Telugu Global
Sports

నువ్వా...నేనా?..హైదరాబాద్ లో నేడే ఆఖరి టీ-20

భారత్- ఆస్ట్రేలియాజట్ల తీన్మార్ టీ-20 సిరీస్ క్లయ్ మాక్స్ దశకు చేరింది.విజేతను నిర్ణయించే ఆఖరిపోరాటానికి హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా రంగం సిద్ధమయ్యింది.

నువ్వా...నేనా?..హైదరాబాద్ లో నేడే ఆఖరి టీ-20
X

భారత్- ఆస్ట్రేలియాజట్ల తీన్మార్ టీ-20 సిరీస్ క్లయ్ మాక్స్ దశకు చేరింది.విజేతను నిర్ణయించే ఆఖరిపోరాటానికి హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా రంగం సిద్ధమయ్యింది. రాత్రి 7 గంటలకు ఈ పోరు ప్రారంభమవుతుంది...

ప్రపంచ నంబర్ వన్ భారత్, ప్రపంచ చాంపియన్ ఆస్ట్ర్రేలియాజట్ల మూడుమ్యాచ్ ల టీ-20 సిరీస్ లోని ఆఖరి పోరాటానికి హైదరాబాద్ రాజీవ్ గాంధీ స్టేడియంలో కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది. సిరీస్ లోని మొదటి రెండుమ్యాచ్ ల్లో చెరో విజయం సాధించడం ద్వారా రెండుజట్లూ 1-1తో సమఉజ్జీలుగా నిలవడంతో..సిరీస్ లోని ఆఖరిమ్యాచ్ నిర్ణయాత్మకంగా మారింది.

విజయమే లక్ష్యంగా....

మొహాలీ వేదికగా ముగిసిన హైస్కోరింగ్ తొలిసమరంలో కంగారూటీమ్ 4 వికెట్ల తేడాతో విజేతగా నిలిస్తే...నాగపూర్ లో ముగిసిన రెండో పోటీలో భారత్ 6 వికెట్లతో నెగ్గడం ద్వారా సిరీస్ ను సమం చేయగలిగింది. ఇక హైదరాబాద్ వేదికగా రాత్రి 7 గంటలకు ప్రారంభమయ్యే ఆఖరి పోరులో రెండుజట్లూ విజయమే లక్ష్యంగా పోటీకి సై అంటున్నాయి.

ఈ మ్యాచ్ లో నెగ్గినజట్టుకే సిరీస్ విజేతగా నిలిచే అవకాశం ఉండడంతో లోపాలను సవరించుకొని, సర్వశక్తులూ కూడదీసుకొని తుదిపోరాటానికి సిద్ధమయ్యాయి.


బ్యాటింగ్ కళకళ...బౌలింగ్ వెలవెల...

ప్రస్తుత సిరీస్ మొదటి రెండుమ్యాచ్ ల ఫలితాలను బట్టిచూస్తే...రెండుజట్ల తీరు ఒకేలా కనిపిస్తోంది. బ్యాటింగ్ లో అత్యంత పటిష్టంగాను, బౌలింగ్ లో అత్యంత బలహీనంగాను కనిపిస్తున్నాయి.

భారత్ తరపున పేస్ జోడీ భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్ దారుణంగా విఫలమైతే...లెఫ్టామ్ స్పిన్నర్ అక్షర్ పటేల్ ఒక్కడే నిలకడగా రాణిస్తూ కంగారూ టాపార్డర్ కు కొరకరాని కొయ్యగా మారాడు.

ఇక..ఆస్ట్రేలియా ప్రధానబౌలర్లు యాండీ కమిన్స్, జోష్ హేజిల్ వుడ్, గ్రీన్ గతి తప్పితే...లెగ్ స్పిన్నర్ ఆడం జంపా తనదైన శైలిలో రాణిస్తూ...భారత టాపార్డ్ కు చిక్కుముడిగా తయారయ్యాడు.

రెండుజట్లూ బౌలింగ్ లోపాలను సవరించుకొని...హైదరాబాద్ పోరులో సత్తాచాటుకోవాలని ఉబలాట పడుతున్నాయి.

బుమ్రా వైపే భారత్ చూపు...

గాయంతో గత కొద్దివారాలుగా జట్టుకు దూరమై తిరిగి తుదిజట్టులో చోటు సంపాదించిన బుమ్రా..నాగపూర్ మ్యాచ్ లో యార్కర్లతో చెలరేగిపోయాడు. సిరీస్ ఆఖరిపోరులో భారత్ కు బుమ్రా కీలకం కానున్నాడు.

స్వింగ్ కింగ్ భువనేశ్వర్ కుమార్, లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చహాల్, డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ హర్షల్ పటేల్ పుంజుకోగలిగితేనే భారత్ కు విజయావకాశాలు ఉంటాయి.

కెప్టెన్ రోహిత్, ఓపెనర్ రాహల్, కొహ్లీ, సూర్యకుమార్, పాండ్యా పూర్తిస్థాయిలో రాణించగలిగితే కంగారూలకు కష్టాలు తప్పవు.

రసపట్టుగా సాగుతున్న ఈ సిరీస్ లోని ఆఖరాట కోసం ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది భారత క్రికెట్ అభిమానులు ఎక్కడలేని ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. మరోవైపు మ్యాచ్ ప్రారంభానికి ముందు వర్షం పడే అవకాశాలు 30 శాతం మాత్రమే ఉన్నాయని వాతావరణశాఖ హెచ్చరించడం కొసమెరుపు.

First Published:  25 Sep 2022 3:45 AM GMT
Next Story