Telugu Global
Sports

నాగపూర్ లో నేటినుంచే స్పిన్ వార్!

నేటినుంచి ఐదురోజులపాటు జరిగే ఈ సమఉజ్జీల పోరు కోసం దేశవిదేశాలలోని కోట్లాదిమంది క్రికెట్ అభిమానులు ఎక్కడలేని ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.

నాగపూర్ లో నేటినుంచే స్పిన్ వార్!
X

నాగపూర్ లో నేటినుంచే స్పిన్ వార్!

ఐసీసీ టెస్టులీగ్ లో అతిపెద్ద సమరానికి నాగపూర్ లో తెరలేచింది. నేటినుంచి ఐదురోజులపాటు జరిగే ఈ మహాపోరులో రెండుజట్ల స్పిన్ బౌలర్లు అస్త్రశస్త్రాలతో కీలకం కానున్నారు...

సాంప్రదాయ టెస్టు క్రికెట్లో రెండు అత్యుత్తమజట్ల మహాయుద్ధంలో తొలిసమరానికి నాగపూర్ లోని విదర్భ క్రికెట్ స్టేడియం సకలహంగులతో ముస్తాబయ్యింది.

నేటినుంచి ఐదురోజులపాటు జరిగే ఈ సమఉజ్జీల పోరు కోసం దేశవిదేశాలలోని కోట్లాదిమంది క్రికెట్ అభిమానులు ఎక్కడలేని ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.

తీవ్రఒత్తిడిలో ఆతిథ్య భారత్..

ఐసీసీ టెస్టు లీగ్ ఫైనల్లో ఇప్పటికే ఆస్ట్ర్రేలియా అత్యధికపాయింట్లతో చోటు ఖాయం చేసుకోగా..రెండో బెర్త్ కోసం భారత్ పోటీ పడుతోంది. భారత్ తో పాటు దక్షిణాఫ్రికా సైతం రేసులో నిలవడంతో ఇప్పుడు రోహిత్ సేన తీవ్రఓత్తిడి నడుమ సొంతగడ్డపై పోటీకు సిద్ధమయ్యింది. నాలుగుమ్యాచ్ ల ఈ సీరీస్ లో భారత్ కనీసం 2-1తో నెగ్గినా ఫైనల్స్ కు చేరుకోగలుగుతుంది.

స్వదేశంలో తిరుగులేని భారత్..

స్వదేశీ పిచ్ లు, వాతావరణం, అభిమానుల నేపథ్యంలో గత దశాబ్దకాలంగా భారత్ ఆడిన 17 సిరీస్ ల్లో 15 విజయాలతో అత్యంత విజయవంతమైనజట్టుగా నిలిచింది.

ఓ టెస్టులో ఓటమి, మరో టెస్టు ను డ్రాగా ముగించిన భారత్ 88.88 శాతం విజయాలతో తిరుగులేని రికార్డును నమోదు చేసింది.

పైగా..బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ ద్వైపాక్షిక సిరీస్ ల్లో భాగంగా ఆస్ట్ర్రేలియాతో ఇంటాబయటా ఆడిన గత మూడు సిరీస్ ల్లోనూ భారతజట్టే విజేతగా నిలవడం మరో విశేషం.

కంగారూజట్టు ప్రత్యర్థిగా భారత్ ఆడిన గత మూడుసిరీస్ ల్లో అజేయంగా నిలవడం ఓ అసాధారణ ఘనతగా మిగిలిపోతుంది. భారత్ వేదికగా జరిగిన 2016-17 సిరీస్ , ఆస్ట్ర్రేలియా గడ్డపైన జరిగిన 2018- 19 సిరీస్, కంగారూల్యాండ్ వేదికగానే ముగిసిన 2020-21 సిరీస్ లో సైతం భారతజట్టే విజేతగా నిలిచింది.

ప్రస్తుత 2023 సిరీస్ కు మాత్రం భారత్ ఆతిథ్యమిస్తోంది.

సమఉజ్జీల సమరం..

రోజుకు 90 ఓవర్లు, నాలుగు ఇన్నింగ్స్, ఐదురోజులపాటు సెషన్ సెషన్ కూ ఆధిక్యత చేతులు మారుతూ సాగే టెస్టు క్రికెట్లో సమానబలం కలిగిన రెండుజట్లు తలపడితే ఆ మజాయే వేరు. ప్రస్తుత సిరీస్ సైతం అదే స్థాయిలో జరుగనుంది.

