Telugu Global
Sports

నేడే భారత్- దక్షిణాఫ్రికా తొలి టీ-20 సమరం!

దక్షిణాఫ్రికా లో నెలరోజుల పర్యటనను భారత్ ఈ రోజు జరిగే టీ-20 సిరీస్ తొలిసమరంతో ప్రారంభించనుంది.

నేడే భారత్- దక్షిణాఫ్రికా తొలి టీ-20 సమరం!
X

దక్షిణాఫ్రికా లో నెలరోజుల పర్యటనను భారత్ ఈ రోజు జరిగే టీ-20 సిరీస్ తొలిసమరంతో ప్రారంభించనుంది.

2024-ఐసీసీ టీ-20 ప్రపంచకప్ కు టాప్ ర్యాంకర్ భారత్, 6వ ర్యాంకర్ దక్షిణాఫ్రికా సన్నాహాలు ప్రారంభించాయి. సొంతగడ్డపై ఆస్ట్ర్ర్రేలియాతో జరిగిన పాంచా పటాకా సిరీస్ ను 4-1తో గెలుచుకోడం ద్వారా దూకుడు మీదున్న భారత్..సఫారీగడ్డపై బౌన్సీ పిచ్ ల సవాలుకు సిద్ధమయ్యింది.

భారత కుర్రాళ్ల సత్తాకు సవాల్...

దక్షిణాఫ్రికా బౌన్సీ పిచ్ లపై సూర్యకుమార్ నాయకత్వంలోఎక్కువమంది యువఆటగాళ్లున్న భారత్ ఈరోజు తొలి పరీక్ష ఎదుర్కోనుంది. డర్బన్ లోని కింగ్స్ మీడ్ స్టేడియం వేదికగా భారత కాలమాన ప్రకారం సాయంత్రం 4 గంటలకు తొలి టీ-20 పోరు ప్రారంభంకానుంది.

మరో 7మాసాలలో ప్రారంభంకానున్న టీ-20 ప్రపంచకప్ కు సిద్ధంకావడానికి ఇటు భారత్, అటు దక్షిణాఫ్రికాజట్లకు కేవలం ఆరుమ్యాచ్ లు, రెండు సిరీస్ ల్లో మాత్రమే పాల్గొనే అవకాశం ఉండడంతో పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలన్న పట్టుదలతో ఉన్నాయి.

సూర్య కెప్టెన్ గా తొలి విదేశీ సిరీస్...

రోహిత్ శర్మ, హార్థిక్ పాండ్యా లాంటి సీనియర్ స్టార్లు అందుబాటులో లేకపోడంతో మిస్టర్ టీ-20 సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో భారతజట్టు సఫారీగడ్డపై ప్రస్తుత సీజన్లో తన తొలి టీ-20 సిరీస్ కు సై అంటోంది.

మొత్తం 17 మంది సభ్యులున్న భారతజట్టు యశస్వీ జైశ్వాల్, శుభ్ మన్ గిల్ ఓపెనర్లు గా బరిలోకి దిగుతోంది. వన్ డౌన్ లో శ్రేయస్ అయ్యర్, రెండో డౌన్లో సూర్యకుమార్ యాదవ్, రింకూ సింగ్, జితేశ్ శర్మ, రవీంద్ర జడేజా, రవి బిష్నోయ్, మహ్మద్ సిరాజ్, దీపక్ చహార్, అర్షదీప్ సింగ్ లతో తుదిజట్టును ఖరారు చేసుకొనే అవకాశం ఉంది.

మెరుపు ఫాస్ట్ బౌలర్లతో సఫారీసేన...

మరోవైపు ఆతిథ్య దక్షిణాఫ్రికా పవర్ ఫుల్ హిట్టర్లు, మెరుపు ఫాస్ట్ బౌలర్లతో టాప్ ర్యాంక్ భారత్ కు సవాలు విసురుతోంది. ఎయిడెన్ మర్కరమ్ నాయకత్వంలోని సఫారీజట్టులో రీజా హెండ్రిక్స్, మాథ్యూ బ్రీడ్జ్ కీ, ట్రిస్టాన్ స్టబ్స్, హెన్రిక్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్ లాంటి బ్యాటర్లు, పెలుకువాయా, గెరాల్డ్ కోట్జే,, నాండ్రే బర్గర్ లాంటి పేసర్లు, కేశవ్ మహారాజ్, టబ్రీజ్ షంషీ లాంటి స్పిన్నర్లు ఉన్నారు.

సొంతగడ్డపై అత్యంత ప్రమాదకరమైనజట్టుగా పేరున్న దక్షిణాఫ్రికాను ఎదుర్కొనడం భారత కుర్రాళ్లకు కత్తిమీద సవాలు లాంటిదే.

ఫేస్ టు ఫేస్ రికార్డుల్లో ......

ఐసీసీ టీ-20 ర్యాంకింగ్‌ ప్రకారం భారత్ టాప్ ర్యాంకర్ గా ఉంటే..దక్షిణాఫ్రికా మాత్రం 6వ ర్యాంకులో కొనసాగుతోంది. భారతజట్టులో ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్, ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ బౌలర్ రవి బిష్నోయ్ ఉన్నారు.

2017-18 తరువాత సఫారీగడ్డపై భారత్ తొలిసారిగా ద్వైపాక్షిక టీ-20 సిరీస్ లో పోటీపడబోతోంది. రెండుజట్ల ఫేస్ టు ఫేస్ రికార్డులు చూస్తే..దాదాపు సమఉజ్జీలుగానే కనిపిస్తున్నాయి.

మొత్తం 24 మ్యాచ్ ల్లో తలపడితే..భారత్ 13, దక్షిణాఫ్రికా 11 విజయాల రికార్డుతో ఉన్నాయి. 2015-16 సిరీస్ తర్వాత నుంచి దక్షిణాఫ్రికా ప్రత్యర్థిగా భారత్ కు ద్వైపాక్షిక సిరీస్ ల్లో పరాజయం అన్నదే లేకపోడం విశేషం.

అయితే..2022 టీ-20 ప్రపంచకప్ లో భాగంగా పెర్త్ వేదికగా జరిగిన గ్రూప్ లీగ్ మ్యాచ్ లో మాత్రం భారత్ ను దక్షిణాఫ్రికాజట్టే కంగు తినిపించింది.

గత రికార్డుల్లో సరిజోడీగా ఉన్న ఈ రెండుజట్లూ ప్రస్తుత సిరీస్ ను గెలుపుతో ప్రారంభించాలన్న పట్టుదలతో ఉన్నాయి. రెండుజట్లలోనూ ఎక్కువమంది యువఆటగాళ్లు, అంతగా అంతర్జాతీయ అనుభవం లేని వారు ఉండడంతో ఎక్కడలేని ఆసక్తిని రేకెత్తిస్తోంది.

ఇప్పటి వరకూ ఇంటజరిగిన సిరీస్ ల్లో మోత మోగించిన భారతజట్టు బయట సైతం రాణించాల్సి ఉంది.

First Published:  10 Dec 2023 2:14 AM GMT
Next Story