Telugu Global
Sports

నేడే నాలుగో టీ-20, సిరీస్ వైపు భారత్ చూపు!

భారత్- ఆస్ట్ర్రేలియాజట్ల పాంచ్ పటాకా టీ-20 సిరీస్ కీలక దశకు చేరింది. రాయ్ పూర్ వేదికగా ఈరోజు జరిగే నాలుగో టీ-20 మ్యాచ్ లో నెగ్గడం ద్వారా సిరీస్ ఖాయం చేసుకోవాలన్న పట్టుదలతో భారత్ ఉంది.

నేడే నాలుగో టీ-20, సిరీస్ వైపు భారత్ చూపు!
X

భారత్- ఆస్ట్ర్రేలియాజట్ల పాంచ్ పటాకా టీ-20 సిరీస్ కీలక దశకు చేరింది. రాయ్ పూర్ వేదికగా ఈరోజు జరిగే నాలుగో టీ-20 మ్యాచ్ లో నెగ్గడం ద్వారా సిరీస్ ఖాయం చేసుకోవాలన్న పట్టుదలతో భారత్ ఉంది.

ఐసీసీ టీ-20 టాప్ ర్యాంకర్ భారత్, 4వ ర్యాంకర్ ఆస్ట్ర్ర్లేలియాజట్ల ఐదుమ్యాచ్ ల సిరీస్ లోని కీలక నాలుగో సమరానికి రాయ్ పూర్ లోని షాహీద్ వీరనారాయణ్ సింగ్ స్టేడియం వేదికగా రంగం సిద్ధమయ్యింది.

మొదటి మూడుమ్యాచ్ లు ముగిసే సమయానికి 2-1తో పైచేయి సాధించిన భారత్ ఈరోజు జరిగే నాలుగో మ్యాచ్ లో నెగ్గడం ద్వారా 3-1తో సిరీస్ ఖాయం చేసుకోవాలన్న పట్టుదలతో ఉంది.

భారతజట్టుకు శ్రేయస్ అయ్యర్ బలం....

సిరీస్ లోని మొదటి మూడుమ్యాచ్ లకు దూరమైన బ్యాటింగ్ స్టార్ శ్రేయస్ అయ్యర్ రాకతో భారత బ్యాటింగ్ కు అదనపు బలం చేకూరింది. తిలక్ వర్మ స్థానంలో అయ్యర్ బ్యాటింగ్ కు దిగనున్నాడు.

విశాఖ, తిరువనంతపురం వేదికలుగా జరిగిన మొదటి రెండుమ్యాచ్ ల్లో భారత్ నెగ్గితే..గౌహతీ వేదికగా జరిగిన హైస్కోరింగ్ పోరులో ఆస్ట్ర్రేలియా నెగ్గడం ద్వారా భారత్ ఆధిక్యాన్ని 2-1 తగ్గించగలిగింది.

అయితే.. సిరీస్ అవకాశాలను సజీవంగా నిలుపుకోవాలంటే ఈరోజు జరిగే పోరులో సైతం కంగారూజట్టు నెగ్గితీరాల్సి ఉంది. ఒక విధంగా చెప్పాలంటే రాయపూర్ పోరు ఆతిథ్య భారత్ కు చెలగాటం...ఆస్ట్ర్రేలియాకు సిరీస్ సంకటం లాంటిదే.

ఆ ఇద్దరూ లేకుండానే కంగారూ టీమ్...

ఈ రోజు జరిగే కీలక పోరులో భారత్ ఇద్దరు కీలక ఆటగాళ్లతో పోటీకి దిగుతుంటే..ఆస్ట్ర్రేలియా మాత్రం ఇద్దరు ప్రధాన ఆటగాళ్లు లేకుండా సమరానికి సై అంటోంది.

బ్యాటింగ్ లో శ్రేయస్ అయ్యర్, బౌలింగ్ లో ముకేశ్ కుమార్ లతో భారత్ మరింత సమతూకంతో , పటిష్టంగా తయారైతే..మ్యాచ్ విన్నర్లు జోష్ ఇంగ్లిస్, గ్లెన్ మాక్స్ వెల్, స్టోయినిస్ లు లేకుండానే పోటీకి దిగాల్సి వస్తోంది.

రెండుజట్ల బలాబలాలు, తుదిజట్ల కూర్పును బట్టి చూస్తే సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలోని భారతజట్టే హాట్ ఫేవరెట్ గా కనిపిస్తోంది. పేసర్ ప్రసిద్ధ కృష్ణ స్థానంలో ముకేశ్ కుమార్, తిలక్ వర్మ కు బదులుగా శ్రేయస్ అయ్యర్ లతో భారత్ పోటీకి దిగనుంది.

