Telugu Global
Sports

ఆఖరి టీ-20లో భారత్ విశ్వరూపం!

న్యూజిలాండ్ తో తీన్మార్ టీ-20 సిరీస్ ను భారత్ 2-1తో సొంతం చేసుకొంది. అహ్మదాబాద్ వేదికగా ముగిసిన ఆఖరిమ్యాచ్ లో భారత్ 168 పరుగుల రికార్డు విజయంతో స్వదేశీగడ్డపై అజేయ జట్టుగా తన రికార్డును తానే అధిగమించింది.

ఆఖరి టీ-20లో భారత్ విశ్వరూపం!
X

న్యూజిలాండ్ తో తీన్మార్ టీ-20 సిరీస్ ను భారత్ 2-1తో సొంతం చేసుకొంది. అహ్మదాబాద్ వేదికగా ముగిసిన ఆఖరిమ్యాచ్ లో భారత్ 168 పరుగుల రికార్డు విజయంతో స్వదేశీగడ్డపై అజేయ జట్టుగా తన రికార్డును తానే అధిగమించింది...

టీ-20 టాప్ ర్యాంకర్ భారత్ స్థాయికి తగ్గ ఆటతీరు ప్రదర్శించింది. హార్దిక్ పాండ్యా నాయకత్వంలో ఎక్కువమంది యువఆటగాళ్లతో కూడిన భారత్ 5వ ర్యాంకర్ న్యూజిలాండ్ తో జరిగిన 2023 ద్వైపాక్షిక సిరీస్ ను 2-1తో సొంతం చేసుకొంది. భారత గడ్డపై వరుసగా 13వ సిరీస్ లో అజేయంగా నిలిచింది.

2023 సీజన్ తీన్మార్ టీ-20 సిరీస్ తొలిపోరులో న్యూజిలాండ్ 21 పరుగులతో నెగ్గితే...రెండోమ్యాచ్ లో భారత్ 6 వికెట్ల విజయంతో సమఉజ్జీగా నిలిచింది. సిరీస్ విజేతను నిర్ణయించే కీలక ఆఖరిమ్యాచ్ లో భారత్ ఆట మూడు విభాగాలలోనూ చెలరేగిపోయింది.

అహ్మదాబాద్ లో ఆకాశమే హద్దుగా...

అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో..లక్షా 30వేల మంది అభిమానుల సమక్షంలో జరిగిన నిర్ణయాత్మక ఆఖరి టీ-20 పోరులో టాస్ నెగ్గటం నుంచి మ్యాచ్ ను ముగించడం వరకూ భారత్ ఆడిందే ఆటగా, కొట్టిందే షాటుగా, పట్టిందే క్యాచ్ గా సాగింది.

ముందుగా బ్యాటింగ్ కు దిగిన భారత్..ప్రారంభ ఓవర్లలోనే ఇషాన్ కిషన్ వికెట్ నష్టపోయినా..ఓపెనర్ శుభ్ మన్ గిల్- వన్ డౌన్ రాహుల్ త్రిపాఠీల బ్యాటింగ్ జోరుతో పరుగుల మోత మోగించింది.

మొదటి రెండు మ్యాచ్ ల్లో విఫలమైన యువఓపెనర్ శుభ్ మన్ గిల్..ఆఖరాటలో తన బ్యాట్ కు పూర్తిస్థాయిలో పనిచెప్పాడు. కేవలం 63 బంతుల్లోనే 12 ఫోర్లు, 7 సిక్సర్లతో 126 పరుగుల నాటౌట్ స్కోరు సాధించడంతో..భారత్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 234 పరుగుల భారీస్కోరు నమోదు చేసింది.

గ్రౌండ్ నలుమూలలకూ భారీషాట్లతో శివమెత్తినట్లు ఆడిన శుభ్ మన్ గిల్ కు ఇది తొలి టీ-20 శతకం కావడం విశేషం.

వన్ డౌన్ రాహుల్ త్రిపాఠీ 22 బాల్స్ లో 44 పరుగులు, సూర్యకుమార్ యాదవ్ 13 బంతుల్లో 24 పరుగులు, కెప్టెన్ పాండ్యా 17 బంతుల్లో 30 పరుగులు సాధించారు.

సూర్యా సూపర్ క్యాచింగ్...

235 పరుగుల భారీలక్ష్యంతో చేజింగ్ కు దిగిన న్యూజిలాండ్ 12.1 ఓవర్లలో 66 పరుగులకే కుప్పకూలిపోయింది. భారత ఓపెనింగ్ బౌలర్లు హార్థిక్ పాండ్యా, అర్షదీప్ సింగ్ చెరో రెండు వికెట్లు పడగొట్టడంతో న్యూజిలాండ్ 16 పరుగులకే 4 టాపార్డర్ వికెట్లు నష్టపోయి..మరి తేరుకోలేకపోయింది.

ఫాస్ట్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ 16 పరుగులిచ్చి 2 వికెట్లు, శివమ్ మావీ 12 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టారు. కెప్టెన్ హార్థిక్ పాండ్యా 16 పరుగులిచ్చి 4 వికెట్లు సాధించాడు.

భారత వైస్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కళ్లు చెదిరే మూడుక్యాచ్ లు పట్టి మ్యాచ్ ను మలుపు తిప్పాడు.

రికార్డు విజయం..

భారత్ 168 పరుగుల భారీవిజయంతో సరికొత్త రికార్డు నెలకొల్పింది. 2018లో డుబ్లిన్ వేదికగా ఐర్లాండ్ తో జరిగిన పోటీలో నెగ్గిన 143 పరుగుల విజయం రికార్డును ప్రస్తుత గెలుపుతో తెరమరుగు చేసింది.

భారత్ విజయంలో ప్రధానపాత్ర వహించిన ఓపెనర్ శుభ్ మన్ గిల్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ఆల్ రౌండర్ కమ్ కెప్టెన్ హార్థిక్ పాండ్యాకు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు దక్కాయి.

5వ ర్యాంకర్ న్యూజిలాండ్ ప్రత్యర్థిగా టీ-20ల్లో భారత్ కు ఇది 14వ గెలుపు కాగా..అహ్మదాబాద్ వేదికగా ఆడిన 7మ్యాచ్ ల్లో 5వ గెలుపు కావడం విశేషం.

First Published:  2 Feb 2023 5:48 AM GMT
Next Story