Telugu Global
Sports

నేడే ఆఖరివన్డే,' బ్రౌన్ వాష్' కు భారత్ గురి!

భారత్- ఆస్ట్ర్రేలియాజట్ల తీన్మార్ వన్డే సిరీస్ క్లయ్ మాక్స్ దశకు చేరింది. రాజ్ కోట వేదికగా జరిగే ఆఖరివన్డేలో విజయమే లక్ష్యంగా రెండుజట్లూ బరిలోకి దిగుతున్నాయి.

నేడే ఆఖరివన్డే, బ్రౌన్ వాష్ కు భారత్ గురి!
X

నేడే ఆఖరివన్డే,' బ్రౌన్ వాష్' కు భారత్ గురి!

భారత్- ఆస్ట్ర్రేలియాజట్ల తీన్మార్ వన్డే సిరీస్ క్లయ్ మాక్స్ దశకు చేరింది. రాజ్ కోట వేదికగా జరిగే ఆఖరివన్డేలో విజయమే లక్ష్యంగా రెండుజట్లూ బరిలోకి దిగుతున్నాయి.

ఐసీసీ వన్డే ప్రపంచకప్ కు సన్నాహకంగా ప్రపంచ చాంపియన్ ఆస్ట్ర్రేలియా, మాజీ చాంపియన్ భారత్ జట్ల నడుమ జరుగుతున్న తీన్మార్ వన్డే సిరీస్ ముగింపు దశకు చేరింది.

మొదటి రెండు వన్డేలలోనూ అలవోక విజయాలు సాధించడం ద్వారా ఇప్పటికే 2-0తో పైచేయి సాధించిన టాప్ ర్యాంకర్ భారత్ సిరీస్ స్వీప్ కు గురిపెట్టింది. మరో వైపు వరుస పరాజయాలతో డీలా పడిన ప్రపంచ చాంపియన్ ఆస్ట్ర్రేలియా మాత్రం కనీసం ఈరోజు జరిగే ఆఖరివన్డేలో అయినా నెగ్గడం ద్వారా పరువు దక్కించుకోవాలన్న పట్టుదలతో ఉంది.

రెండుజట్లలోనూ భారీగా మార్పులు....

సిరీస్ ఫలితం ఇప్పటికే తేలిపోయినా.. ప్రస్తుత ఆఖరి వన్డేలో మాత్రం రెండుజట్లూ పలువురు సీనియర్ ప్లేయర్లతో పోరుకు దిగుతున్నాయి. ప్రస్తుత సిరీస్ లోని మొదటి రెండు వన్డేలకూ దూరంగా ఉన్న కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కొహ్లీ, జాదూ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తిరిగి తుదిజట్టులో చేరుతున్నారు.

యువఓపెనర్ శుభ్ మన్ గిల్, పేస్ ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్ లకు విశ్రాంతి నిచ్చారు. వైస్ కెప్టెన్ హార్థిక్ పాండ్యా జ్వరంతోనూ, స్పిన్ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ గాయంతోనూ జట్టుకు దూరంగా ఉన్నారు. మహ్మద్ షమీకి విశ్రాంతి ఇవ్వడంతో మహ్మద్ సిరాజ్ బరిలోకి దిగుతున్నాడు.

మరోవైపు..ఆస్ట్ర్రేలియా తన తురుపుముక్కలు మిషెల్ స్టార్క్, డాషింగ్ ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్ వెల్ లతో పోటీకి దిగుతోంది.

ఐదుసార్లు ప్రపంచ విజేత ఎదురీత...

