Telugu Global
Sports

టీ- 20 చరిత్రలో భారత్ అరుదైన విజయం...అప్ఘన్ పై సిరీస్ స్వీప్!

రోహిత్ శర్మ నాయకత్వంలోని భారత్ టీ-20 చరిత్రలోనే ఓ అపూర్వ, అరుదైన విజయం సాధించింది. అప్ఘనిస్థాన్ తో తీన్మార్ సిరీస్ లో క్లీన్ స్వీప్ విన్నర్ గా నిలిచింది.

టీ- 20 చరిత్రలో భారత్ అరుదైన విజయం...అప్ఘన్ పై సిరీస్ స్వీప్!
X

రోహిత్ శర్మ నాయకత్వంలోని భారత్ టీ-20 చరిత్రలోనే ఓ అపూర్వ, అరుదైన విజయం సాధించింది. అప్ఘనిస్థాన్ తో తీన్మార్ సిరీస్ లో క్లీన్ స్వీప్ విన్నర్ గా నిలిచింది.

2024- టీ-20 ప్రపంచకప్ కు సన్నాహలలో భాగంగా 10వ ర్యాంకర్ అప్ఘనిస్థాన్ తో ముగిసిన తీన్మార్ టీ-20 సిరీస్ లో టాప్ ర్యాంకర్ భారత్ 3-0తో క్లీన్ స్వీప్ విజయం సాధించింది.

బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఉత్కంఠభరితంగా సాగిన సిరీస్ ఆఖరి మ్యాచ్ లో భారత్ ఓ అరుదైన విజయంతో వారేవ్వా! అనిపించుకొంది.

టీ-20 చరిత్రలో సరికొత్త రికార్డు...

మూడుమ్యాచ్ ల సిరీస్ లోని మొదటి రెండుమ్యాచ్ లు నెగ్గడం ద్వారా భారత్ సిరీస్ ఖాయం చేసుకోడంతో..బెంగళూరు వేదికగా జరిగే ఆఖరి మ్యాచ్ కేవలం కంటితుడిపేనని అందరూ భావించారు. అయితే..పరుగుల అడ్డా, బ్యాటర్ల స్వర్గధామం చిన్నస్వామి స్టేడియంలో నువ్వానేనా అన్నట్లుగా సాగిన పోరులో ఇటు భారత్, అటు అఫ్ఘనిస్థాన్ తుదివరకూ పోరాడి మ్యాచ్ ను రక్తి కట్టించాయి. సిరీస్ కు అద్దిరిపోయే ముగింపును ఇచ్చాయి.

అంతగా ప్రాధాన్యం లేని ఈ మ్యాచ్ ను రెండుజట్లూ సీరియస్ గానే తీసుకొన్నాయి.

' హిట్ మ్యాన్' సూపర్ హిట్ సెంచరీ!

భారత కెప్టెన్ రోహిత్ శర్మ కీలక టాస్ నెగ్గి గత రెండుమ్యాచ్ లకు భిన్నంగా ముందుగా బ్యాటింగ్ ఎంచుకొన్నాడు. అయితే పవర్ ప్లే ఓవర్లు ముగియక ముందే భారత టాపార్డర్లో నలుగురు కీలక బ్యాటర్లు కేవలం 22 పరుగులకే పెవీలియన్ దారి పట్టడంతో రోహిత్ సేన పీకలోతు కష్టాలలో కూరుకుపోయింది.

ఓపెనర్ యశస్వి జైశ్వాల్ 4, వన్ డౌన్ విరాట్ కొహ్లీ 0, రెండో డౌన్ శివం దూబే 1, మూడో డౌన్ సంజు శాంసన్ 0 పరుగులకు అవుటయ్యారు. అప్ఘన్ ఓపెనింగ్ బౌలర్ ఫరీద్ అహ్మద్ మూడు కీలక వికెట్లు పడగొట్టి భారత్ ను తీవ్ర ఒత్తిడిలో పడవేశాడు.

అయితే..5వ వికెట్ కు కెప్టెన్ రోహిత్, మిడిలార్డర్ ఆటగాడు రింకూ సింగ్ 190 పరుగుల అజేయభాగస్వామ్యంతో భారత్ కు 212 పరుగుల భారీస్కోరు అందించారు. కెప్టెన్ రోహిత్ శర్మ కేవలం 69 బంతుల్లోనే 121, రింకూ సింగ్ 39 బంతుల్లో 69 పరుగుల నాటౌట్ స్కోర్లు సాధించారు.

భారత కెప్టెన్ రోహిత్ కెరియర్ లో ఇది 5వ టీ-20 శతకం కాగా....నాయకుడుగా సాధించిన మూడో సెంచరీ. రోహిత్ మెరుపు శతకంలో 11 ఫోర్లు, 8 సిక్సర్లు ఉన్నాయి.

రింకూ సింగ్ 6 సిక్సర్లు, 2 ఫోర్లతో రోహిత్ కు అండగా నిలిచాడు.

అప్ఘన్ దీటైన బ్యాటింగ్.....

మ్యాచ్ నెగ్గాలంటే 213 పరుగులు చేయాల్సిన అప్ఘనిస్థాన్ దీటైన బ్యాటింగ్ తో 6 వికెట్లకు 212 పరుగుల స్కోరే సాధించడంతో మ్యాచ్ టైగా నిలిచింది. ఓపెనర్లు రహ్మానుల్లా గుర్బాజ్ 50, ఇబ్రహీం జడ్రాన్ 50, వన్ డౌన్ గుల్బదీన్ నైబ్ 55, ఆల్ రౌండర్ నబీ 34 పరుగులు సాధించారు. భారత బౌలర్లలో సుందర్ 3, కుల్దీప్ 1, ఆవేశ్ ఖాన్ చెరో వికెట్ పడగొట్టారు.

స్కోర్లు టై కావడంతో విజేతను నిర్ణయించడానికి సూపర్ ఓవర్ మ్యాచ్ ను నిర్వహించారు. సూపర్ ఓవర్లో సైతం రెండుజట్లు 16 పరుగుల స్కోర్లే సాధించడంతో మ్యాచ్ మరోసారి టైగా నిలిచింది. దీంతో ..టీ-20 చరిత్రలోనే మొట్టమొదటిసారిగా రెండోసారి సూపర్ ఓవర్ నిర్వహించారు. ఇందులో భారత్ 10 పరుగులతో మ్యాచ్ నెగ్గి 3-0తో సిరీస్ స్వీప్ సాధించగలిగింది.

భారత్ విజయంలో ప్రధానపాత్ర వహించిన కెప్టెన్ రోహిత్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ఆల్ రౌండర్ శివం దూబేకు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కాయి.

First Published:  18 Jan 2024 6:30 AM GMT
Next Story