ ఓపెనర్ పృథ్వీ షాను తుదిజట్టులోకి తీసుకొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

తుదిజట్టులోకి పృథ్వీషాను తీసుకోవాలంటూ టీమ్ మేనేజ్ మెంట్ పైన పలురకాలుగా ఒత్తిడి పెరుగుతోంది. భారత్ ముగ్గురు స్పెషలిస్ట్ స్పిన్నర్లతో పోటీకి దిగుతుందా? లేక చహాల్ స్థానంలో యువఫాస్ట్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ ను తీసుకొంటుందా? అన్నది..మ్యాచ్ కు వాడే పిచ్ ను బట్టి నిర్ణయం కానుంది.

భారత బ్యాటింగ్ భారం పూర్తిగా వైస్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, కెప్టెన్ హార్థిక్ పాండ్యాలతో పాటు ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ పైన పడడటం ఆందోళన కలిగిస్తోంది.

న్యూజిలాండ్ పై భారత్ దే పైచేయి..

టీ-20 ఫార్మాట్లో భారత్ నంబర్ వన్ ర్యాంకులో ఉంటే...న్యూజిలాండ్ 5వ ర్యాంకర్ గా నిలిచింది. ఈ రెండుజట్ల ఫేస్ టు ఫేస్ రికార్డులు చూస్తే టాప్ ర్యాంకర్ భారత్ దే పైచేయిగా ఉంది.

ప్రస్తుత సిరీస్ లోని రెండోమ్యాచ్ వరకూ ఈ రెండుజట్లూ 23 సార్లు తలపడితే..భారత్ 13 విజయాలు, న్యూజిలాండ్ 10 విజయాలతో ఉన్నాయి. అయితే..అహ్మదాబాద్ స్టేడియం వేదికగా భారత్ ఆడిన ఆరుమ్యాచ్ ల్లో 4 విజయాలు, 2 పరాజయాలతో ఉంది. భారత్ నెగ్గిన నాలుగుమ్యాచ్ ల్లో మూడు విజయాలు ఇంగ్లండ్ ప్రత్యర్థిగా సాధించినవే కావటం విశేషం.

అందరి చూపు సూర్యవైపే....

టీ-20 టాప్ ర్యాంకర్, భారత వైస్ కెప్టెన్, 360 హిట్టర్ సూర్యకుమార్ యాదవ్ పైనే భారత జయాపజయాలు ఆధారపడి ఉన్నాయి. భారత్ తరపున సూర్య ఆడిన గత రెండు సిరీస్ ల్లో ఓ సారి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ తో పాటు మూడుసార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలుచుకోడం ద్వారా దూకుడుమీద కనిపిస్తున్నాడు.

అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్ ల్లో సగటున 175 స్కోర్లు నమోదవుతూ రావడంతో..ఈ రోజు జరిగే మ్యాచ్ లో సైతం భారీస్కోరు నమోదయ్యే అవకాశం లేకపోలేదు.

న్యూజిలాండ్ బ్యాటింగ్ పవర్ కు భారత బౌలింగ్ ఎటాక్ ఏ రేంజ్ లో బదులిస్తుందన్న దానిపైనే మ్యాచ్ తుదిఫలితం ఆధారపడి ఉంది.

సిరీస్ లోని ఈ ఆఖరిమ్యాచ్ లో న్యూజిలాండ్ ఓడినా వచ్చిన నష్టం ఏమీలేదు..అదే హార్థిక్ పాండ్యా నాయకత్వంలోని భారత్ ఓడితే మాత్రం స్వదేశీ గడ్డపై 12 ద్వైపాక్షిక సిరీస్ ల తర్వాత తొలి సిరీస్ ఓటమిని చవిచూడక తప్పదు.

ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు జరిగే ప్రత్యేక కార్యక్రమంలో..అండర్ -19 ప్రపంచకప్ నెగ్గి స్వదేశానికి వచ్చిన భారత బాలికల జట్టును 5 కోట్ల రూపాయల ప్రోత్సాహక నగదు బహుమతితో బీసీసీఐ సత్కరించనుంది. ఈ కార్యక్రమంలో మాస్టర్ సచిన్ టెండుల్కర్ ప్రత్యేకఅతిథిగా హాజరుకానున్నాడు.

First Published:  1 Feb 2023 6:35 AM GMT
Next Story