Telugu Global
Sports

హాకీ ప్రపంచ లీగ్ లో భారత్ సంచలనం!

2023 హాకీ ప్రపంచ లీగ్ లో ఆతిథ్య భారత్ సంచలన విజయం సాధించింది.

హాకీ ప్రపంచ లీగ్ లో భారత్ సంచలనం!
X

2023 హాకీ ప్రపంచ లీగ్ లో ఆతిథ్య భారత్ సంచలన విజయం సాధించింది. ప్రపంచ చాంపియన్ జర్మనీపై 3-2 గోల్స్ తో కళ్లు చెదిరే విజయం నమోదు చేసింది.

అంతర్జాతీయ హాకీ సమాఖ్య ప్రో-హాకీ లీగ్ లో ఒలింపిక్స్ కాంస్యవిజేత భారత్ సంచలన విజయంతో టైటిల్ వేట మొదలు పెట్టింది. ప్రపంచ మేటిజట్లు విశ్వవిజేత జర్మనీ, మాజీ చాంపియన్ ఆస్ట్ర్రేలియా, నెదర్లాండ్స్ తో కూడిన ఈ లీగ్ కు రూర్కెలాలోని బిర్సాముండా ఇంటర్నేషనల్ స్టేడియం ఆతిథ్యమిస్తోంది.

సుఖ్ జీత్ డబుల్..జర్మనీకి ట్రబుల్...

భారత్ వేదికగా కొద్దివారాల క్రితమే ముగిసిన హాకీ ప్రపంచకప్ లో విజేతగా నిలిచిన జర్మనీజట్టుకు..ప్రో-హాకీ లీగ్ ప్రారంభమ్యాచ్ లో మాత్రం అనుకోని ఓటమి తప్పలేదు.

ప్రపంచకప్ హాకీ క్వార్టర్స్ కు అర్హత సాధించడంలో విఫలమైన భారత్...హాకీలీగ్ లో మాత్రం జర్మనీపై 3-2 గోల్స్ తో అనూహ్య విజయం సాధించగలిగింది.

నువ్వానేనా అన్నట్లుగా సాగిన ఈ పోరులో భారత్ ఆట అన్ని విభాగాలలోనూ అత్యుత్తమంగా రాణించింది, అఫెన్స్ తో పాటు డిఫెన్స్ లోనూ చెలరేగిపోయింది.

ఆట ముగిసే క్షణాల వరకూ ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోటీలో భారత్ తరపున సుఖ్ జీత్ సింగ్ (ఆట 31, 42 నిముషాలలో ) రెండు మెరుపుగోల్స్ సాధించడం ద్వారా విజయంలో ప్రధానపాత్ర వహించాడు. మరో గోల్ ను ఆట 30వ నిముషంలో కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ నమోదు చేశాడు.

డిఫెన్స్ లో భారత్ సూపర్ హిట్...

ఆట 42వ నిముషానికే 3-0 గోల్స్ తో పైచేయి సాధించిన భారత్..ఆ తర్వాత జర్మనీ నుంచి తీవ్రఓత్తిడి ఎదుర్కొని రెండుగోల్స్ సమర్పించుకోవాల్సి వచ్చింది.

ఆట ముగిసే క్షణాలలో జర్మనీ తన గోల్ కీపర్ ను ఉపసంహరించుకొని..అదనపు ఆటగాడితో కలసి గోల్ కోసం చేసిన ప్రయత్నాలను భారత డిఫెండర్లు వమ్ము చేయగలిగారు. ఆట 5వ నిముషం నుంచే జర్మనీకి వెంటవెంటనే ఐదు పెనాల్టీ కార్నర్లు లభించినా భారత డిఫెండర్లు నిలువరించగలిగారు.

భారత్ కు మొత్తం 4 పెనాల్టీ కార్నర్లు లభించగా ఒక్కగోలు మాత్రమే చేయగలిగింది. జర్మనీకి 6 పెనాల్టీ కార్నర్లు లభించినా సద్వినియోగం చేసుకోగలిగింది.

ప్రపంచ చాంపియన్ జర్మనీ తరపున ఆట 44వ నిముషంలో కాఫ్‌మన్‌ ఫిలిప్‌ , 57వ నిముషంలో మిచెల్‌ సాధించారు. ప్రపంచకప్‌ టోర్నీ తర్వాత ఆడిన తొలి మ్యాచ్‌లోనే జర్మనీ ఓటమి చవిచూడటం విశేషం.

భారతజట్టుకు ప్రస్తుతం డేవిడ్ జాన్ స్టాప్ గ్యాప్ కోచ్ గా వ్యవహరిస్తున్నారు. ఇటీవలే కొత్త కోచ్ గా నియమితుడైన క్రెగ్ ఫుల్టన్ బాధ్యతల్ని తీసుకోవాల్సి ఉంది.

ఆదివారం జరిగే పోరులో ఆస్ట్రేలియా తో భారత్ తలపడనుంది.

సోమవారం జరిగే రెండో అంచె పోరులో జర్మనీతో మరోసారి భారత్ పోటీపడాల్సి ఉంది.

First Published:  11 March 2023 4:57 AM GMT
Next Story