Telugu Global
Sports

మొహాలీలో నేడే భారత్- ఆస్ట్రేలియా తొలి టీ-20

టీ-20 ప్రపంచకప్ కు తుదిసన్నాహాలలో భాగంగా భారత్, ఆస్ట్రేలియాజట్లు తీన్మార్ సిరీస్ లో భాగంగా తొలి టీ-20 పోరులో నేడు తలపడనున్నాయి

మొహాలీలో నేడే భారత్- ఆస్ట్రేలియా తొలి టీ-20
X

టీ-20 ప్రపంచకప్ కు తుదిసన్నాహాలలో భాగంగా భారత్, ఆస్ట్రేలియాజట్లు తీన్మార్ సిరీస్ లో భాగంగా తొలి టీ-20 పోరులో నేడు తలపడనున్నాయి. మొహాలీలోని పంజాబ్ క్రికెట్ సంఘం స్టేడియం వేదికగా రాత్రి 7 గంటలకు ఈ పోటీ ప్రారంభంకానుంది...

2022 టీ-20 ప్రపంచకప్ కు టాప్ ర్యాంకర్ భారత్, 6వ ర్యాంకర్ ఆస్ట్రేలియా జట్లు తుదిసన్నాహాలు ప్రారంభించాయి. ఆస్ట్ర్రేలియా వేదికగా అక్టోబర్-నవంబర్ మాసాలలో జరుగనున్న ఈ టోర్నీకి సన్నాహాకంగా ఈరోజు ప్రారంభమయ్యే తీన్మార్ టీ-20 సిరీస్ లో మాజీ చాంపియన్ భారత్ తో ప్రస్తుత చాంపియన్ ఆస్ట్ర్రేలియా అమీతుమీ తేల్చుకోనుంది.

భారత్ సత్తాకు అసలు పరీక్ష...

ప్రపంచ మేటి దిగ్గజజట్లలో ఒకటిగా పేరుపొందిన ఆస్ట్రేలియాతో ఈ రోజు జరిగే తొలి టీ-20 పోరు..రోహిత్ శర్మ నాయకత్వంలోని భారతజట్టుకు మాత్రమే కాదు..మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ విరాట్ కొహ్లీ సత్తాకు సైతం అసలు పరీక్షకానుంది.

దుబాయ్ వేదికగా ఇటీవలే ముగిసిన ఆసియాకప్ టోర్నీ సూపర్ -4 రౌండ్ నుంచే ఇంటిదారి పట్టిన భారత్ పూర్తిస్థాయి జట్టుతోనే ఈ సిరీస్ బరిలో నిలువనుంది.

ఓపెనర్ కమ్ వైస్ కెప్టెన్ కెఎల్ రాహుల్ తో పాటు...వన్ డౌన్ విరాట్ కొహ్లీకి సైతం కంగారూలతో సమరం అసలు సిసలు పరీక్షకానుంది.

విరాట్ తిరుగులేని రికార్డు

1020 రోజుల సుదీర్ఘవిరామం తర్వాత తనకెరియర్ లో మరో ( 71వ) శతకం సాధించడం ద్వారా విరాట్ తిరిగి ఫామ్ ను అందిపుచ్చుకోగలిగాడు. అయితే..అఫ్గనిస్థాన్ కంటే

బలమైన బౌలింగ్ ఎటాక్ కలిగిన ఆస్ట్రేలియాపై విరాట్ రాణించగలిగితేనే విమర్శకులకు పూర్తిస్థాయిలో సమాధానం చెప్పినవాడవుతాడు.

మొహాలీలోని పంజాబ్ క్రికెట్ సంఘం స్టేడియం వేదికగా ఆడిన రెండుకు రెండు టీ-20 మ్యాచ్ ల్లోనూ విరాట్ కొహ్లీకి తిరుగులేని రికార్డే ఉంది. 2016 టీ-20 ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్లో ఆస్ట్ర్రేలియా ప్రత్యర్థిగా జరిగిన పోటీలో విరాట్ 82 పరుగుల అజేయ స్కోరు సాధించాడు. కేవలం 51 బాల్స్ లోనే రెండు సిక్సర్లు, 9 బౌండ్రీలతో నాటౌట్ గా మిగిలాడు.

2019 సిరీస్ లో భాగంగా మొహాలీ వేదికగానే దక్షిణాఫ్రికాతో జరిగిన పోరులో సైతం విరాట్ 72 పరుగుల నాటౌట్ స్కోరు నమోదు చేశాడు. మొహాలీ వేదికగా ఆడిన రెండుకు రెండుమ్యాచ్ ల్లోనూ నాటౌట్ గా హాఫ్ సెంచరీలు సాధించిన విరాట్ రెండు ఇన్నింగ్స్ లో 154 పరుగులు సాధించాడు. 149.51 స్ట్ర్రయిక్ రేట్ నమోదు చేశాడు.

వికెట్ కీపర్ కోసం రెండుస్తంభాలాట!

మరోవైపు..వికెట్ కీపర్ స్థానాన్ని వెటరన్ దినేశ్ కార్తీక్ తోనే భర్తీ చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. యువవికెట్ కీపర్ రిషభ్ పంత్ కు బదులుగా తుదిజట్టులోకి దినేశ్ కార్తీక్ నే తీసుకోవాలని టీమ్ మేనేజ్ మెంట్ భావిస్తోంది.

గాయాల నుంచి కోలుకొని పూర్తి ఫిట్ నెస్ తో తిరిగి జట్టులో చేరిన ఫాస్ట్ బౌలర్ల త్రయం జస్ ప్రీత్ బుమ్రా, హర్షల్ పటేల్, ఉమేశ్ యాదవ్ సైతం సత్తాచాటుకోడానికి ఉరకలేస్తున్నారు.

భారత్ దే పైచేయి...

టీ-20 ఫార్మాట్లో 6వ ర్యాంకర్ ఆస్ట్ర్రేలియా ప్రత్యర్థిగా టాప్ ర్యాంకర్ భారత్ దే పైచేయిగా ఉంది. ఈ రెండుజట్లు ఇప్పటి వరకూ 23సార్లు తలపడితే భారత్ 13, ఆస్ట్ర్రేలియా 9 విజయాల రికార్డుతో ఉన్నాయి. ఓ మ్యాచ్ ఫలితం తేలకుండానే ముగిసిపోయింది.

ఈ రెండుజట్లూ ఆడిన గత ఆరుమ్యాచ్ ల్లో చెరో మూడు నెగ్గి 3-3తో సమఉజ్జీలుగా నిలిచాయి.

ఆరోన్ ఫించ్ నాయకత్వంలోని కంగారూజట్టు తనకంటే ఐదుర్యాంకులు పైనున్న భారత్ ను ప్రస్తుత సిరీస్ లో ముప్పతిప్పలు పెట్టడం ఖాయం.

ఇక..మొహాలీ స్టేడియం వేదికగా రాత్రి 7 గంటలకు ప్రారంభయ్యే ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గిన జట్టు ముందుగా బ్యాటింగ్ వైపే మొగ్గు చూపే అవకాశాలున్నాయి. 180కి పైగా స్కోరు సాధించిన జట్టుకే విజయావకాశాలు ఉంటాయి.

First Published:  20 Sep 2022 4:57 AM GMT
Next Story