Telugu Global
Sports

తొలి టీ-20కి వానదబ్బ, 2 పరుగులతో విజేత భారత్!

భారత్- ఐర్లాండ్ జట్ల తీన్మార్ టీ-20 సిరీస్ వాననడుమ ప్రారంభమయ్యింది. వర్షం కారణంగా అర్థంతరంగా ముగిసిన పోరులో భారత్ 2 పరుగుల తేడాతో విజేతగా నిలిచి 1-0 ఆధిక్యం సంపాదించింది.

తొలి టీ-20కి వానదబ్బ, 2 పరుగులతో విజేత భారత్!
X

భారత్- ఐర్లాండ్ జట్ల తీన్మార్ టీ-20 సిరీస్ వాననడుమ ప్రారంభమయ్యింది. వర్షం కారణంగా అర్థంతరంగా ముగిసిన పోరులో భారత్ 2 పరుగుల తేడాతో విజేతగా నిలిచి 1-0 ఆధిక్యం సంపాదించింది.

ధూమ్ ధామ్ టీ-20 క్రికెట్లో 12వ ర్యాంకర్ ఐర్లాండ్, ప్రపంచ నంబర్ వన్ ర్యాంకర్ భారత్ జట్ల తీన్మార్ సిరీస్ తొలిపోరు పూర్తిగా జరుగకుండానే 26.5 ఓవర్లకే పరిమితమయ్యింది.

డబ్లిన్ విలేజ్ గ్రౌండ్స్ వేదికగా జరిగిన ఈ తొలిపోరు ప్రారంభానికే ముందే వానదెబ్బ తగిలింది. ఆలస్యంగా మొదలైన ఈ మ్యాచ్ లో భారత కెప్టెన్ జస్ ప్రీత్ బుమ్రా ముందుగా కీలక టాస్ నెగ్గి ఫీల్డింగ్ ఎంచుకోడంతో ఐర్లాండ్ బ్యాటింగ్ కు దిగింది. ఈ మ్యాచ్ ద్వారా ఐపీఎల్ హోరీ రింకూసింగ్ అంతర్జాతీయ టీ-20 అరంగేట్రం చేశాడు.

బుమ్రా అదే మ్యాజిక్....

పదకొండు మాసాల విరామం తర్వాత తన తొలి అంతర్జాతీయమ్యాచ్ ఆడిన యార్కర్లకింగ్ జస్ ప్రీత్ బుమ్రా తన రీ-ఎంట్రీమ్యాచ్ లోనే అదరగొట్టాడు. పదునైన తన బౌలింగ్ తో ఐర్లాండ్ టాపార్డర్ ను గడగడలాడించాడు.

ఐరిష్ బ్యాటింగ్ ఆర్డర్లో కీలక బ్యాటర్లు బాల్ బిర్నీ, వన్ డౌన్ టుకర్ లను సింగిల్ డిజిట్ స్కోర్లకే పెవీలియన్ దారి పట్టించాడు. లెగ్ స్పిన్నర్ రవి బిష్నోయ్, బుమ్రా, ప్రసిద్ధ ముప్పేటదాడితో ఐరిష్ టాపార్డర్ పేకమేడలా కూలింది. 59 పరుగులకే 6 వికెట్లు నష్టపోయి పీకలోతు కష్టాలలో కూరుకుపోయింది.

బారీ మెకార్తీ ఫైటింగ్ హాఫ్ సెంచరీ..

వరుస వికెట్లు నష్టపోయి దిక్కుతోచని స్థితిలో పడిన ఐర్లాండ్ ను మిడిలార్డర్ బ్యాటర్లు కర్టిస్ కాంపెయిర్, బారీ మెకార్తీ ఆదుకొన్నారు. కర్టిస్ 33 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్ తో 39 పరుగులు, మెకార్తీ 33 బంతుల్లోనే 4 ఫోర్లు, 4 సిక్సర్లతో మెరుపు హాఫ్ సెంచరీ సాధించడంతో 20 ఓవర్లలో 7 వికెట్లకు 139 పరుగుల స్కోరు సాధించగలిగింది.

51 పరుగుల నాటౌట్ స్కోరుతో టాప్ స్కోరర్ గా నిలిచిన మెకార్తీ కి ఇదే తొలి టీ-20 హాఫ్ సెంచరీ కావడం విశేషం. లోవర్ ఆర్డర్ బ్యాటర్ మార్క్ అడెయిర్ 16 కీలక పరుగులతో తనవంతు పాత్ర నిర్వర్తించాడు.

భారత బౌలర్లలో బుమ్రా, ప్రసిద్ధ కృష్ణ, రవి బిష్నోయ్ తలో రెండు వికెట్లు, అర్షదీప్ సింగ్ ఒక వికెట్ పడగొట్టారు.

మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ బుమ్రా...

మ్యాచ్ నెగ్గాలంటే 20 ఓవర్లలో 140 పరుగుల టార్గెట్ తో చేజింగ్ కు దిగిన భారత్ కు ఓపెనింగ్ జోడీ యశస్వి జైశ్వాల్- రుతురాజ్ గయక్వాడ్ పవర్ ప్లే ఓవర్లలోనే 46 పరుగులతో మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు. యశస్వి 23 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్సర్ తో 24 పరుగులకు 46 పరుగుల స్కోరు వద్ద అవుటయ్యాడు. వన్ డౌన్ స్థానంలో బ్యాటింగ్ కు దిగిన తిలక్ వర్మ ఎదుర్కొన్న తొలి బంతికే అవుటయ్యాడు. పేస్ బౌలర్ యంగ్ బౌలింగ్ లో వికెట్ కీపర్ టకర్ కు క్యాచ్ ఇచ్చి తిలక్ వర్మ డకౌటయ్యాడు. అంతర్జాతీయ టీ-20ల్లో తన 6వ మ్యాచ్ మాత్రమే ఆడిన తిలక్ వర్మకు సున్నా పరుగుల స్కోరుకే అవుట్ కావడం ఇదే మొదటిసారి. భారత్ 6.2 ఓవర్లలో 46 పరుగులకే 2 వికెట్ల స్కోరు సాధించిన సమయంలో భారీవర్షంతో మ్యాచ్ నిలిచిపోయింది.

మ్యాచ్ ను కొనసాగించే పరిస్థితి లేకపోడంతో డక్ వర్త్ లూయిస్ విధానం ప్రకారం భారత్ ను 2 పరుగుల తేడాతో నెగ్గినట్లుగా మ్యాచ్ రిఫరీ ప్రకటించారు. భారత వైస్ కెప్టెన్ కమ్ ఓపెనర్ రుతురాజ్ గయక్వాడ్ 16 బంతుల్లో ఒక్కో ఫోర్, సిక్సర్ తో 19 పరుగులు, సంజు శాంసన్ 1 పరుగు నాటౌట్ స్కోర్లతో నిలిచారు. ఐర్లాండ్ బౌలర్లలో క్రెగ్ యంగ్ తన తొలి ఓవర్ 5 బంతుల్లోనే 2 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టడం విశేషం.

రీ-ఎంట్రీ హీరో, భారత కెప్టెన్ జస్ ప్రీత్ బుమ్రాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.బుమ్రా తన కోటా 4 ఓవర్లలో 24 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. సిరీస్ లోని రెండోమ్యాచ్ ఆగస్టు 20న సూపర్ సండే షోగా జరుగనుంది.

First Published:  19 Aug 2023 6:30 AM GMT
Next Story