Telugu Global
Sports

భారత్- శ్రీలంక తొలివన్డే నేడే!

కొత్తసంవత్సరంలో తొలివన్డే సిరీస్ సమరానికి ప్రపంచ మాజీ చాంపియన్లు భారత్, శ్రీలంక సిద్ధమయ్యాయి.

భారత్- శ్రీలంక తొలివన్డే నేడే!
X

కొత్తసంవత్సరంలో తొలివన్డే సిరీస్ సమరానికి ప్రపంచ మాజీ చాంపియన్లు భారత్, శ్రీలంక సిద్ధమయ్యాయి. గౌహతీ బార్సపారా స్టేడియం వేదికగా ఈరోజు తొలిపోరు జరుగనుంది.....

ఐసీసీ వన్డే ప్రపంచకప్ కు ప్రపంచ మాజీ చాంపియన్లు భారత్, శ్రీలంకజట్లు సన్నాహాలు ప్రారంభించాయి. కొత్తసంవత్సరంలో సరికొత్త సిరీస్ తో కసరత్తు మొదలు పెట్టాయి.

రోహిత్ శర్మ నాయకత్వంలోని భారతజట్టుకు దాసున్ షనక కెప్టెన్సీలోని శ్రీలంక సవాలు విసురుతోంది.

ఇషాన్, సూర్యాలకు చోటు దక్కేనా?

భారత తుదిజట్టులో చోటు కోసం తీవ్రపోటీ నెలకొంది. ఓపెనర్ స్థానం కోసం యువఆటగాళ్లు శుభ్ మన్ గిల్, వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్, మిడిలార్డర్లో చోటు కోసం...

ముంబైజోడీ శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్ పోటీపడుతున్నారు.

బంగ్లాదేశ్ తో ముగిసిన గత వన్డే మ్యాచ్ లో డబుల్ సెంచరీతో మెరుపులు మెరిపించిన ఇషాన్ కిషన్ కు ప్రస్తుత వన్డే తుదిజట్టులో చోటు దక్కడం అనుమానమే. శుభ్ మన్ గిల్ వైపే టీమ్ మేనేజ్ మెంట్ మొగ్గుచూపే అవకాశం ఉంది.

ఇక..మిడిలార్డర్లో నిలకడగా రాణిస్తున్న శ్రేయస్ అయ్యర్ ను పక్కనపెట్టి టీ-20 స్పెషలిస్ట్ సూర్యకుమార్ కు స్థానం ఇవ్వడమూ అనుమానమే.

బిగ్ త్రీకి అసలు సవాలు...

సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీ, కెఎల్ రాహుల్ ల సత్తాకు ఈ సిరీస్ సవాలుగా నిలిచింది. ఈ ముగ్గురూ తిరిగి ఫామ్ ను చాటుకోవాల్సిన పరిస్థితి యువఆటగాళ్ల నుంచి ఏర్పడింది.

వికెట్ కీపర్ బ్యాటర్ గా రాహుల్ తీవ్రఒత్తిడి నడుమ బరిలోకి దిగుతున్నాడు. పేస్ బౌలర్లుగా మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ, హార్ధిక్ పాండ్యా కీలకపాత్ర పోషించనున్నారు.

అక్షర్ పటేల్, యజువేంద్ర చాహల్, వాషింగ్టన్ సుదర్ లను తుదిజట్టులోకి తీసుకోడం ఖాయంగా కనిపిస్తోంది.

ఫేస్ టు ఫేస్ రికార్డుల్లో భారత్ దే పైచేయి...

వన్డే క్రికెట్లో 4వ ర్యాంకర్ భారత్ కు 8వ ర్యాంకర్ శ్రీలంక ప్రత్యర్థిగా మెరుగైన రికార్డే ఉంది. ఇప్పటి వరకూ శ్రీలంక ప్రత్యర్థిగా ఆడిన మ్యాచ్ ల్లో భారత్ కు 93 విజయాలు, 57 పరాజయాల రికార్డు ఉంది.

స్వదేశీగడ్డపై శ్రీలంకతో ఆడిన 51 వన్డేల్లో భారత్ కు 75 శాతం విజయాల రికార్డు ఉంది. 36 విజయాలు, 12 పరాజయాల రికార్డుతో ఉంది. మరో మూడుమ్యాచ్ లు ఫలితం తేలకుండానే ముగిశాయి.

2007 నుంచి 2021 మధ్యకాలంలో శ్రీలంక ప్రత్యర్థిగా ఆడిన ద్వైపాక్షిక సిరీస్ ల్లో 9సార్లు భారత్ విజేతగా నిలిచింది.1998 నుంచి శ్రీలంక చేతిలో భారత్ కు ఒక్క ఓటమి లేకపోడం విశేషం.

పరుగుల వెల్లువ ఖాయం....

ప్రస్తుత సిరీస్ లోని తొలివన్డేకి వేదికగా ఉన్న గౌహతీ బార్సపారా స్టేడియానికి పరుగుల గనిగా పేరుంది. బ్యాటర్ల స్వర్గధామం లాంటి ఇక్కడి పిచ్ పైన పరుగుల సునామీ తప్పదని క్యూరేటర్ అంటున్నారు.

ఇప్పటి వరకూ పలు అంతర్జాతీయ మ్యాచ్ లకు వేదికగా నిలిచిన బార్సపారా స్టేడియం గతంలో ఒకే ఒక్క అంతర్జాతీయ వన్డే మ్యాచ్ కు ఆతిథ్యమిచ్చింది. వెస్టిండీస్ ప్రత్యర్థిగా

2018 సిరీస్ లో భారత్ 322 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా చేధించడం ద్వారా విజేతగా నిలిచింది.

ఈరోజు మధ్యాహ్నం 1-30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గిన జట్టు మరో ఆలోచన లేకుండా చేజింగ్ కు దిగే అవకాశం ఉంది. మంచుప్రభావం కూడా మ్యాచ్ తుదిఫలితంపైన ప్రభావం చూపనుంది.

చేజింగ్ కు దిగే జట్టుకే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయని ఇక్కడి వాతావరణం, పిచ్ రికార్డులు చెబుతున్నాయి. తొలిగెలుపుతో సిరీస్ లో శుబారంభం చేసే అవకాశాన్ని ఏజట్టు దక్కించుకోగలదన్నది తెలుసుకోవాలంటే..మరికొద్దిగంటలపాటు వేచిచూడక తప్పదు.

First Published:  10 Jan 2023 5:31 AM GMT
Next Story