Telugu Global
Sports

రసపట్టుగా భారత్- బంగ్లా ఆఖరిటెస్టు!

బంగ్లాదేశ్ తో ఆఖరిటెస్ట్ ఆఖరిరోజు ఆట 2వ ర్యాంకర్ భారత్ కు జీవన్మరణ సమస్యగా మారింది. మ్యాచ్ తో పాటు సిరీస్ స్వీప్ సాధించాలంటే 100 పరుగులు చేయాల్సి ఉంది.

రసపట్టుగా భారత్- బంగ్లా ఆఖరిటెస్టు!
X

బంగ్లాదేశ్ తో ఆఖరిటెస్ట్ ఆఖరిరోజు ఆట 2వ ర్యాంకర్ భారత్ కు జీవన్మరణ సమస్యగా మారింది. మ్యాచ్ తో పాటు సిరీస్ స్వీప్ సాధించాలంటే 100 పరుగులు చేయాల్సి ఉంది. బ్యాటింగ్ కు ఏమాత్రం అనువుగాలేని మీర్పూర్ పిచ్ పైన అదేమంత తేలికకాదు......

ఐసీసీ టెస్టు లీగ్ లో భాగంగా రెండోర్యాంకర్ భారత్, 9వ ర్యాంకర్ బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతున్న రెండుమ్యాచ్ ల సిరీస్ లోని ఆఖరిటెస్టు ఆఖరి రోజు ఆట రసపట్టుగా మారింది. ఇటు భారత్..అటు బంగ్లాజట్లు నువ్వానేనా అన్నట్లుగా పోరాడుతున్నాయి.

మీర్పూర్ లోని షేరే- నేషనల్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ ఆఖరిరోజు ఆట లో భారత్ 80 ఓవర్లలో 100 పరుగులు చేయాల్సి ఉంది. అయితే భారత్ మాత్రం 5 వికెట్ల నష్టానికి 59 పరుగుల స్కోరుతో ఎదురీదుతోంది. అదే బంగ్లాజట్టు విజేతగా నిలవాలంటే మరో 5 వికెట్లు పడగొట్టాల్సి ఉంది.

బంగ్లా కల నెరవేరేనా?

భారత్ ప్రత్యర్థిగా గత రెండుదశాబ్దాల కాలంలో వన్డే, టీ-20 మ్యాచ్ ల్లో విజయాలు సాధించిన బంగ్లాజట్టు..టెస్టు క్రికెట్లో మాత్రం ఒక్కమ్యాచ్ నెగ్గలేకపోయింది. గత 22 సంవత్సరాల కాలంలో ద్వైపాక్షిక సిరీస్ ల్లో భాగంగా భారత్ తో ప్రస్తుత సిరీస్ లోని తొలిటెస్టు వరకూ 12 మ్యాచ్ లు ఆడిన బంగ్లాజట్టు 0-10 రికార్డుతో ఉంది. 10 పరాజయాలు, 2 డ్రాల రికార్డుతో నిలిచింది. అయితే... టెస్టుల్లో తొలివిజయం సాధించాలన్న రెండుదశాబ్దాల చిరకాల స్వప్నాన్ని ప్రస్తుత సిరీస్ లోని ఆఖరిటెస్టు ద్వారా తీర్చుకొనే సువర్ణ అవకాశం వచ్చింది. పరిస్థితి ఇప్పుడు కాకపోతే మరెప్పుడూ కాదన్నట్లుగా తయారయ్యింది.

తొలిటెస్టులో 188 పరుగుల ఘోరపరాజయం చవిచూసినా..ఆఖరి టెస్టులో బంగ్లాజట్టు స్థాన బలంతో భారత్ కు గట్టిపోటీ ఇస్తోంది. తొలిఇన్నింగ్స్ లో 227 పరుగులకే కుప్పకూలిన బంగ్లాజట్టు...రెండో ఇన్నింగ్స్ లో 231 పరుగుల స్కోరు సాధించడం ద్వారా పుంజుకోగలిగింది. లిట్టన్ దాస్ 73 పరుగుల ఫైటింగ్ స్కోరుకు...లోయర్ ఆర్డర్ ఆటగాళ్లు నూరుల్ హసన్, టాస్కిన్ అహ్మద్ చెరో 31 పరుగుల చొప్పున సాధించడం ద్వారా తమజట్టును పటిష్ట స్థితిలో నిలిపారు.

స్పిన్నర్లపైనే గెలుపు భారం..

మీర్పూర్ పిచ్ స్పిన్నర్లపాలిట స్వర్గంగా మారడంతో పరుగులు చేయటం అంత తేలికకాదు. స్పిన్ బౌలర్ల హవానే కొనసాగుతోంది. తొలిఇన్నింగ్స్ లో 87 పరుగుల కీలక ఆధిక్యత సాధించిన భారత్ రెండో ఇన్నింగ్స్ లో మాత్రం 45 పరుగులకే టాపార్డర్ లోని మొదటి నాలుగు వికెట్లు నష్టపోయి ఎదురీత మొదలు పెట్టింది. నైట్ వాచ్ మన్ ఉనద్కత్ సైతం 13 పరుగులకే వెనుదిరిగాడు. భారత్ మ్యాచ్ నెగ్గాలంటే మరో 74 పరుగులు చేయాల్సి ఉంది. రిషభ్ పంత్, అక్షర్ పటేల్, శ్రేయస్ అయ్యర్ , అశ్విన్ ల పైనే భారత్ విజయం ఆధారపడి ఉంది.

మరోవైపు..బంగ్లా స్పిన్నర్లు మెహిదీ హసన్ 3 వికెట్లు, షకీబుల్ 2 వికెట్లు పడగొట్టారు. మరో స్పిన్నర్ తైజుల్ సైతం కీలకం కానున్నాడు.

First Published:  25 Dec 2022 5:14 AM GMT
Next Story