Telugu Global
Sports

ఇండోర్ టెస్టులో ఆస్ట్ర్రేలియా జోరు, భారత్ ఖేల్ ఖతం!

బోర్డర్- గవాస్కర్ ట్రోఫీ సిరీస్ మూడోటెస్టులో సీన్ రివర్స్ అయ్యింది. రెండున్నర రోజుల ఆటలోనే ఆస్ట్ర్రేలియా 9 వికెట్లతో భారత్ ను చిత్తు చేసింది.

ఇండోర్ టెస్టులో ఆస్ట్ర్రేలియా జోరు, భారత్ ఖేల్ ఖతం!
X

ఇండోర్ టెస్టులో ఆస్ట్ర్రేలియా జోరు, భారత్ ఖేల్ ఖతం!

బోర్డర్- గవాస్కర్ ట్రోఫీ సిరీస్ మూడోటెస్టులో సీన్ రివర్స్ అయ్యింది. రెండున్నర రోజుల ఆటలోనే ఆస్ట్ర్రేలియా 9 వికెట్లతో భారత్ ను చిత్తు చేసింది. ఈ విజయంతో కంగారూ టీమ్ ప్రపంచ టెస్ట్ లీగ్ ఫైనల్ కు చేరుకొంది....

టెస్ట్ క్రికెట్ టాప్ ర్యాంకర్ ఆస్ట్ర్రేలియా మూడోటెస్టులో భారత్ ను రెండున్నర రోజుల్లోనే చిత్తు చేసింది. నాలుగుమ్యాచ్ ల సిరీస్ లోని మొదటి మూడుటెస్టులు ముగిసే సమయానికి భారత్ ఆధిక్యాన్ని 2-1కు తగ్గించగలిగింది.

ఇండోర్ వేదికగా జరిగిన కీలక మూడోటెస్టులో ప్రత్యర్థికోసం పన్నిన స్పిన్ ఉచ్చులో ఆతిథ్య భారతజట్టే చిక్కుకొని ఘోరపరాజయం చవిచూసింది.

లయన్ మాయలో భారత్ గల్లంతు...

సిరీస్ లోని మొదటి రెండుటెస్టులను మూడురోజుల ఆటలోనే అలవోకగా గెలుచుకొన్న భారత్ నెగ్గితీరాల్సిన మూడోమ్యాచ్ లో దారుణంగా విఫలమయ్యింది. కీలక టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకొన్నా మొదటిరోజుఆట టీ విరామానికి ముందే కేవలం 109 పరుగులకే కుప్పకూలిపోయింది.

కంగారూ స్పిన్నర్ల త్రయం నేథన్ లయన్, టాడ్ మర్ఫీ, కున్ మాన్ ల జోరుకు భారత్ బేజారెత్తిపోయింది.

పూజారా పోరాడినా.....

88 పరుగుల తొలి ఇన్నింగ్స్ లోటుతో రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ కు దిగినా భారత టాపార్డర్ తేలిపోయింది. ప్రధానంగా కంగారూ సీనియర్ స్పిన్నర్ నేథన్ లయన్ ను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొనలేక కూలబడిపోయింది.

వన్ డౌన్ చతేశ్వర్ పూజారా, అశ్విన్, అక్షర్ పటేల్ లు మినహా మిగిలిన బ్యాటర్లు పోరాడలేకపోయారు. చతేశ్వర్ పూజారా 142 బంతులు ఎదుర్కొని 59 పరుగులు సాధించడంతో భారత ఇన్నింగ్స్ 163 పరుగులకే ముగిసింది. ప్రత్యర్థి ఎదుట 72 పరుగుల స్వల్పలక్ష్యాన్ని మాత్రమే ఉంచగలిగింది.

కంగారూ జాదూ స్పిన్నర్ నేథన్ లయన్ 23 ఓవర్లలో 64 పరుగులిచ్చి 8 వికెట్లు పడగొట్టి తన జట్టు విజయానికి మార్గం సుగమం చేశాడు.

హేడ్-లబుషేన్ ధనాధన్..

73 పరుగుల విజయలక్ష్యంతో రెండోఇన్నింగ్స్ లో చేజింగ్ కు దిగిన ఆస్ట్ర్రేలియా రెండోబంతికే ఓపెనర్ ఉస్మాన్ క్వాజా వికెట్ నష్టపోయినా..రెండో వికెట్ కు ట్రావిస్ హెడ్- మార్నుస్ లబుషేన్ అజేయ హాఫ్ సెంచరీ భాగస్వామ్యంతో తమజట్టుకు 9 వికెట్ల విజయాన్ని అందించారు.

హెడ్ 49, లబుషేన్ 28 పరుగులతో అజేయంగా నిలిచారు.

భారత బౌలర్లలో అశ్విన్ ఒక్కడే రెండో ఇన్నింగ్స్ లో ఒకే ఒక్క వికెట్ పడగొట్టగలిగాడు. రెండుఇన్నింగ్స్ లో కలిపి 11 వికెట్లు పడగొట్టిన ఆస్ట్ర్రేలియా స్టార్ స్పిన్నర్ నేథన్ లయన్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

సిరీస్ లోని ఆఖరి టెస్టు మార్చి 9న అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరుగనుంది. ఈ మ్యాచ్ లో నెగ్గితేనే భారత్ ఐసీసీ టెస్ట్ లీగ్ ఫైనల్ కు చేరుకోగలుగుతుంది.

ఇండోర్ టెస్టులో భారత్ ను 9 వికెట్లతో చిత్తు చేయడం ద్వారా టాప్ ర్యాంకర్ ఆస్ట్ర్రేలియా ఐసీసీ టెస్టు లీగ్ ఫైనల్లో చోటు ఖాయం చేసుకోగలిగింది.

First Published:  3 March 2023 8:02 AM GMT
Next Story