Telugu Global
Sports

నేడే హైదరాబాద్ వన్డే, భారత్ జోరు కొనసాగేనా?

హైదరాబాద్ వేదికగా ఈరోజు న్యూజిలాండ్ తో జరిగే తొలివన్డేలో అసలు పరీక్ష ఎదుర్కొనబోతోంది.

నేడే హైదరాబాద్ వన్డే, భారత్ జోరు కొనసాగేనా?
X

వన్డే ప్రపంచకప్ కు సన్నాహాలలో భాగంగా మాజీ చాంపియన్ భారత్ కొత్తసంవత్సరంలో రెండోసిరీస్ కు సిద్ధమయ్యింది. హైదరాబాద్ వేదికగా ఈరోజు న్యూజిలాండ్ తో జరిగే తొలివన్డేలో అసలు పరీక్ష ఎదుర్కొనబోతోంది...

వన్డే క్రికెట్ టాప్ ర్యాంకర్ న్యూజిలాండ్, నాలుగోర్యాంకర్ భారత జట్ల తీన్మార్ వన్డే సిరీస్ కు...హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషల్ స్టేడియం వేదికగా ఈరోజు తెరలేవనుంది.

భారత్ వేదికగా మరికొద్దిమాసాలలో జరుగనున్న 2023 ఐసీసీ వన్డే ప్రపంచకప్ కు అటు భారత్, ఇటు న్యూజిలాండ్ కొత్తసంవత్సరంలో సన్నాహాలు మొదలు పెట్టాయి.

భారత్ కు న్యూజిలాండ్ పరీక్ష|

కొత్తసంవత్సరంలో 8వ ర్యాంకర్ శ్రీలంకతో ఆడిన తొలి సన్నాహక సిరీస్ లో ప్రపంచ రికార్డుల మోతతో క్లీన్ స్వీప్ సాధించిన భారత్ కు తన కంటే మూడుర్యాంకులు పైనున్న

న్యూజిలాండ్ నుంచి అసలు పరీక్ష ఎదురుకానుంది.

పాకిస్థాన్ తో ముగిసిన మూడుమ్యాచ్ ల సిరీస్ ను 2-1తో గెలుచుకొని..భారత పర్యటనకు వచ్చిన కివీజట్టు..ఇద్దరు ప్రధాన ఆటగాళ్లు కేన్ విలియమ్స్ సన్, టిమ్ సౌథీలు లేకుండానే పోటీకి దిగుతోంది.

వికెట్ కీపర్ బ్యాటర్ టామ్ లాథమ్ నాయకత్వంలోని న్యూజిలాండ్ జట్టులో డేవన్ కాన్వే, గ్లెన్ ఫిలిప్స్, హెన్రీ నికోల్స్ లాంటి సూపర్ హిట్టర్లున్నారు. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ విభాగాలలో అత్యంత పటిష్టంగా ఉన్న కివీజట్టు ప్రత్యర్థి భారత్ కు గట్టిపోటీ ఇవ్వనుంది.

ఇషాన్, సూర్యాలకు చాన్స్...

మరోవైపు...ఆతిథ్య భారతజట్టు స్పిన్ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ బ్యాటర్ రాహుల్, మిడిలార్డర్ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ లు లేకుండా..కొత్త కాంబినేషన్ తో పోటీకి సిద్ధమయ్యింది.

తుదిజట్టులోకి వికెట్ కీపర్ బ్యాటర్ గా ఇషాన్ కిషన్ మిడిలార్డర్లో బ్యాటింగ్ కు దిగనున్నాడు. మిస్టర్ 360 హిట్టర్ సూర్యకుమార్ యాదవ్ సైతం వన్డేల్లో సైతం సత్తా చాటుకోడానికి తహతహలాడుతున్నాడు.

భారత బౌలింగ్ ఎటాక్ కు స్థానిక పేసర్ మహ్మద్ సిరాజ్ నేతృత్వం వహించనున్నాడు. గత సిరీస్ లో ఏకంగా 9 వికెట్లు పడగొట్టడం ద్వారా భారత స్టార్ బౌలర్ గా నిలిచిన సిరాజ్..హోంగ్రౌండ్ లో తన తొలి అంతర్జాతీయమ్యాచ్ ఆడబోతున్నాడు.

మెరుపు ఫాస్ట్ బౌలర్ ఉమ్రన్ మాలిక్ స్థానంలో ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్ ను చేర్చుకొనే అవకాశాలున్నాయి. స్పిన్నర్ల కోటాను కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ తోపాటు షాబాజ్ అహ్మద్ భర్తీ చేయనున్నారు.

టాప్ గేర్ లో విరాట్ కొహ్లీ...

శ్రీలంకతో సిరీస్ మూడుమ్యాచ్ ల్లో రెండుశతకాలు బాదిన భారత దిగ్గజ బ్యాటర్ విరాట్ కొహ్లీ..కివీస్ పైనా అదే దూకుడు కొనసాగించాలన్న పట్టుదలతో ఉన్నాడు. శ్రీలంకతో పోల్చుకొంటే న్యూజిలాండ్ బౌలింగ్ పటిష్టంగా ఉండడంతో విరాట్ కు అంతతేలిక కాదు.

ఓపెనర్లు శుభ్ మన్ గిల్- రోహిత్ జోడీ ఇచ్చే ఆరంభం పైనే విరాట్, కిషన్, సూర్యాలాంటి బ్యాటర్లు చెలరేగిపోడం ఆధారపడి ఉంది.

హైదరాబాద్ వికెట్ బ్యాటర్లకు అనువైనది కావడంతో భారీస్కోరింగ్ మ్యాచ్ గా జరిగే అవకాశం ఉంది.

భారత్ దే పైచేయి...

న్యూజిలాండ్ ప్రత్యర్థిగా ఇప్పటి వరకూ ఆడిన 113 వన్డేలలో భారత్ కు 55 విజయాలు, 50 పరాజయాల రికార్డు ఉంది. ఇక భారత్ వేదికగా న్యూజిలాండ్ తో ఆడిన 35 వన్డేలలో భారత్ కు 26 విజయాల రికార్డు ఉంది. న్యూజిలాండ్ కు భారత గడ్డపై కేవలం 8 విజయాలు మాత్రమే ఉన్నాయి.

ర్యాంకులు, గత రికార్డులతో ప్రమేయం లేకుండా చూస్తే..ప్రస్తుతం రెండుజట్లు చెరో సిరీస్ నెగ్గడం ద్వారా సూఫర్ ఫామ్ లో ఉండడంతో..హైదరాబాద్ వన్డే రసపట్టుగా, హైస్కోరింగ్ వార్ గా జరిగే అవకాశం ఉంది.

మొత్తం 39వేల సిటీంగ్ కెపాసిటీతో రాజీవ్ ఇంటర్నేషనల్ స్టేడియం కిటకిటలాడుతుందనడంలో సందేహం లేదు.

First Published:  18 Jan 2023 4:32 AM GMT
Next Story