Telugu Global
Sports

విండీస్‌పై భారీ విజయం.. భారత్ సిరీస్ విన్..!

వెస్టిండీస్‌తో తీన్మార్ వన్డే సిరీస్‌ను భారత్ భారీ విజయంతో కైవసం చేసుకుంది. వరుసగా 13వసారి సిరీస్ విన్నర్‌గా సరికొత్త రికార్డు నెలకొల్పింది.

విండీస్‌పై భారీ విజయం.. భారత్ సిరీస్ విన్..!
X

ప్రపంచకప్ సన్నాహాలలో భాగంగా 10వ ర్యాంకర్ వెస్టిండీస్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ను భారత్ 2-1తో కైవ‌సం చేసుకుంది. తారుబాలోని బ్రయన్ లారా క్రికెట్ అకాడమీ స్టేడియం వేదికగా ముగిసిన నిర్ణయాత్మక ఆఖరి వన్డేలో భారత్ 200 పరుగుల భారీ తేడాతో కరీబియన్ టీమ్ ను చిత్తు చేసింది. బార్బడోస్ వేదికగా ముగిసిన రెండో వన్డేలో ఎదురైన ఓటమితో కంగుతిన్న భారత్.. సిరీస్ విజేతను నిర్ణయించే ఆఖరి వన్డేలో సైతం ప్రయోగాల పరంపరను కొనసాగించింది. కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కొహ్లీలను మరోసారి బెంచ్ కే పరిమితం చేసింది.

కుమ్మేసిన భారత యువబ్యాటర్లు..

సిరీస్ నెగ్గాలంటే గెలిచితీరాల్సిన ఈ ఆఖరివన్డేలో హార్దిక్ పాండ్యా నాయకత్వంలో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన భారత్ 50 ఓవర్లలో 5 వికెట్లకు 351 పరుగుల భారీస్కోరు నమోదు చేసింది. ఓపెనర్లు ఇషాన్ కిషన్- శుభ్ మన్ గిల్ హాఫ్ సెంచరీలతో మొదటి వికెట్ కు సెంచరీ భాగస్వామ్యంతో అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. మిడిల్ ఓవర్లలో సంజు శాంసన్ మెరుపులు, డెత్ ఓవర్లలో స్టాప్ గ్యాప్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ ల మెరుపులతో భారత్ 351 పరుగుల స్కోరు నమోదు చేయగలిగింది.

ఇషాన్ హాఫ్ సెంచరీల హ్యాట్రిక్..

భారత డాషింగ్ ఓపెనర్ ఇషాన్ కిషన్ 64 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 77 పరుగుల స్కోరుకు అవుటయ్యాడు. ప్రస్తుత సిరీస్ లోని మూడుకు మూడుమ్యాచ్ ల్లోనూ హాఫ్ సెంచరీలు సాధించాడు. ఈ ఘనత సాధించిన భారత 5వ బ్యాటర్ గా రికార్డుల్లో చేరాడు. గతంలో దిలీప్ వెంగ్ సర్కార్, శిఖర్ ధావన్, మహేంద్ర సింగ్ ధోనీతో సహా మొత్తం నలుగురు బ్యాటర్లు.. మూడుమ్యాచ్ ల వన్డే సిరీస్ ల్లో మూడుకు మూడు మ్యాచ్ ల్లోనూ హాఫ్ సెంచరీలు సాధించిన రికార్డును సాధించగలిగారు. ప్రస్తుత సిరీస్ ద్వారా ఇషాన్ ఆ దిగ్గజాల సరసన నిలువగలిగాడు. మరో ఓపెనర్ శుభ్ మన్ గిల్ 92 బంతుల్లో 11 బౌండ్రీలతో 85 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు.

సంజు శాంసన్ ధనాధన్ హాఫ్ సెంచరీ..

