Telugu Global
Sports

భారత్ కు గత పదేళ్లలో ఇదే తొలి స్వదేశీ ఓటమి!

సాంప్రదాయ టెస్టు క్రికెట్లో సొంతగడ్డపై అజేయమైన జట్టుగా నిలిచిన భారత్ ను టాప్ ర్యాంకర్ ఆస్ట్ర్రేలియా దిమ్మతిరిగిపోయే దెబ్బ కొట్టింది.

భారత్ కు గత పదేళ్లలో ఇదే తొలి స్వదేశీ ఓటమి!
X

నాగపూర్, ఢిల్లీ టెస్టు విజయాలతో గాల్లో తేలిపోతున్న భారత్..ఇండోర్ టెస్టు పరాజయంతో నేలమీదకు దిగి వచ్చింది. గత దశాబ్దకాలంలో సొంతగడ్డపై తొలి ఓటమితో కుదేలైపోయింది....

సాంప్రదాయ టెస్టు క్రికెట్లో సొంతగడ్డపై అజేయమైన జట్టుగా నిలిచిన భారత్ ను టాప్ ర్యాంకర్ ఆస్ట్ర్రేలియా దిమ్మతిరిగిపోయే దెబ్బ కొట్టింది. నాలుగుమ్యాచ్ ల బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ సిరీస్ లో భాగంగా నాగపూర్, ఢిల్లీ టెస్టుల్లో ఎదురైన మూడోరోజుల పరాజయాలకు..ఇండోర్ టెస్టును రెండున్నర రోజుల్లోనే గెలుచుకోడం ద్వారా కంగారూజట్టు బదులు తీర్చుకోగలిగింది.

గత ఆరేళ్ల భారతగడ్డపై తొలిగెలుపు...

అత్యంత పటిష్టమైన ఆస్ట్ర్రేలియాజట్టు ఇండోర్ టెస్టును 9 వికెట్లతో నెగ్గడం ద్వారా..భారతగడ్డపై గత ఆరేళ్లకాలంలో తొలి టెస్టు విజయం నమోదు చేయగలిగింది.

తమ కోసం పన్నిన స్పిన్ ఉచ్చులో ప్రత్యర్థి భారత్ నే బిగించడంలో ముగ్గురు స్పిన్నర్లతో కూడిన కంగారూజట్టు పూర్తిస్థాయిలో సఫలం కాగలిగింది.

భారత్ ను తొలి ఇన్నింగ్స్ లో కేవలం తొలిరోజు ఆటలోనే 109 పరుగులకే కుప్పకూల్చడంతోనే మ్యాచ్ లో సగం విజయం సాధించగలిగింది. తొలి ఇన్నింగ్స్ లో 88 పరుగుల నిర్ణయాత్మక తొలి ఇన్నింగ్స్ ఆధిక్యత సాధించడంతో పాటు..రెండో ఇన్నింగ్స్ లో సైతం భారత్ ను 162 పరుగులకే కట్టడి చేయటం ద్వారా అలవోక విజయం అందుకోగలిగింది.

అతితక్కువ బంతుల్లో ముగిసిన టెస్ట్ మ్యాచ్..

ఐదురోజులపాటు సాగే టెస్టు క్రికెట్ నాలుగు ఇన్నింగ్స్ లో కలిపి రెండుజట్లూ.. రోజుకు 480 బంతులు (కనీసం 80 ఓవర్లు ) చొప్పున 2400 బంతులు వేయాల్సి ఉంది.

అయితే..భారతగడ్డపై జరిగిన టెస్టుమ్యాచ్ ల్లో అతితక్కువ బంతుల్లో ముగిసిన పోటీగా 2023 సిరీస్ లోని ఇండోర్ టెస్టు రికార్డుల్లో చేరింది.

కేవలం రెండున్నర రోజుల కంటే తక్కువ వ్యవధిలోనే...కేవలం 1135 బంతుల్లోనే ముగిసిన మ్యాచ్ గా ఇండోర్ టెస్టు రికార్డుల్లో చోటు సంపాదించింది.

భారత టెస్టు చరిత్రలో అతితక్కువ బంతులు లేదా ఓవర్లలో ముగిసిన టెస్టుల్లో 1951-52 సిరీస్ లో ఇంగ్లండ్ తో కాన్పూర్ గ్రీన్ పార్క్ వేదికగా జరిగిన టెస్టు 1459 బంతులకే పరిమితమయ్యింది.

