Telugu Global
Sports

రసపట్టుగా భారత్- ఆస్ట్ర్రేలియా మహిళాటెస్ట్!

భారత్- ఆస్ట్ర్రేలియా మహిళాజట్ల ఏకైక టెస్టుమ్యాచ్ లో ఆధిక్యత చేతులు మారుతూ రసపట్టుగా సాగుతోంది. మూడోరోజుఆట ముగిసే సమయానికే భారత్ ను విజయం ఊరిస్తోంది.

రసపట్టుగా భారత్- ఆస్ట్ర్రేలియా మహిళాటెస్ట్!
X

భారత్- ఆస్ట్ర్రేలియా మహిళాజట్ల ఏకైక టెస్టుమ్యాచ్ లో ఆధిక్యత చేతులు మారుతూ రసపట్టుగా సాగుతోంది. మూడోరోజుఆట ముగిసే సమయానికే భారత్ ను విజయం ఊరిస్తోంది....

ముంబై వాంఖడే స్టేడియం వేదికగా ప్రపంచ మహిళా క్రికెట్ దిగ్గజం ఆస్ట్ర్రేలియాతో జరుగుతున్న ఏకైకటెస్టుమ్యాచ్ నువ్వానేనా అన్నట్లుగా సాగుతూ రోజుకో మలుపు తిరుగుతోంది.

మొదటి రెండురోజుల ఆటలో ఆతిథ్య భారత్ పైచేయి సాధించినా..మూడోరోజుఆట రెండో ఇన్నింగ్స్ లో ఆస్ట్ర్రేలియా ఎదురుదాడితో పుంజుకోటానికి ప్రయత్నించినా..భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ కొట్టిన దెబ్బ మీద దెబ్బతో కంగారూజట్టు విలవిలలాడుతోంది.

46 పరుగుల ఆధిక్యంలో ఆస్ట్ర్రేలియా...

ఆతిథ్య భారత్ తొలిఇన్నింగ్స్ స్కోరు 406 పరుగులకు సమాధానంగా తన తొలిఇన్నింగ్స్ లో 219 పరుగులు చేసిన కంగారూజట్టు..రెండో ఇన్నింగ్స్ లో 5 వికెట్లకు 233 పరుగులతో పోరాడుతోంది.

తొలిఇన్నింగ్స్ లో భారత్ ను 406 పరుగులకు కంగారూజట్టు ఆలౌట్ చేయగలిగింది. భారత బ్యాటర్లలో దీప్తి శర్మ 78, స్మృతి మందన 74, జెమీమా రోడ్రిగేజ్ 73, రిచా ఘోష్ 52 పరుగుల స్కోర్లు సాధించడంతో భారత్ భారీస్కోరు సాధించగలిగింది.

కంగారూబౌలర్లలో గార్డ్నర్ 100 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టింది.

భారత కెప్టెన్ దెబ్బ మీద దెబ్బ.....

భారీ తొలిఇన్నింగ్స్ లోటుతో రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన కంగారూజట్టు ఎదురుదాడి వ్యూహంతో కొంతమేరకు సఫలమయ్యింది. ఓపెనర్లు బెత్ మూనీ 33, లిచ్ ఫీల్డ్ 18 పరుగులకు అవుట్ కాగా..వన్ డౌన్ ఎల్సీ పెర్రీ 91 బంతుల్లో 5 బౌండ్రీలతో 45 పరుగులు, రెండోడౌన్ తాహిలా మెక్ గ్రాత్ 177 బంతుల్లో 10 ఫోర్లతో 77 పరుగులు, కెప్టెన్ అలీసా హేలీ 101 బంతుల్లో 32 పరుగుల స్కోర్లు నమోదు చేశారు.

కంగారూజట్టు భారీస్కోరు సాధించాలన్న పట్టుదలతో ఉన్న సమయంలో భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ వెంట వెంటనే రెండు కీలక వికెట్లు పడగొట్టడం ద్వారా భారత్ కు పైచేయి సాధించి పెట్టింది.

తాహీలా మెక్ గ్రాత్, అలీసా హేలీల వికెట్లను హర్మన్ ప్రీత్ పడగొట్టడంతో కంగారూజట్టు 221 పరుగులకే 5 టాపార్డర్ వికెట్లు కోల్పోయింది. మిడిలార్డర్ బ్యాటర్లు అనాబెల్ సదర్లాండ్ 12, యాష్లీగా గార్డ్నర్ 7 పరుగులతో క్రీజులో ఉన్నారు.

భారత బౌలర్లలో స్నేహ రాణా, హర్మన్ ప్రీత్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. మూడోరోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్ర్రేలియా తొలి ఇన్నింగ్స్ లోటును పూడ్చుకోగలిగినా..ఓవరాల్ గా 46 పరుగుల ఆధిక్యత మాత్రమే సాధించగలిగింది. సదర్లాండ్- గార్డ్నర్ జోడీ 6వ వికెట్ కు 62 బంతులు ఎదుర్కొని 12 పరుగులు మాత్రమే జోడించ గలిగారు. కంగారూజట్టు చేతిలో మరో 5 వికెట్లు మాత్రమే మిగిలిఉన్నాయి.

ఈరోజు జరిగే ఆఖరిరోజు ఆటలో భారత్ మరో 100 పరుగుల లోపే ఆస్ట్ర్రేలియా చివరి 10 వికెట్లు పడగొట్టగలిగితే..సంచలన విజయం నమోదు చేసే అవకాశం ఉంది.

అరుదైన గెలుపు ముంగిట్లో భారత్...

ఆస్ట్ర్రేలియా ప్రత్యర్థిగా ప్రస్తుత ఈ టెస్టుకు ముందు వరకూ 10 మ్యాచ్ లు ఆడిన భారత్ 4 పరాజయాలు, 6 మ్యాచ్ ల డ్రా రికార్డు తో ఉంది. పవర్ ఫుల్ కంగారూజట్టును తొలిసారిగా ఓటెస్టుమ్యాచ్ లో కంగుతినిపించే అరుదైన అవకాశం ఇప్పుడు భారత్ కు చేరువయ్యింది.

గతవారం నవీముంబై వేదికగా జరిగిన టెస్టులో 347 పరుగులతో ఇంగ్లండ్ ను చిత్తు చేసిన భారత మహిళాజట్టు..ఈ రోజుఆటలో ఆస్ట్ర్రేలియాను సైతం ఓడించగలిగితే అది సరికొత్త చరిత్రే అవుతుంది.

First Published:  24 Dec 2023 2:30 AM GMT
Next Story