Telugu Global
Sports

ఆసియాక్రీడల హాకీలో భారత్ రికార్డు గెలుపు!

ఆసియాక్రీడల హాకీలో భారత పురుషులజట్టు రికార్డు గెలుపుతో బంగారు వేటను మొదలు పెట్టింది. ఉజ్బెకిస్థాన్ తో ముగిసిన గ్రూప్ లీగ్ పోటీలో గోల్ ల సునామీ సృష్టించింది.

ఆసియాక్రీడల హాకీలో భారత్ రికార్డు గెలుపు!
X

ఆసియాక్రీడల హాకీలో భారత పురుషులజట్టు రికార్డు గెలుపుతో బంగారు వేటను మొదలు పెట్టింది. ఉజ్బెకిస్థాన్ తో ముగిసిన గ్రూప్ లీగ్ పోటీలో గోల్ ల సునామీ సృష్టించింది...

ప్రపంచ, ఆసియాక్రీడల మాజీ చాంపియన్, ఆసియా టాప్ ర్యాంక్ జట్టు భారత్...హాంగ్జు ఆసియాక్రీడల గ్రూప్ లీగ్ ప్రారంభమ్యాచ్ లోనే గోల్ ల సునామీ సృష్టించింది.

ప్రపంచ 66వ ర్యాంక్ జట్టు ఉజ్బెకిస్థాన్ తో జరిగిన గ్రూప్ -ఏ ప్రారంభమ్యాచ్ లో భారత్ 16-0 గోల్స్ తో రికార్డు విజయం నమోదు చేసింది.

ఏకపక్షంగా సాగిన ఈ పోరులో భారత ఆటగాళ్లు లలిత్ ఉపాధ్యాయ, వరుణ్ కుమార్, మన్ దీప్ సింగ్ హ్యాట్రిక్ లు నమోదు చేయడం ఓ అరుదైన రికార్డుగా మిగిలిపోతుంది.

గోల్ వెంట గోల్ .......

మ్యాచ్ ప్రారంభమైన తొలినిముషం నుంచే భారతజట్టు చెలరేగిపోయింది. ఉజ్బెక్ డిఫెన్స్ ను చిందరవందర చేసింది. ఆట 7, 24, 37, 53 నిముషాలలో లలిత్, 12, 36, 50, 52 నిముషాలలో వరుణ్ చెరో నాలుగు గోల్స్ చొప్పున సాధించారు.

మిడ్ ఫీల్డర్ మన్ దీప్ సింగ్ ఆట 18, 27, 28 నిముషాలలో మూడుగోల్స్ నమోదు చేశాడు. 17వ నిముషంలో అభిషేక్, 38వ నిముషంలో అమిత్ రోహిదాస్, 43వ నిముషంలో షంషేర్ సింగ్, 57వ నిముషంలో సంజయ్ తలో గోలు చేసి భారత్ రికార్డు విజయాన్ని పూర్తి చేశారు.

భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ కు విశ్రాంతి నివ్వడంతో మన్ దీప్ సారథ్యంలో పోటీకి దిగింది. మొత్తం 60 నిముషాల ఆటలో భారత్ కు 14 పెనాల్టీకార్నర్లు లభిస్తే..కేవలం 5 గోల్స్ మాత్రమే సాధించగలిగింది. మిగిలిన 11 గోల్స్ ఫీల్డ్ గోల్స్ గా సాధించినవే.

ఆట మొదటి భాగానికి 7-0తో పైచేయి సాధించిన భారత్ మిగిలిన 9 గోల్స్ రెండో భాగంలో నమోదు చేసింది. ఒలింపిక్స్ కాంస్య విజేత భారత్ గ్రూప్ లీగ్ లో తన రెండోమ్యాచ్ ను మంగళవారం సింగపూర్ తో ఆడనుంది.

First Published:  24 Sep 2023 9:54 AM GMT
Next Story