Telugu Global
Sports

ఆవిరైన భారత మహిళాహాకీ ఒలింపిక్స్ ఆశలు!

2024- పారిస్ ఒలింపిక్స్ హాకీకి అర్హత సాధించడంలో భారత మహిళాజట్టు దారుణంగా విఫలమయ్యింది. అర్హత టోర్నీలో నాలుగోస్థానం మాత్రమే సాధించగలిగింది.

ఆవిరైన భారత మహిళాహాకీ ఒలింపిక్స్ ఆశలు!
X

2024- పారిస్ ఒలింపిక్స్ హాకీకి అర్హత సాధించడంలో భారత మహిళాజట్టు దారుణంగా విఫలమయ్యింది. అర్హత టోర్నీలో నాలుగోస్థానం మాత్రమే సాధించగలిగింది.

నిలకడలేమికి మరో పేరైన భారత మహిళాహాకీజట్టు మరోసారి విఫలమయ్యింది. పారిస్ ఒలింపిక్స్ కు అర్హత సాధించే పలు అవకాశాలను చేజార్చుకొని ఉసూరుమంటూ డీలా పడిపోయింది.

వెంటాడిన దురదృష్టం.....

రాంచీ వేదికగా జరుగుతున్న ఒలింపిక్స్ మహిళల అర్హత టోర్నీలో భారత్ ను దురదృష్టం అడగడుగునా వెంటాడింది. అందివచ్చిన అవకాశాలను భారతజట్టు సద్వినియోగం చేసుకోలేకపోయింది.

మొత్తం ఎనిమిది ( భారత్, అమెరికా, జర్మనీ, జపాన్, ఇటలీ,న్యూజిలాండ్, చెక్ రిపబ్లిక్, కజకిస్థాన్ ) దేశాలజట్లు తలపడిన ఈటోర్నీ మొదటి మూడుస్థానాలలో నిలిచినజట్లకే ఒలింపిక్స్ లో పాల్గొనే అవకాశం ఉంది.

గ్రూప్ -బి లీగ్ లో అమెరికాచేతిలో 1-0తో ఓడిన భారత్..ఆ తర్వాత జరిగిన రెండుమ్యాచ్ ల్లోనూ 3-1తో న్యూజిలాండ్, 5-1తో ఇటలీని చిత్తు చేయడం ద్వారా సెమీస్ కు అర్హత సాధించగలిగింది.

సెమీస్ లో జర్మనీచేతిలో భారత్ షూటౌట్...

హోరాహోరీగా సాగిన సెమీఫైనల్స్ లో గ్రూప్- ఏ టాపర్ ఇటలీకి భారత్ గట్టిపోటీ ఇచ్చినా పెనాల్టీషూటౌట్ లో 3-4 గోల్స్ తో పరాజయం పొందక తప్పలేదు. ఆటనిర్ణితసమయంలో రెండుజట్లూ 2-2తో సమఉజ్జీలుగా నిలవడంతో పెనాల్టీ షూటౌట్ పాటించారు. ఇందులోనూ భారత్ ను దురదృష్టమే వెంటాడింది.

కాంస్య పతకంతో పాటు..ఒలింపిక్స్ బెర్త్ కోసం జరిగిన కీలకపోరులో సైతం భారత్ 0-1తో జపాన్ చేతిలో ఓటమి పాలయ్యింది.

గురితప్పిన పెనాల్టీ కార్నర్లు...

జపాన్ తో నువ్వానేనా అన్నట్లుగా సాగిన 3,4 స్థానాల పోరులో భారత్ కు 9 పెనాల్టీ కార్నర్లు లభించినా కనీసం ఒక్కగోలూ సాధించలేకపోయింది. ఆట 6వ నిముషంలోనే తమకు లభించిన పెనాల్టీ కార్నర్ ను కానా ఉరాటా గోలుగా మలచడం ద్వారా జపాన్ కు 1-0 ఆధిక్యం సంపాదించి పెట్టింది. మొత్తం 60 నిముషాల ఆటలో జపాన్ తన ఆధిక్యాన్ని కాపాడుకోడం ద్వారా భారత్ పై 1-0 విజయంతో పారిస్ ఒలింపిక్స్ బెర్త్ ను సైతం సొంతం చేసుకోగలిగింది.

ఈ టోర్నీ ఫైనల్స్ చేరుకోడం ద్వారా అమెరికా,జర్మనీ జట్లు సైతం ఒలింపిక్స్ బెర్త్ లను ఖాయం చేసుకోగలిగాయి.

పురుషుల విభాగంలో భారతజట్టు ఆసియా క్రీడల బంగారు పతకం సాధించడం ద్వారా ఒలింపిక్స్ బెర్త్ ను కొద్దిమాసాల క్రితమే సాధించింది.

First Published:  20 Jan 2024 1:43 AM GMT
Next Story