Telugu Global
Sports

నేడే భారత్- ఐర్లాండ్ తొలి టీ-20 షో!

ధూమ్ ధామ్ టీ-20 టాప్ ర్యాంకర్ భారత్, 12వ ర్యాంకర్ ఐర్లాండ్ జట్ల తీన్మార్ సిరీస్ లోని తొలి పోరుకు డబ్లిన్ విలేజ్ గ్రౌండ్లో రంగం సిద్ధమయ్యింది. భారత కాలమాన ప్రకారం రాత్రి 7-30 గంటలకు ప్రారంభంకానుంది.

నేడే భారత్- ఐర్లాండ్ తొలి టీ-20 షో!
X

నేడే భారత్- ఐర్లాండ్ తొలి టీ-20 షో!

ధూమ్ ధామ్ టీ-20 టాప్ ర్యాంకర్ భారత్, 12వ ర్యాంకర్ ఐర్లాండ్ జట్ల తీన్మార్ సిరీస్ లోని తొలి పోరుకు డబ్లిన్ విలేజ్ గ్రౌండ్లో రంగం సిద్ధమయ్యింది. భారత కాలమాన ప్రకారం రాత్రి 7-30 గంటలకు ప్రారంభంకానుంది.

భారత్- ఐర్లాండ్ జట్ల ద్వైపాక్షిక టీ-20సిరీస్ కు డబ్లిన్ విలేజ్ గ్రౌండ్లో కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది. మూడుమ్యాచ్ ల ఈ సిరీస్ బరిలోకి యార్కర్ల కింగ్ జస్ ప్రీత్ బుమ్రా నాయకత్వంలో భారత్ బరిలోకి దిగుతుంటే..ఐర్లాండ్ జట్టుకు పాల్ స్టిర్లింగ్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు.

ఐసీసీ తాజా టీ-20 ర్యాంకింగ్స్ ప్రకారం భారత్ ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ జట్టుగా ఉంటే..పసికూన ఐర్లాండ్ 12వ ర్యాంక్ లో కొనసాగుతోంది.

ఇది సమఉజ్జీల సమరమేనా!

టాప్ ర్యాంక్ భారత్, 12వ ర్యాంక్ ఐర్లాండ్ జట్ల ఈ తీన్మార్ సిరీస్ ఏకపక్షంగా సాగుతుందా ? లేదా హోరాహోరీగా సాగుతుందా? అన్నప్రశ్నలు అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ర్యాంకింగ్స్ ప్రకారం రెండుజట్ల నడుమ 11 స్థానాల అంతరం ఉంది. అయితే ఆటతీరులోనూ అంత తేడా ఉంటుందా? అంటే చెప్పడం సాహసమే అవుతుంది.

20 ఓవర్లలోనే ముగిసి పోయే ఈ ఫార్మాట్లో ఏజట్టూ హాట్ ఫేవరెట్ గా ఉండదు. తమదైన రోజున చిన్నజట్లు పెద్దజట్లపై సంచలన విజయాలు సాధించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయితే..సిరీస్ మొత్తం నిలకడగా రాణించడం ఐర్లాండ్ లాంటి చిన్నజట్లకు అంతతేలిక కాదు. ఎక్కువమంది యువఆటగాళ్లతో కూడిన భారతజట్టును ఐర్లాండ్ ఎంత దీటుగా ఎదుర్కొంటుందన్న అంశంపైన తుది ఫలితం ఆధారపడి ఉంది.

బుమ్రా..11 మాసాల తరపున..

భారత తరుపుముక్క, యార్కర్లకింగ్ జస్ ప్రీత్ బుమ్రా 11 మాసాల సుదీర్ఘవిరామం తర్వాత తిరిగి రీ-ఎంట్రీ చేయబోతున్నాడు. వెన్నెముక గాయానికి శస్త్రచికిత్స చేయించుకొని, పూర్తి విశ్రాంతి తర్వాత నూటికి నూరుశాతం ఫిట్ నెస్ సాధించడంతో పాటు తగిన నెట్ ప్రాక్టీస్ తో తిరిగి జట్టుకు అందుబాటులోకి వచ్చాడు.

