Telugu Global
Sports

ఇండోర్ లో సేమ్ టు సేమ్, భారత్ సిరీస్ విన్!

అప్ఘనిస్థాన్ తో తీన్మార్ టీ-20 సిరీస్ ను భారత్ అలవోకగా గెలుచుకొంది. సిరీస్ లోని మొదటి రెండుమ్యాచ్ ల్లోనూ ఒకేతీరు విజయాలతో 2-0తో పైచేయి సాధించింది.

ఇండోర్ లో సేమ్ టు సేమ్, భారత్ సిరీస్ విన్!
X

అప్ఘనిస్థాన్ తో తీన్మార్ టీ-20 సిరీస్ ను భారత్ అలవోకగా గెలుచుకొంది. సిరీస్ లోని మొదటి రెండుమ్యాచ్ ల్లోనూ ఒకేతీరు విజయాలతో 2-0తో పైచేయి సాధించింది...

2024-ఐసీసీ వన్డే ప్రపంచకప్ కు టాప్ ర్యాంకర్, ప్రపంచ మాజీ చాంపియన్ భారత్ సన్నాహాలను జోరుగా ప్రారంభించింది.10వ ర్యాంకర్ అప్ఘనిస్థాన్ తో జరుగుతున్న మూడుమ్యాచ్ ల సన్నాహక సిరీస్ మొదటి రెండుమ్యాచ్ లు నెగ్గడం ద్వారా భారత్ సిరీస్ ఖాయం చేసుకొంది.

వేదికగా మారినా అదే ఫలితం....

ప్రస్తుత సిరీస్ లో భాగంగా మొహాలీ వేదికగా జరిగిన తొలిపోరులో భారత్ 6 వికెట్ల అలవోక చేజింగ్ విజయం సాధించడం, స్పిన్ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలవటం, భారత కెప్టెన్ కమ్ రోహిత్ శర్మ డకౌట్ జరిగిపోయాయి. అయితే..ఇండోర్ లోని హోల్కార్ స్టేడియం వేదికగా జరిగిన రెండో టీ-20లోనూ అదే ఫలితం రిపీటయ్యింది.

భారత్ టాస్ నెగ్గి ఫీల్డింగ్ ఎంచుకోడం, అప్ఘనిస్థాన్ ను 20 ఓవర్లలో 172 పరుగులకు పరిమితం చేయడం, అక్షర్ పటేల్ వరుసగా రెండోమ్యాచ్ లోనూ 2 వికెట్లు పడగొట్టడం, భారత్ చేజింగ్ కు దిగిన సమయంలో కెప్టెన్ రోహిత్ శర్మ వరుసగా రెండోసారి డకౌట్ కావడం, రెండో డౌన్లో బ్యాటింగ్ కు దిగిన ఆల్ రౌండర్ శివం దూబే బ్యాక్ టు బ్యాక్ హాఫ్ సెంచరీలు సాధించడం, భారత్ వరుసగా రెండోసారి 6 వికెట్ల విజయం, అక్షర్ పటేల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకోడం చోటు చేసుకొన్నాయి.

రోహిత్ కెరియర్ లో ఇదే మొదటిసారి...

మ్యాచ్ నెగ్గాలంటే 20 ఓవర్లలో 173 పరుగుల భారీస్కోరు చేయాల్సిన భారత్ తొలిఓవర్ లోనే కెప్టెన్ రోహిత్ శర్మ వికెట్ ను 5వ బంతికే నష్టపోయింది. రోహిత్ రెండు బంతులు మాత్రమే ఎదుర్కొని డకౌట్ గా వెనుదిరిగాడు. రోహిత్ టీ-20 కెరియర్ లో వరుసగా రెండుమ్యాచ్ ల్లో డకౌట్లు కావడం ఇదే మొదటిసారి.

మొహాలీ వేదికగా జరిగిన సిరీస్ లోని తొలిపోరులో పరుగులేవీ చేయకుండా రనౌట్ గా వెనుదిరిగిన రోహిత్..రెండోమ్యా్చ లో ఎదుర్కొన్న మూడో బంతికే డకౌటయ్యాడు.

రోహిత్ స్థానంలో క్రీజులోకి వచ్చిన విరాట్ కొహ్లీ 16 బంతుల్లో 5 ఫోర్లతో 29 పరుగులకు అవుటయ్యాడు. అయితే ..యువఓపెనర్ యశస్వి జైశ్వాల్ , రెండోడౌన్ శివం దూబే

స్ట్ర్రోక్ ఫుల్ హాఫ్ సెంచరీలతో భారీభాగస్వామ్యం నమోదు చేయడం ద్వారా భారత్ కు అలవోక విజయం అందించారు.

యశస్వి 34 బంతుల్లోనే అరడజను ఫోర్లు, సిక్సర్లు చొప్పన సాధించడంతో పాటు 68 పరుగులు సాధించాడు. శివం దూబే 32 బంతుల్లోనే 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 63 పరుగుల నాటౌట్ స్కోరు సాధించడంతో భారత్ 15.4 ఓవర్లలో కేవలం 4 వికెట్ల నష్టానికే 173 పరుగులతో 6 వికెట్ల విజయంతో సిరీస్ ఖాయం చేసుకోగలిగింది.

అప్ఘన్ బౌలర్లలో కరీం జనత్ 2 వికెట్లు, ఫజల్ హక్, నవీనుల్ హక్ చెరో వికెట్ పడగొట్టారు.

భారత్ విజయంలో ప్రధానపాత్ర వహించిన అక్షర్ పటేల్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. అక్షర్ కు ప్రస్తుత సిరీస్ లో వరుసగా ఇది రెండో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కావడం విశేషం.

200 వికెట్ల మొనగాడు అక్షర్ పటేల్...