భారత మరో యువఆటగాడు సంజు శాంసన్.. రాకరాక వచ్చిన అవకాశాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకున్నాడు. మిగిలిన బ్యాటర్లు పరుగులు చేయటానికి నానాపాట్లు పడుతున్న సమయంలో బ్యాటు ఝళిపించాడు. మెరుపు షాట్లతో ఎదురుదాడికి దిగి విండీస్ బౌలింగ్ ఎటాక్ ను చిత్తు చేశాడు. సంజు కేవలం 41 బంతుల్లోనే 4 సిక్సర్లు, 2 ఫోర్లతో 51 పరుగుల హాఫ్ సెంచరీతో మ్యాచ్ స్వరూపాన్నే మార్చి వేశాడు. సంజు కారణంగానే భారత్ 351 పరుగుల భారీస్కోరు నమోదు చేయగలిగింది. వన్డే క్రికెట్లో సంజుకు ఇది మూడో హాఫ్ సెంచరీ మాత్రమే.

ఆఖరి 15 ఓవర్లలో హార్దిక్ పాండ్యా- సూర్యకుమార్ యాదవ్ జోడీ ధాటిగా, సమయోచితంగా ఆడి చక్కటి ముగింపు నిచ్చారు. పాండ్యా 52 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 70 పరుగుల నాటౌట్ స్కోరు సాధించాడు. సూర్యకుమార్ యాదవ్ 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 35 పరుగులకు అవుటయ్యాడు. కరీబియన్ బౌలర్లలో రొమారియో షెఫర్డ్ 2 వికెట్లు, అల్జారీ జోసెఫ్, కరియా, మోతే తలో వికెట్ పడగొట్టారు.

151 పరుగులకే విండీస్ ఆలౌట్..

బ్యాటింగ్ కు అనువుగా ఉన్న పిచ్ పై మ్యాచ్ నెగ్గాలంటే 352 పరుగుల భారీలక్ష్యంతో చేజింగ్ కు దిగిన వెస్టిండీస్ 35.3 ఓవర్లలో 151 పరుగులకే కుప్పకూలి 200 పరుగుల ఘోరపరాజయం మూటగట్టుకొంది. వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్లు దారుణంగా విఫలమైన పిచ్ పైనే భారత పేసర్లు చెలరేగిపోయారు. ముకేశ్ కుమార్ 3 వికెట్లు,శార్దూల్ ఠాకూర్ 4 వికెట్లు, కుల్దీప్ యాదవ్ 2, ఉనద్కత్ 1 వికెట్ పడగొట్టారు. భారత విజయంలో ప్రధానపాత్ర వహించిన ఓపెనర్ శుభ్ మన్ గిల్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, సిరీస్ విజయంలో కీలకపాత్ర పోషించిన మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు దక్కాయి.

వరుసగా 13వ సిరీస్ గెలుపు..

వెస్టిండీస్ ప్రత్యర్థిగా 2006 తర్వాత నుంచి16 వన్డే సిరీస్ లు నెగ్గిన భారత్ కు ఇది వరుసగా 13వ సిరీస్ గెలుపు. 2006లో చివరిసారిగా వెస్టిండీస్ చేతిలో వన్డే సిరీస్ ఓటమి చవిచూసిన భారత్ ఆ తర్వాత మరి వెనుదిరిగి చూసింది లేదు. ప్రస్తుత సిరీస్ వరకూ ఈ రెండుజట్లూ 142 వన్డేల్లో తలపడితే భారత్ 72 విజయాలు, వెస్టిండీస్ 64 విజయాల రికార్డుతో ఉన్నాయి. రెండుమ్యాచ్‌లు టై కాగా.. నాలుగు వన్డేలు ఫలితం తేలకుండానే ముగిశాయి.

అంతేకాదు.. వెస్టిండీస్ ప్రత్యర్థిగా భారత్ కు ఇది రెండో అతిపెద్ద విజయం. 2018 సిరీస్ లో ముంబై వేదికగా జరిగిన వన్డేలో 224 పరుగులతో నెగ్గిన భారత్ ప్రస్తుత సిరీస్ లోని ఈ ఆఖరి వన్డేలో 200 పరుగులతే విజేతగా నిలిచింది. మొత్తం మీద..స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీ లేకుండానే భారతజట్టు హార్దిక్ పాండ్యా నాయకత్వంలో విదేశీగడ్డపై మరో వన్డే సిరీస్ విజయం సాధించగలిగింది.

First Published:  2 Aug 2023 7:51 AM GMT
Next Story