Telugu Global
Sports

రాయ్ పూర్ లో నేడే కీలక వన్డే సమరం!

భారత్- న్యూజిలాండ్ జట్ల వన్డే సిరీస్ లోని కీలక పోరుకు రాయ్ పూర్ లో రంగం సిద్ధమయ్యింది. వరుసగా రెండోగెలుపుతో సిరీస్ కు భారత్ గురిపెడితే..తొలిగెలుపుతో సిరీస్ ఆశలు సజీవంగా నిలుపుకోవాని న్యూజిలాండ్ భావిస్తోంది.

రాయ్ పూర్ లో నేడే కీలక వన్డే సమరం!
X

భారత్- న్యూజిలాండ్ జట్ల వన్డే సిరీస్ లోని కీలక పోరుకు రాయ్ పూర్ లో రంగం సిద్ధమయ్యింది. వరుసగా రెండోగెలుపుతో సిరీస్ కు భారత్ గురిపెడితే..తొలిగెలుపుతో సిరీస్ ఆశలు సజీవంగా నిలుపుకోవాని న్యూజిలాండ్ భావిస్తోంది...

వన్డే క్రికెట్లో ప్రపంచ నంబర్ వన్ న్యూజిలాండ్, 4వ ర్యాంకర్ భారత జట్ల తీన్మార్ సిరీస్ లో కీలకపోరుకు రాయపూర్ ఇంటర్నేషనల్ స్టేడియంలో కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది.

మధ్యాహ్నం 1-30 ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ రెండుజట్లకూ కీలకంగా మారింది. హోరాహోరీగా సాగిన తొలివన్డేలో 12 పరుగుల విజయంతో 1-0 ఆధిక్యం సాధించిన ఆతిథ్య భారత్ వరుసగా రెండోమ్యాచ్ నెగ్గడం ద్వారా సిరీస్ కైవసం చేసుకోవాలని భావిస్తోంది.

మరోవైపు..తొలివన్డేలో తుదివరకూ పోరాడి ఓడిన న్యూజిలాండ్ మాత్రం ఆరునూరైనా రెండోవన్డేలో నెగ్గి సిరీస్ అవకాశాలను సజీవంగా నిలుపుకోవాలన్న పట్టుదలతో ఉంది.

సమఉజ్జీల సమరం...

రెండుజట్లూ అత్యంత బలమైనవి కావడంతో పోటీ ఉత్కంఠభరితంగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలలో రెండుజట్లూ పవర్ ఫుల్ గా కనిపిస్తున్నాయి.

భారత్ కు స్థానం బలం ఉన్నా..ప్రత్యర్థి న్యూజిలాండ్ ను తక్కువగా అంచనావేస్తే షాక్ తప్పదని తొలివన్డే ఫలితంతోనే అర్థమైపోయింది. న్యూజిలాండ్ ఏడో నంబర్ బ్యాటర్ బ్రేస్ వేల్ మెరుపుసెంచరీతో భారత్ బౌలర్లను ఓ ఆటాడుకోడం చర్చనీయాంశంగా మారింది. భారత బౌలింగ్ లోని డొల్లతనం తొలివన్డేలో కొట్టొచ్చినట్లు కనిపించింది.

బ్యాటింగ్ లో బలంగా ఉన్నా..బౌలింగ్ లోపాలను సరిచేసుకోక పోతే భారత్ కు కష్టాలు తప్పవు.

ఓపెనర్ గిల్ సూపర్ ఫామ్ లో ఉన్నా..కెప్టెన్ రోహిత్, మాజీ కెప్టెన్ విరాట్, టీ-20 స్పెషలిస్ట్ సూర్యకుమార్, పాకెట్ డైనమైట్ ఇషాన్ భారీస్కోర్లు సాధించాలన్న పట్టుదలతో ఉన్నారు. యువఫాస్ట్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ కు తుదిజట్టులో చోటు దక్కుతుందా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.

రాయపూర్ లో తొలి అంతర్జాతీయ వన్డే...

చత్తిస్ ఘడ్ రాజధాని రాయపూర్ లో నిర్మించిన అంతర్జాతీయ స్టేడియంలో 60వేల మంది కూర్చోడానికి చోటుంది. దేశంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియాలలో ఒకటిగా పేరుపొందిన షహీద్ వీరనారాయణ సింగ్ ఇంటర్నేషనల్ స్టేడియం తొలిసారిగా ఓ అంతర్జాతీయ వన్డే మ్యాచ్ కు ఆతిథ్యమిస్తోంది.

ఇక్కడి పిచ్ ఎలా ఉంటుందో ఏ జట్టుకూ అర్థంకాని పరిస్థితి నెలకొని ఉంది.

గతంలో ఈ స్టేడియంలో వెటరన్ వన్డే సిరీస్ నిర్వహించి రికార్డు మాత్రమే ఉంది.

కొనసాగుతున్న భారత్ ఆధిక్యం...

ప్రస్తుత సిరీస్ లోని తొలివన్డే వరకూ న్యూజిలాండ్ ప్రత్యర్థిగా భారత్ ఆడిన 114 వన్డేలలో 56 విజయాలు, 50 పరాజయాల రికార్డు ఉంది. ఇక భారత్ వేదికగా న్యూజిలాండ్ తో ఆడిన 36 వన్డేలలో భారత్ కు 27 విజయాల రికార్డు ఉంది. న్యూజిలాండ్ కు భారత గడ్డపై కేవలం 8 విజయాలు మాత్రమే ఉన్నాయి.

ఈరోజు జరిగే రెండోవన్డేలో నెగ్గడం ద్వారా భారతగడ్డపై తన విజయాలసంఖ్యను 9కు పెంచుకోవాలన్న పట్టుదలతో న్యూజిలాండ్ ఉంది.

మధ్యాహ్నం 1-30 గంటలకు ప్రారంభమయ్యే ఈమ్యాచ్ రెండోఇన్నింగ్స్ లో బౌలింగ్ కు దిగిన జట్టుకు మంచుబెడద తప్పదు. టాస్ నెగ్గినజట్టు ముందుగా ఫీల్డింగ్ ఎంచుకొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

First Published:  21 Jan 2023 6:10 AM GMT
Next Story