Telugu Global
Sports

రు.300కే హైదరాబాద్ టీ-20 మ్యాచ్ టికెట్!

భారత్- ఆస్ట్రేలియా జట్ల మధ్య హైదరాబాద్ వేదికగా జరిగే టీ-20 మ్యాచ్ టికెట్ల విక్రయం ఈరోజు ప్రారంభమయ్యింది. కనీస టికెట్ ధరను 300 రూపాయలుగా నిర్ణయించారు.

రు.300కే హైదరాబాద్ టీ-20 మ్యాచ్ టికెట్!
X

భారత్- ఆస్ట్రేలియా జట్ల మధ్య హైదరాబాద్ వేదికగా జరిగే టీ-20 మ్యాచ్ టికెట్ల విక్రయం ఈరోజు ప్రారంభమయ్యింది. కనీస టికెట్ ధరను 300 రూపాయలుగా నిర్ణయించారు.

గత కొద్దిరోజులుగా కురిసిన వర్షాలతో చల్లబడిన హైదరాబాద్ నగరాన్ని టీ-20 క్రికెట్ వేడి తాకింది. ప్రపంచకప్ కు సన్నాహాలలో భాగంగా ఆస్ట్ర్రేలియా-భారత్ జట్ల తీన్మార్ టీ-20 సిరీస్ లో భాగంగా జరిగే ఆఖరిమ్యాచ్ కు హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా నిలిచింది.

సెప్టెంబర్ 25న రాజీవ్ స్టేడియం వేదికగా రాత్రి 8 గంటలకు ప్రారంభమయ్యే డే-నైట్ టీ-20 మ్యాచ్ నిర్వహణకు ఆతిథ్య హైదరాబాద్ క్రికెట్ సంఘం విస్త్రుతస్థాయిలో ఏర్పాట్లు చేసింది.

ఈ మ్యాచ్ టికెట్ల విక్రయాన్ని నిర్వాహక హైదరాబాద్ క్రికెట్ సంఘం ఈరోజే ప్రారంభించింది. మొత్తం 38వేల సీటింగ్ సామర్థ్యం కలిగిన రాజీవ్ స్టేడియం కనీస టికెట్ ధరను 300 రూపాయలుగా నిర్ణయించారు.

గతంలో జరిగిన మ్యాచ్ లకు 500 రూపాయలుగా ఉన్న కనీస టికెట్ ధరను ప్రస్తుత మ్యాచ్ లో మాత్రం 300 రూపాయలకు తగ్గించారు. అత్యధికంగా 10వేల రూపాయల తరగతి టికెట్లను సైతం అందుబాటులో ఉంచారు.

పేటియం ఇన్ సైడర్ ద్వారా టికెట్లు..

మ్యాచ్ చూడటానికి తహతహలాడుతున్న అభిమానులు తమకు కావాల్సిన టికెట్లను పేటీయం ఇన్‌సైడర్‌ ద్వారా కొనుగోలు చేయవచ్చు. మ్యాచ్ రోజున స్టేడియం కిటకిటలాడటం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు.

దుబాయ్ వేదికగా ఇటీవలే ముగిసిన 15వ ఆసియాకప్ సూపర్-4 రౌండ్ నుంచే ఇంటిదారి పట్టిన రోహిత్ శర్మ నాయకత్వంలోని భారత్ పూర్తిస్థాయిజట్టుతో ఆసీస్ తో సిరీస్ లో తలపడనుంది.

ఆరోన్ ఫించ్ నాయకత్వంలోని ఆస్ట్ర్రేలియా, రోహిత్ శర్మ కెప్టెన్సీలోని భారతజట్ల ఈ పోరు హోరాహోరీగా సాగే అవకాశం ఉంది. దానికితోడు సుదీర్ఘవిరామం తర్వాత హైదరాబాద్ వేదికగా టీ-20 అంతర్జాతీయమ్యాచ్ జరుగనుండడంతో కూడా..అభిమానులు భారీసంఖ్యలో స్టేడియానికి తరలి వచ్చే అవకాశం లేకపోలేదు.


60 నుంచి 100 కోట్ల ఆదాయం...

ఆస్ట్రేలియాతో తీన్మార్ టీ-20 సిరీస్ నిర్వహించడం ద్వారా బీసీసీఐ 300 నుంచి 500 కోట్ల రూపాయల వరకూ వ్యాపారం చేయనుంది. బ్రాడ్ కాస్టర్ నుంచే మూడుమ్యాచ్ లకూ కలపి 150 కోట్ల రూపాయల వరకూ ఆదాయం దక్కనుంది. ఇన్ స్టేడియా హక్కులు, గేట్ మనీ, ఇతర రూపాలలోనూ బీసీసీఐతో పాటు నిర్వాహక హైదరాబాద్ క్రికెట్ సంఘానికి ఆదాయం సమకూరనుంది.

మూడుమ్యాచ్ ల సిరీస్ లోని తొలిపోరుకు మొహాలీలోని పంజాబ్ క్రికెట్ సంఘం సెప్టెంబర్ 20న ఆతిథ్యమిస్తోంది. సిరీస్ లోని రెండుమ్యాచ్ ను నాగపూర్ లోని విదర్భ క్రికెట్ సంఘం స్టేడియం వేదికగా సెప్టెంబర్ 23న, సిరీస్ లోని ఆఖరిమ్యాచ్ ను 25న హైదరాబాద్ రాజీవ్ స్టేడియం వేదికగాను నిర్వహించనున్నారు.ఆస్ట్రేలియా వేదికగా అక్టోబర్ 2వ వారం నుంచి ప్రారంభమయ్యే టీ-20 ప్రపంచకప్ కు సన్నాహాలలో భాగంగా ప్రపంచ నంబర్ వన్ ర్యాంకర్ భారత్ ..మొత్తం ఆరు టీ-20 మ్యాచ్ ల్లో పాల్గోనుంది.

ఆస్ట్రేలియాతో తీన్మార్ సిరీస్ ముగిసిన వెంటనే దక్షిణాఫ్రికాతో సైతం మూడుమ్యాచ్ ల సిరీస్ లోనే తలపడనుంది.

First Published:  15 Sep 2022 5:58 AM GMT
Next Story