చేజింగ్ జట్టుకు విజయావకాశాలు...

రాయ్ పూర్ స్టేడియంలో తొలిసారిగా నిర్వహిస్తున్న ఈ అంతర్జాతీయ టీ-20 మ్యాచ్ లో భారీస్కోర్లతో పరుగులు వెల్లువెత్తే అవకాశం ఉంది. పేస్ బౌలర్లకు అనువుగా ఉండే ఇక్కడి పిచ్ పైన ఇప్పటి వరకూ ఒకే ఒక్క అంతర్జాతీయ వన్డే మ్యాచ్ ను నిర్వహించారు. దేశవాళీ క్రికెట్ మ్యాచ్ లకు తరచూ ఆతిథ్యమిచ్చే రాయ్ పూర్ స్టేడియంలో ముందుగా బ్యాటింగ్ చేసిన జట్ల కంటే ...చేజింగ్ కు దిగిన జట్లకే విజయావకాశాలు ఎక్కువగా ఉండడంతో టాస్ కీలకం కానుంది.

సూర్యను ఊరిస్తున్న జంట రికార్డులు!

ప్రస్తుత సిరీస్ లోని మొదటి మూడుమ్యాచ్ ల్లోనూ భారతజట్టు 200కు పైగా స్కోర్లు సాధించడం ద్వారా అరుదైన రికార్డు నెలకొల్పింది. టీ-20 చరిత్రలో ఈ ఘనత సాధించిన నేపాల్ సరసన భారత్ నిలిచింది. విశాఖ, తిరువనంతపురం, గౌహతీ మ్యాచ్ ల్లో భారత్ 200కు పైగా భారీస్కోర్లు సాధించి రెండు విజయాలు, ఓ ఓటమి రికార్డుతో ఉంది.

రాయ్ పూర్ లో సైతం భారత్ 200 స్కోరు నమోదు చేసే అవకాశం లేకపోలేదు. మరోవైపు..భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ను సైతం జంట రికార్డులు ఊరిస్తున్నాయి. టీ-20 అంతర్జాతీయ మ్యాచ్ ల్లో అత్యంతవేగంగా 2వేల పరుగులు సాధించిన బ్యాటర్ గాను, 2వేల పరుగుల మైలురాయిని చేరిన ఆటగాడిగానూ సూర్యకుమార్ నివాలంటే మరో 21 పరుగులు సాధిస్తే చాలు.

భారత టీ-20 చరిత్రలో 2వేల పరుగులు సాధించిన బ్యాటర్లలో విరాట్ కొహ్లీ ( 4008 ), రోహిత్ శర్మ (3853), రాహుల్ ( 2265) ఉన్నారు. అత్యంత వేగంగా 2వేల పరుగుల మైలురాయిని చేరిన విరాట్ కొహ్లీ ఈరోజు జరిగే నాలుగో టీ-20 పోరులోనే అధిగమించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

కంగారూలపై భారత్ దే పైచేయి...

రెండుజట్ల ఫేస్ టు ఫేస్ రికార్డులు చూస్తే..ప్రస్తుత సిరీస్ లో భాగంగా గౌహతీలో ముగిసిన మూడో టీ-20 మ్యాచ్ వరకూ రెండుజట్లూ 28సార్లు తలపడితే భారత్ 17, ఆస్ట్ర్రేలియా 11 విజయాల రికార్డుతో ఉన్నాయి.

రాయ్ పూర్ వేదికగా మంచు ప్రభావం అధికంగా ఉండడంతో టాస్ నెగ్గినజట్టు మరో ఆలోచన లేకుండా ముందుగా ఫీల్డింగ్ ఎంచుకొని ప్రత్యర్థిని తక్కువ స్కోరుకు కట్టడి చేసే వ్యూహాన్ని అనుసరించనుంది.

ఇద్దరు కీలక ఆటగాళ్లతో భారత్ ఈ కీలక పోరు బరిలోకి దిగుతుంటే..ముగ్గురు ప్రధాన ఆటగాళ్లు లేకుండా ఆస్ట్ర్రేలియా పోటీలో నిలవడం చూస్తే..ఆతిథ్యజట్టుకే విజయావకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

భారత కాలమాన ప్రకారం రాత్రి 7 గంటలకు ఈ పోటీ ప్రారంభంకానుంది.

First Published:  1 Dec 2023 7:30 AM GMT
Next Story