Telugu Global
Sports

విజేత ఆస్ట్రేలియా.. కల చెదిరిన భారత్!

ఐసీసీ వన్డే ప్రపంచకప్ విజేతగా ఆస్ట్రేలియా నిలిచింది. మరోసారి భారత ప్రపంచకప్ కల చెదిరింది. మోడీస్టేడియంలో..మోడీ సమక్షంలో రోహిత్ సేన 6 వికెట్ల పరాజయం చవిచూసింది.

విజేత ఆస్ట్రేలియా.. కల చెదిరిన భారత్!
X

ఐసీసీ వన్డే ప్రపంచకప్ విజేతగా ఆస్ట్రేలియా నిలిచింది. మరోసారి భారత ప్రపంచకప్ కల చెదిరింది. మోడీస్టేడియంలో..మోడీ సమక్షంలో రోహిత్ సేన 6 వికెట్ల పరాజయం చవిచూసింది...

వన్డే ప్రపంచకప్ ను 12 సంవత్సరాల విరామం తరువాత తిరిగి గెలుచుకోవాలన్న మాజీ చాంపియన్ భారత్ కల మరోసారి చెదిరింది. భారత్ వేదికగా జరిగిన 2023 ప్రపంచకప్ లీగ్ దశ నుంచి నాకౌట్ సెమీస్ వరకూ వరుసగా 10 విజయాలు సాధించిన భారత్..టైటిల్ సమరంగా జరిగిన 11వ మ్యాచ్ లో అనూహ్యంగా పరాజయం చవిచూసింది. దేశవిదేశాలలోని కోట్లాదిమంది అభిమానులకు గుండెకోతను మిగిల్చింది.

కొంపముంచిన స్లో వికెట్....

ప్రపంచకప్ కు వేదికగా నిలిచిన నరేంద్ర మోడీ స్టేడియం మందకొడి పిచ్ భారత్ పాలిట శాపంగా మారింది. ఐదుసార్లు విజేత, అత్యంత ప్రమాదకరమైన ప్రత్యర్థిగా పేరున్న ఆస్ట్రేలియాతో జరిగిన టైటిల్ పోరులో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన భారత్ 50 ఓవర్లలో 240 పరుగుల స్కోరు మాత్రమే సాధించగలిగింది.

కంగారూ బౌలర్లు, ఫీల్డర్లూ అసాధారణంగా, కలసి కట్టుగా రాణించడంతో భారత టాపార్డర్ చేష్టలుడిగిపోయింది.

ఓపెనర్ రోహిత్ శర్మ తనదైన శైలిలో 31 బంతుల్లోనే 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 47 పరుగుల స్కోరుతో మెరుపు ఆరంభాన్ని ఇచ్చినా ..యువఓపెనర్ శుభ్ మన్ గిల్ 4, వరుస సెంచరీల హీరో శ్రేయస్ అయ్య్రర్ 4, ఎవర్ డిపెండబుల్ జడేజా 9, వీరబాదుడు స్పెషలిస్ట్ సూర్యకుమార్ యాదవ్ 18 పరుగుల స్కోర్లకే అవుటయ్యారు.

సీనియర్ స్టార్లు రోహిత్ 47, విరాట్ కొహ్లీ ( 63 బాల్స్ లో 54 పరుగులు ) , కెఎల్ రాహుల్ ( 107 బంతుల్లో 66 పరుగులు ) తమవంతు ప్రయత్నం చేసినా..భారత్ ను 240 పరుగుల స్కోర్లకే ఆస్ట్రేలియా కట్టడి చేయగలిగింది.

ట్రావిస్ హెడ్- లబుషేన్ షో...

మ్యాచ్ నెగ్గాలంటే 50 ఓవర్లలో 241 పరుగుల లక్ష్యంతో చేజింగ్ కు దిగిన ఆస్ట్రేలియా ఒకదశలో 6.6 ఓవర్లలో 43 పరుగులకే 3 టాపార్డర్ వికెట్లు నష్టపోయి ఎదురీత మొదలు పెట్టింది. అయితే డాషింగ్ ఓపెనర్ ట్రావిస్ హెడ్- లబుషేన్ 4వ వికెట్ కు సెంచరీభాగస్వామ్యంతో కంగారూజట్టుకు విజయం ఖాయం చేశారు.

ట్రావిస్ హెడ్ 120 బంతుల్లో 15 ఫోర్లు, 4 సిక్సర్లతో 137 పరుగుల సూపర్ సెంచరీ సాధించగా..లబుషేన్ 110 బంతుల్లో 4 ఫోర్లతో 58 పరుగుల నాటౌట్ స్కోరుతో నిలిచాడు.