1983-84 సిరీస్ లో భాగంగా కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా వెస్టిండీస్ తో జరిగిన టెస్టు 1474 బంతుల్లోనూ, 2000-01 సిరీస్ లో భాగంగా ముంబై వేదికగా ఆస్ట్ర్ర్రేలియాతో జరిగిన టెస్టు సైతం 1476 బాల్స్ లోనూ ముగిశాయి.

2012-13 తర్వాత ఇదే తొలి పరాజయం..

స్వదేశీ టెస్టు సిరీస్ ల్లో భారతజట్టు ముందుగా బ్యాటింగ్ కు దిగి ఓటమి పొందటం అత్యంత అరుదుగా మాత్రమే జరుగుతుంది. 2012-13 సిరీస్ లో భాగంగా కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఇంగ్లండ్ తో జరిగిన టెస్టుమ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ దిగి పరాజయం చవిచూసిన భారత్..ఆ తర్వాత పదేళ్లకాలంలో ముందుగా బ్యాటింగ్ కు దిగిన ప్రతిసారీ అజేయంగా నిలుస్తూ వచ్చింది.

అయితే..ఇండోర్ హోల్కార్ స్టేడియం వేదికగా ఆస్ట్ర్రేలియాతో జరిగిన మూడోటెస్టులో టాస్ నెగ్గి..ముందుగా బ్యాటింగ్ ఎంచుకొని మరీ తొలిరోజు ఆట టీ విరామానికి ముందే..109 పరుగుల స్కోరుకే ఆలౌట్ కావడమే కాదు..టెస్టుమ్యాచ్ ను సైతం 9 వికెట్లతో చేజార్చుకొంది.

అంతేకాదు..సొంతగడ్డపై కేవలం మూడురోజుల్లోనే భారత్ ఓటమి చవిచూసిన టెస్టుల జాబితాలో తాజాగా వచ్చి ఇండోర్ టెస్టు సైతం చేరింది.

2016-17 సిరీస్ లో భాగంగా పూనే వేదికగా ఆస్ట్ర్రేలియాతో, 2007-08 సిరీస్ లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా దక్షిణాఫ్రికా, 1999-00 సిరీస్ లో భాగంగా ముంబై వేదికగా వెస్టిండీస్, 1951-52 సిరీస్ లో భాగంగా కాన్పూర్ లో ఇంగ్లండ్ తో జరిగిన టెస్టుల్లో భారత్ మూడురోజుల్లోనే చిత్తు కావడం విశేషం.

టాస్ ఓడిన జట్లకే టెస్టు విజయాలు...

ప్రస్తుత బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ సిరీస్ లో భాగంగా నాగపూర్, ఢిల్లీ, ఇండోర్ వేదికలుగా జరిగిన మొదటి మూడుటెస్టుల్లో టాస్ ఓడిన జట్లు మాత్రమే విజేతలుగా నిలిచాయి. టాస్ నెగ్గిన జట్లు పరాజయాలు చవిచూడాల్సి వచ్చింది.

నాగపూర్ , ఢిల్లీటెస్టుల్లో ఆస్ట్ర్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ టాస్ నెగ్గితే ..టాస్ ఓడిన భారతజట్టు మూడురోజుల్లోనే టెస్టు విజయాలు నమోదు చేసి 2-0తో సిరీస్ ను నిలబెట్టుకొంది.

అయితే..మూడోటెస్టుకు వేదికగా నిలిచిన ఇండోర్ లో మాత్రం సీన్ రివర్స్ అయ్యింది. భారత కెప్టెన్ రోహిత్ శర్మ సిరీస్ లో తొలిసారిగా టాస్ నెగ్గిన బ్యాటింగ్ ఎంచుకోడమే కొంపముంచింది. టాస్ ఓడిన ఆస్ట్ర్రేలియా జట్టు మాత్రం 9 వికెట్ల విజయంతో విజేతగా నిలువగలిగింది.

మొత్తం మీద భారత గడ్డపై భారత్ ను ఓడించగల సత్తా ఉన్న అతికొద్దిజట్లలో ఒకటిగా ఆస్ట్ర్రేలియా తన ప్రత్యేకతను ఇండోర్ టెస్టు విజయంతో చాటుకోగలిగింది.

First Published:  3 March 2023 1:53 PM GMT
Next Story