వన్డే క్రికెట్లో ఐదుసార్లు విశ్వవిజేత ఆస్ట్ర్రేలియా ప్రస్తుతం గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది. దక్షిణాఫ్రికాతో ముగిసిన పాంచా పటాకా వన్డే సిరీస్ లోని చివరి మూడు మ్యాచ్ ల్లోనూ పరాజయాలు పొందిన కంగారూ జట్టుకు..భారత్ జరుగుతున్న తీన్మార్ సిరీస్ లోని మొదటి రెండు వన్డేలలోనూ సైతం పరాజయం తప్పలేదు. ఆడిన గత ఐదుమ్యాచ్ ల్లోనూ ఓటమి చవిచూసిన ఆస్ట్ర్రేలియా..సర్వశక్తులూ కూడదీసుకొని ప్రస్తుత సిరీస్ లోని ఆఖరివన్డేలో నెగ్గితీరాలన్న పట్టుదలతో ఉంది. బ్యాటింగ్ లో టాపార్డర్ కుదురుకొంటే భారత్ కు గట్టిపోటీ ఇవ్వగలమని భావిస్తోంది.

పరుగుల గని రాజ్ కోట్....

రాజ్ కోటలోని సౌరాష్ట్ర్ర క్రికెట్ స్టేడియం పిచ్ బ్యాటర్లకు స్వర్గం కానుంది. ఇదే స్టేడియం వేదికగా జరిగిన గత ఆరు వన్డేలలో నాలుగుసార్లు 300కు పైగా స్కోర్లు నమోదయ్యాయి.

జనవరి 2020లో చివరిసారిగా ఈ రెండుజట్ల నడుమ రాజ్ కోట్ వేదికగా జరిగిన వన్డేలో భారత్ 340 పరుగులు సాధిస్తే..చేజింగ్ కు దిగిన కంగారూ జట్టు 304 పరుగులు మాత్రమే చేయగలిగింది.

ఎండవేడిమి వాతావరణంలో జరుగనున్న ఈ మ్యాచ్ రెండుజట్ల సత్తాకు సవాలుకానుంది.

కంగారూలపై రోహిత్ తిరుగులేని రికార్డు....

ప్రపంచకప్ కు ముందే సూపర్ ఫామ్ లోకి వచ్చిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ ప్రస్తుత సిరీస్ లో తొలిసారిగా రాజ్ కోట్ వన్డే ద్వారా బ్యాటింగ్ కు దిగనున్నాడు. ఆస్ట్ర్రేలియా ప్రత్యర్థిగా రోహిత్ కు 59.23 సగటు ఉంది. 8 సెంచరీలు, 8 హాఫ్ సెంచరీలు సాధించిన రికార్డు సైతం ఉంది.

ప్రస్తుత రాజ్ కోట వన్డేలో సైతం రోహిత్ భారీస్కోరు సాధించగలనన్న ధీమాతో ఉన్నాడు.

ఇక..భారత మెరుపు ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ కు 2022 తర్వాత నుంచి పవర్ ప్లే ఓవర్లలో 4.16 ఎకానమీతో 32 వికెట్లు పడగొట్టిన ఘనత ఉంది.

భారత స్పిన్ త్రయం అశ్విన్, జడేజా, కుల్దీప్ యాదవ్ ల నుంచి కంగారూ టాపార్డర్ కు అసలుసిసలు పరీక్ష ఎదురుకానుంది.

మరో వారం రోజుల్లో ప్రపంచకప్ ప్రారంభంకానున్న సమయంలో..రెండుజట్లకూ ప్రస్తుత సిరీస్ లోని ఈ ఆఖరి వన్డే అత్యంత కీలకంగా మారింది. ప్రపంచ నంబర్ వన్ భారత్ వరుసగా మూడో విజయంతో హ్యాట్రిక్ సాధించడంతో పాటు బ్రౌన్ వాష్ చేస్తుందా?..లేక వరుస పరాజయాలకు ఆస్ట్ర్రేలియా స్వస్తిపలికి తొలి గెలుపుతో పరువు దక్కించుకొంటుందా?..తెలుసుకోవాలంటే..మరి కొద్దిగంటలపాటు వేచిచూడక తప్పదు.

First Published:  27 Sep 2023 5:45 AM GMT
Next Story