ఆస్ట్రేలియా 43 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికే విజయలక్ష్యం చేరుకోగలిగింది. భారత బౌలర్లలో బుమ్రా 2 వికెట్లు, షమీ, సిరాజ్ చెరో వికెట్ పడగొట్టారు. స్పిన్ జోడీ జడేజా, కుల్దీప్ యాదవ్ ఇద్దరూ దారుణంగా విఫలమయ్యారు.

ఇప్పటి వరకూ బ్యాటింగ్, బౌలింగ్ బలంతో వరుసగా 10 విజయాలు సాధించిన భారత్ ఫైనల్లో మాత్రం రెండు విభాగాలలోనూ దారుణంగా విఫలం కావడం ద్వారా ఓటమి చవిచూసింది.

ఆస్ట్రేలియా విజయంలో ప్రధానపాత్ర వహించిన ఓపెనర్ ట్రావిస్ హెడ్ కు ప్లేయర్ ఆఫ్ ది ఫైనల్స్ అవార్డు దక్కింది.

ఆస్ట్రేలియా సరికొత్త ప్రపంచ రికార్డు...

48 సంవత్సరాల వన్డే ప్రపంచకప్ చరిత్రలో ఆరవసారి టైటిల్ నెగ్గిన ఏకైక, తొలిజట్టుగా ఆస్ట్రేలియా నిలవడం ద్వారా తన రికార్డును తానే అధిగమించగలిగింది. ఇప్పటి వరకూ 8సార్లు ప్రపంచకప్ ఫైనల్స్ చేరిన కంగారూజట్టు 6 విన్నర్, 2 రన్నరప్ ట్రోఫీలు అందుకోగలిగింది.

ఇక..భారత్ ప్రత్యర్థిగా ప్రపంచకప్ లో 15సార్లు తలపడిన ఆస్ట్రేలియాకు ఇది 9వ విజయం కావడం విశేషం. ప్రస్తుత ప్రపంచకప్ టోర్నీలో వరుసగా 10 విజయాలు సాధించిన భారత్ రన్నరప్ గా నిలిస్తే లీగ్ దశ నుంచి ఫైనల్స్ వరకూ 9 విజయాలు మాత్రమే సాధించిన ఆస్ట్రేలియా విశ్వవిజేతగా నిలువగలిగింది.

ప్రపంచకప్ ట్రోఫీని ఆరవసారి అందుకోడం ద్వారా కంగారూజట్టు 33 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ చెక్ ను సైతం సొంతం చేసుకోగలిగింది.

విరాట్, షమీ, రోహిత్ టాప్...

2023 వన్డే ప్రపంచకప్ లో అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా భారత్ నిలిస్తే..అత్యధిక పరుగులు, వికెట్లు, సిక్సర్లు సాధించిన ప్లేయర్లుగా విరాట్ కొహ్లీ, మహ్మద్ షమీ, రోహిత్ శర్మ నిలిచారు.

విరాట్ కొహ్లీ మొత్తం 11 మ్యాచ్ ల్లో 765 పరుగులతో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ గా, ప్లేయర్ ఆఫ్ ది ప్రపంచకప్ గా నిలిచాడు. విరాట్ మొత్తం 6 హాఫ్ సెంచరీలు, 3 సెంచరీలతో 90.31 స్ట్ర్రయిక్ రేట్, 95.62 సగటు నమోదు చేశాడు.

బౌలింగ్ విభాగంలో మహ్మద్ షమీ 24 వికెట్లతో నంబర్ వన్ బౌలర్ గా నిలిచాడు. న్యూజిలాండ్ తో జరిగిన సెమీఫైనల్లో షమీ 57 పరుగులిచ్చి 7 వికెట్లతో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు.

భారత కెప్టెన్ రోహిత్ శర్మ పవర్ ప్లే ( మొదటి 10 ) ఓవర్లలో అత్యధిక పరుగులు, అత్యధిక సిక్సర్లు సాధించిన మొనగాడిగా నిలిచాడు. రోహిత్ అత్యధికంగా 31 సిక్సర్లు బాదడం ద్వారా సరికొత్త ప్రపంచకప్ రికార్డు సాధించాడు. అంతేకాదు..ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక పరుగులు సాధించిన కెప్టెన్ గా కూడా రోహిత్ మరో రికార్డు నెలకొల్పాడు.

2003 ప్రపంచకప్ ఫైనల్లో 125 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పొందిన భారత్ కు 2023 ప్రపంచకప్ ఫైనల్లో సైతం 6 వికెట్ల పరాజయం ఎదురయ్యింది.

నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ..ప్రధాని మోదీ సమక్షంలో భారతజట్టు ప్రపంచకప్ ఫైనల్లో ఓటమి పొందటం...భారతగడ్డపై నాలుగోసారి జరిగిన ప్రపంచకప్ కు ముక్తాయింపుగా మిగిలిపోతుంది.

First Published:  20 Nov 2023 2:08 AM GMT
Next Story