Telugu Global
Sports

క్రికెట్ వన్డే వరల్డ్ కప్‌కు ఇండియా జట్టు ప్రకటన.. సంజూ, తిలక్ వర్మలకు మొండి చేయి

ఆసియా కప్‌ కోసం ప్రకటించిన జట్టు నుంచే ఆటగాళ్ల ఎంపిక జరిగింది. వరల్డ్ కప్ కోసం కేవలం 15 మంది సభ్యులనే ప్రకటించాల్సి ఉండటంతో.. ఆసియా కప్‌లో చోటు దక్కించుకున్న తిలక్ వర్మ, ప్రసిధ్ కృష్ణతో పాటు రిజర్వ్ ప్లేయర్ సంజూ శాంసన్‌లను పక్కన పెట్టింది.

క్రికెట్ వన్డే వరల్డ్ కప్‌కు ఇండియా జట్టు ప్రకటన.. సంజూ, తిలక్ వర్మలకు మొండి చేయి
X

ఇండియా వేదికగా అక్టోబర్ 5 నుంచి ప్రతిష్టాత్మక ఐసీసీ వన్డే వరల్డ్ కప్ జరుగనున్నది. బీసీసీఐ ఆతిథ్యం ఇస్తున్న ఈ వరల్డ్ కప్‌లో పాల్గొనే దేశాల క్రికెట్ బోర్డులు సెప్టెంబర్ 5లోపు ప్రాథమిక జట్లను ప్రకటించాల్సి ఉన్నది. ఇవ్వాళ ఆఖరి రోజు కావడంతో బీసీసీఐ సెలక్షన్ కమిటీ 15 మందితో కూడిన భారత జట్టును ప్రకటించింది. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ నేతృత్వంలోని కమిటీ.. కెప్టెన్ రోహిత్ శర్మతో సంప్రదింపుల అనంతరం 15 మందిని ఎంపిక చేసింది.

ఆసియా కప్‌ కోసం ప్రకటించిన జట్టు నుంచే ఆటగాళ్ల ఎంపిక జరిగింది. వరల్డ్ కప్ కోసం కేవలం 15 మంది సభ్యులనే ప్రకటించాల్సి ఉండటంతో.. ఆసియా కప్‌లో చోటు దక్కించుకున్న తిలక్ వర్మ, ప్రసిధ్ కృష్ణతో పాటు రిజర్వ్ ప్లేయర్ సంజూ శాంసన్‌లను పక్కన పెట్టింది. యజువేంద్ర చాహల్ పునరాగమనం చేస్తాడని భావించినా.. సెలెక్షన్ కమిటీ అతడిని పూర్తిగా పక్కన పెట్టి కుల్దీప్ యాదవ్ వైపు మొగ్గు చూపింది.

కొంత కాలంగా నిరాశపరుస్తున్న సూర్యకుమార్ యాదవ్‌కు వన్డే వరల్డ్ కప్ జట్టులో స్థానం కల్పించారు. ఇక గాయాల తర్వాత ఆసియా కప్‌లో పునరాగమనం చేసిన శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్‌ను జట్టులోకి ఎంపిక చేశారు. వరల్డ్ కప్‌లో కీపింగ్ బాధ్యతలు కేఎల్ రాహుల్ చూసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బ్యాకప్ కీపర్‌గా ఇషాన్ కిషన్ కూడా అందుబాటులో ఉండనున్నాడు.

జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ షమి, మహ్మద్ సిరాజ్‌లు భారత పేసింగ్ దళాన్ని నడిపించనుండగా.. హార్థిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దుల్ ఠాకూర్ ఆల్ రౌండర్లుగా ఉండనున్నారు. స్పెషలిస్టు స్పిన్నర్ కోటాలో కేవలం కుల్దీప్‌కే ఛాన్స్ దక్కింది. బ్యాటింగ్ భారం రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీపై ఉండనున్నది. ఇక రోహిత్ జట్టును నడిపిస్తుండగా.. అతడికి డిప్యూటీగా హార్దిక్ పాండ్యాను కొనసాగిస్తున్నారు.

వన్డే వరల్డ్ కప్ కోసం టీమ్ ఇండియా :

బ్యాటర్లు : రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్

వికెట్ కీపర్లు : ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్


ఆల్‌రౌండర్లు : హార్థిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దుల్ ఠాకూర్

పేసర్లు : మహ్మద్ షమి, మహ్మద్ సిరాజ్, జస్ప్రిత్ బుమ్రా

స్పిన్నర్ : కుల్దీప్ యాదవ్

First Published:  5 Sep 2023 8:42 AM GMT
Next Story