సూపర్ ఓపెనర్ రోహిత్ శర్మ నాయకత్వంలోని భారతజట్టు స్థానబలమే ప్రధాన అస్త్రంగా సమరానికి సై అంటోంది. విరాట్ కొహ్లీ, కెఎల్ రాహుల్, రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్, చతేశ్వర్ పూజారా, అశ్విన్, జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, భరత్ లాంటి ఆటగాళ్లతో భారతజట్టు సమతూకంతో ఉంట...

ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్ యాండీ కమ్మిన్స్ కెప్టెన్సీలోని కంగారూజట్టులో వార్నర్, స్మిత్, లబుషేన్, పీటర్ హ్యాండ్స్ కోంబ్, నేథన్ లయన్, ఆస్టన్ అగర్ లాంటి మొనగాళ్లున్నారు.

స్పిన్నర్ల స్వర్గం నాగపూర్ పిచ్...

ఈమ్యాచ్ కోసం సిద్ధం చేసిన పిచ్ ఆట రెండోరోజు నుంచే స్పిన్ బౌలర్లకు అనుకూలించే అవకాశం ఉండటంతో ..రెండుజట్లూ తుదిజట్టులోకి ముగ్గురు స్పిన్నర్లను తీసుకోడం ఖాయం గా కనిపిస్తోంది.

భారత తుదిజట్టులో ఆఫ్ స్పిన్నర్ అశ్విన్, లెఫ్టామ్ స్పిన్నర్ రవీంద్ర జడేజా కు చోటు ఖాయం కాగా..అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ లలో ఒకరికి చోటు దక్కనుంది.

మరోవైపు..ఆస్ట్ర్రేలియా మాత్రం తురుపుముక్క నేథన్ లయన్ తో పాటు అగర్ ను భారత్ పైకి ప్రయోగించనుంది.

ఫాస్ట్ , స్వింగ్ బౌలర్ల పాత్ర పరిమితంగానే కనిపిస్తున్నా..రివర్స్ స్వింగ్ తో పడగొట్టే వికెట్లు మ్యాచ్ ఫలితాన్ని శాసించనున్నాయి. టాస్ నెగ్గిన జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకొని భారీస్కోరు సాధించడం ద్వారా ప్రత్యర్థిని ఒత్తిడికి గురిచేసే వ్యూహాం అనుసరించనుంది.

ఆంధ్ర క్రికెటర్ భరత్ కు టెస్ట్ క్యాప్...!

తెలుగు ఆటగాడు, ఆంధ్ర వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ కెఎస్ భరత్ ..నాగపూర్ టెస్టు ద్వారా అరంగేట్రం చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. భారత నంబర్ వన్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ అందుబాటులో లేకపోడంతో వికెట్ కీపర్ స్థానం కోసం భరత్, ఇషాన్ కిషన్ పోటీపడుతున్నారు. అయితే ..భరత్ వైపే టీమ్ మేనేజ్ మెంట్ మొగ్గు చూపనుంది.

బ్యాటింగ్ ఆర్డర్ కే కీలకమైన 5వ నంబర్ స్థానం కోసం మిస్టర్ 360 స్ట్రోక్ మేకర్ సూర్యకుమార్ యాదవ్, యువఆటగాడు, సెంచరీల మొనగాడు శుభ్ మన్ గిల్ ల నడుమ ప్రధానంగా పోటీ నెలకొని ఉంది.

ప్రస్తుత ఫామ్ ను బట్టి చూస్తే..నయాస్టార్ శుభ్ మన్ గిల్ కే ఐదవడౌన్ బెర్త్ దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. ఐదురోజుల ఈ పోరులో నిలకడగా రాణించినజట్టుకే విజయావకాశాలు ఉంటాయి.

తొలిటెస్టు విజయంతో సిరీస్ పై పట్టు కోసం రెండుజట్లూ ఎదురుచూస్తున్నాయి. టెస్టు క్రికెట్లో అసలు సిసలు మజా ఏంటో చవిచూడాలంటే నాగపూర్ మ్యాచ్ చూడాల్సిందే మరి.

First Published:  9 Feb 2023 5:50 AM GMT
Next Story