ఇండోర్ టీ-20 మ్యాచ్ లో సైతం 2 వికెట్లు పడగొట్టడం ద్వారా లెఫ్టామ్ స్పిన్నర్ అక్షర్ పటేల్ 200 వికెట్ల క్లబ్ లో చేరాడు. అక్షర్ కంటే ముందే టీ-20 ఫార్మాట్లో 200 వికెట్లు పడగొట్టిన స్పిన్నర్ రికార్డు రవీంద్ర జడేజా పేరుతో ఉంది.

రవీంద్ర జడేజా తన కెరియర్ లో ఇప్పటి వరకూ ఆడిన 310 టీ-20 మ్యాచ్ ల్లో 216 వికెట్లు పడగొట్టడంతో పాటు బ్యాటర్ గా 3382 పరుగులు సాధించాడు. 200 వికెట్లు, 2వేల పరుగుల మైలురాయిని చేరిన భారత తొలిస్పిన్ ఆల్ రౌండర్ గా జడేజా నిలిస్తే..ప్రస్తుత సిరీస్ ద్వారా అక్షర్ పటేల్ అదే ఘనతను సొంతం చేసుకోగలిగాడు.

ప్రస్తుత సిరీస్ లోని రెండోమ్యాచ్ వరకూ అక్షర్ మొత్తం 234 మ్యాచ్ లు ఆడి 200 వికెట్లతో పాటు 2545 పరుగులు సాధించగలిగాడు.

టీ-20 చరిత్రలో ఈ ఘనత సాధించిన 27వ క్రికెటర్ గా అక్షర్ పటేల్ రికార్డుల్లో చేరాడు. టీ-20ల్లో అత్యధికంగా 564 మ్యాచ్ ల్లో 619 వికెట్లు పడగొట్టిన ప్రపంచ రికార్డు వెస్టిండీస్ దిగ్గజ ఆల్ రౌండర్ డ్వయన్ బ్రావో పేరుతో ఉంది.

భారత బౌలర్లలో యజువేంద్ర చహాల్ 290 మ్యాచ్ ల్లో 336 వికెట్లు పడగొట్టడం ద్వారా టాపర్ గా కొనసాగుతున్నాడు.

రోహిత్ శర్మ జంట రికార్డులు...

అప్ఘనిస్థాన్ పై ప్రస్తుత సిరీస్ లో భారత్ వరుసగా రెండో విజయం సాధించడంతో.. రోహిత్ శర్మ కెప్టెన్ గా 41వ విజయంతో మహేంద్ర సింగ్ ధోనీ రికార్డును సమం చేయగలిగాడు.

మహేంద్రసింగ్ ధోనీ 72 మ్యాచ్ ల్లో కెప్టెన్ గా 41 విజయాలు సాధిస్తే..రోహిత్ శర్మ కేవలం 53వ మ్యాచ్ లోనే 41వ విజయం నమోదు చేయగలిగాడు. టీ-20 ఫార్మాట్లో భారత్ కు నాయకత్వం వహించిన వారిలో ధోనీ, రోహిత్ మాత్రమే 41 విజయాలతో సంయుక్త అగ్రస్థానంలో నిలిచారు.

కెప్టెన్ గా వరుసగా 10 టీ-20 సిరీస్ విజయాలు సాధించిన పాకిస్థాన్ కెప్టెన్ సరఫ్రాజ్ అహ్మద్ రికార్డును రోహిత్ సమం చేయగలిగాడు.

తొలి క్రికెటర్ రోహిత్ శర్మ...

ఇండోర్ టీ-20 మ్యాచ్ ద్వారా భారత కెప్టెన్ రోహిత్ శర్మ మరో అరుదైన రికార్డు నెలకొల్పాడు. ధూమ్ ధామ్ టీ-20 ఫార్మాట్లో 150 అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడిన తొలి క్రికెటర్ గా రోహిత్ చరిత్ర సృష్టించాడు. అంతేకాదు..రికార్డుస్థాయిలో నాలుగు శతకాలు బాదడంతో పాటు 7సార్లు డకౌటైన బ్యాటర్ గానూ రోహిత్ శర్మ నిలిచాడు.

అప్ఘనిస్థాన్ ప్రత్యర్థిగా 160కి పైగా స్కోరును భారత్ నాలుగోసారి చేజ్ చేయగలిగింది. 2022లో షార్జా వేదికగా 176, 2022లో బెల్ ఫాస్ట్ వేదికగా 173, 2015లో అబుదాబీ వేదికగా 163 పరుగుల లక్ష్యాలను అధిగమించిన భారత్ ప్రస్తుత ఇండోర్ మ్యాచ్ లో 173 పరుగుల టార్గెట్ ను అలవోకగా చేజ్ చేయగలిగింది.

స్వదేశంలో భారత్ 13వ సిరీస్ గెలుపు....

2019 తరువాత నుంచి స్వదేశీ టీ-20 సిరీస్ ల్లో భారత్ కు ఇది 13వ సిరీస్ విజయం కావడం విశేషం. ప్రస్తుత అప్ఘన్ సిరీస్ తో కలుపుకొని మొత్తం 15 సిరీస్ లు ఆడిన భారత్ అజేయంగా నిలిచింది. 2 సిరీస్ లను డ్రాగా ముగించి 13 సిరీస్ ల్లో విజేతగా నిలవడం ద్వారా సొంతగడ్డపై తనకు ఎదురేలేదని నిరూపించుకొంది.

ప్రస్తుత సిరీస్ లోని ఆఖరి టీ-20 మ్యాచ్ బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా జనవరి 17న జరుగనుంది.

First Published:  15 Jan 2024 8:16 AM GMT
Next Story