బుమ్రాకు వచ్చిరావడంతోనే టీ-20 పగ్గాలను టీమ్ మేనేజ్ మెంట్ అపజెప్పింది. గాయం నుంచి కోలుకొని వచ్చిన యువఫాస్ట్ బౌలర్ ప్రసిద్ధ కృష్ణ సైతం పునరాగమనం చేయనున్నాడు. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రస్తుత ఈ సిరీస్ బుమ్రాతో పాటు ప్రసిద్ధ కృష్ణకు మ్యాచ్ ఫిట్ నెస్ తో పాటు సత్తా చాటుకోడానికి అందివచ్చిన అవకాశం లాంటిదే.

ఆశలపల్లకిలో యువప్లేయర్లు...

జస్ ప్రీత్ బుమ్రా నాయకత్వంలోని 15 మంది సభ్యుల భారతజట్టులో ఎక్కువమంది యువఆటగాళ్లకు చోటు కల్పించారు. ఐపీఎల్ 16వ సీజన్లో నిలకడగా రాణించిన రింకు సింగ్, జితేశ్ శర్మ, శివం దూబేలకు ఐర్లాండ్ సిరీస్ పరీక్ష లాంటిదే. ఈ ముగ్గురిలో రింకూ సింగ్, శివమ్ దూబేలు తుదిజట్టులో చోటు సంపాదించడం ఖాయం కాగా..

ప్రధాన వికెట్ కీపర్ గా సంజు శాంసన్ ఉండడంతో..స్టాండ్ బై వికెట్ కీపర్ గా ఉన్న జితేశ్ శర్మకు భారత టీ-20 క్యాప్ దక్కడం అనుమానమే.

రితురాజ్ గయక్వాడ్, యశస్వి జైశ్వాల్, తిలక్ వర్మ, సంజు శాంసన్, రింగు సింగ్,శివం దుబే, వాషింగ్టన్ సుందర్ లతో భారతజట్టు సమతూకంతో కనిపిస్తోంది.

బౌలింగ్ విభాగంలో బుమ్రా, అర్షదీప్ సింగ్, ప్రసిద్ధ కృష్ణ, స్పిన్నర్లుగా వాషింగ్టన్ సుందర్, రవి బిష్నోయ్ కీలకపాత్ర పోషించనున్నారు. తిలక్ వర్మ, యశస్వి జైశ్వాల్ లను పార్ట్ టైమ్ బౌలర్లుగా ఉపయోగించుకొనే అవకాశం కూడా లేకపోలేదు.

సంచలనాలకు మరోపేరు ఐర్లాండ్...

మరోవైపు ..పాల్ స్టిర్లింగ్ నాయకత్వంలోని ఐర్లాండ్ జట్టును తక్కువగా అంచనా వేస్తే భారత్ కు కష్టాలు తప్పవు. తమదైన రోజున ప్రత్యర్థిజట్టు ఎంత బలమైనదైనా చిత్తు చేయగల సత్తా ఐర్లాండ్ జట్టుకు ఉంది.

స్టార్ పేసర్ జోషువా లిటిల్ ఐర్లాండ్ బౌలింగ్ ఎటాక్ కు కీలకం కానున్నాడు. యాండ్రూ బాల్ బిర్నీ, టక్కర్, హారీ టెక్టార్, జార్జి డోక్రెల్, గారెత్ డెలానీ, కర్టిస్ కాంఫెర్, మార్క్ అడెయిర్, బారీ మెకార్తీ, బెంజామిన్ వైట్, జోషువా లిటిల్ లతో ఐరిష్ టీమ్ సమతూకంతో కనిపిస్తోంది.

పరుగుల గని డబ్లిన్ విలేజ్ గ్రౌండ్ ...

ఈ సిరీస్ కు ఆతిథ్యమిస్తున్న డబ్లిన్ విలేజ్ గ్రౌండ్ కు పరుగుల గనిగా పేరుంది. ఇదే గ్రౌండ్లో ఇప్పటి వరకూ ఐదుసార్లు 200కు పైగా స్కోర్లు నమోదైతే ..అందులో మూడుసార్లు 200 స్కోర్ల రికార్డు భారత్ పేరుతోనే ఉంది.

భారత కాలమాన ప్రకారం రాత్రి 7-30 గంటలకు ప్రారంభమయ్యే ఈమ్యాచ్ హోరాహోరీగా సాగుతుందా? లేక ఏకపక్షంగా ముగిసిపోతుందా? తెలుసుకోవాలంటే మరికొద్ది గంటలపాటు వేచిచూడక తప్పదు.

First Published:  18 Aug 2023 7:05 AM GMT
Next Story