Telugu Global
Sports

క్రికెట్ మూడు ఫార్మాట్లలోనూ ప్రపంచ నంబర్-1 భారత్!

ప్రపంచ క్రికెట్ మూడు విభాగాలలోనూ భారత్ మరోసారి టాప్ ర్యాంక్ జట్టుగా నిలిచింది.

క్రికెట్ మూడు ఫార్మాట్లలోనూ ప్రపంచ నంబర్-1 భారత్!
X

ప్రపంచ క్రికెట్ మూడు విభాగాలలోనూ భారత్ మరోసారి టాప్ ర్యాంక్ జట్టుగా నిలిచింది.

అంతర్జాతీయ క్రికెట్ మూడు ఫార్మాట్లలోనూ భారత ఆధిపత్యం కొనసాగుతోంది. ఐసీసీ టీమ్ తాజా ర్యాంకింగ్స్ ప్రకారం భారత్ మరోసారి నంబర్ వన్ స్థానం కైవసం చేసుకొంది.

సాంప్రదాయ టెస్టు క్రికెట్, ధూమ్ ధామ్ టీ-20 క్రికెట్, ఇన్ స్టంట్ వన్డే ఫార్మాట్ విభాగాలలో భారత్ అత్యధిక రేటింగ్ పాయింట్లతో తిరిగి టాప్ ర్యాంక్ ను చేరుకోగలిగింది.

ఇంగ్లండ్ పై రికార్డు విజయంతో అగ్రస్థానం...

ఇంగ్లండ్ తో స్వదేశీ గడ్డపై ముగిసిన ఐదుమ్యాచ్ ల ఐసీసీ టెస్ట్ లీగ్ సిరీస్ ను 4-1తో నెగ్గడం ద్వారా భారత్ తిరిగి సాంప్రదాయ టెస్టు క్రికెట్ ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ జట్టుగా అవతరించింది.

147 సంవత్సరాల టెస్టు క్రికెట్ చరిత్రలో, గత వందేళ్లకాలంలో ఐదుమ్యాచ్ ల టెస్టు సిరీస్ ను 4-1తో నెగ్గిన తొలిజట్టుగా రోహిత్ శర్మ నాయకత్వంలోని భారతజట్టు చరిత్ర సృష్టించింది.

ఐదుమ్యాచ్ ల సిరీస్ ను ఓటమితో మొదలు పెట్టి..ఆ తరువాతి నాలుగుటెస్టుల్లోనూ తిరుగులేని విజయాలు సాధించిన తొలిజట్టుగా కూడా భారత్ రికార్డు సృష్టించింది.

ధర్మశాల వేదికగా జరిగిన సిరీస్ లోని ఆఖరిటెస్టును మూడోరోజుఆటలోనే ఇన్నింగ్స్ 64 పరుగులతో నెగ్గడం ద్వారా భారత్ తిరుగులేని టాప్ ర్యాంక్ జట్టుగా నిలిచింది.

టాప్ ర్యాంక్ కోసం మూడుస్తంభాలాట...

ఐసీసీ టెస్టు లీగ్ లో మాత్రమే కాదు..సాంప్రదాయ టెస్టు క్రికెట్లో సైతం ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ కోసం భారత్, ఆస్ట్ర్రేలియా, న్యూజిలాండ్ జట్ల మధ్య మూడుస్తంభాలాట జరుగుతోంది. సిరీస్ సిరీస్ కు ఆధిక్యత చేతులు మారుతూ వస్తోంది.

ఆస్ట్ర్రేలియాతో జరిగిన రెండుమ్యాచ్ ల టెస్టు సిరీస్ ను న్యూజిలాండ్ 0-2తో చేజార్చుకోడంతో అగ్రస్థానం నుంచి దిగువకు పడిపోయింది. అయితే...4-1తో ఇంగ్లండ్ పై సిరీస్ నెగ్గడం ద్వారా భారత్ 122 పాయింట్లతో నంబర్ వన్ స్థానం సంపాదించింది.

భారత్ కంటే 5 పాయింట్లు తక్కువగా ఉన్న ఆస్ట్ర్రేలియా 117 పాయింట్లతో రెండోస్థానంలో కొనసాగుతోంది. హైదరాబాద్ వేదికగా జరిగిన తొలిటెస్టులో భారత్ ను 28 పరుగులతో కంగు తినిపించిన ఇంగ్లండ్ 111 పాయింట్లతో మూడోస్థానానికి చేరుకోగలిగింది.

వన్డే క్రికెట్లోనూ అదేజోరు....

50 ఓవర్ల వన్డే క్రికెట్లో ప్రపంచకప్ రన్నరప్ గా నిలిచిన భారత్ టీమ్ ర్యాంకింగ్స్ లో మాత్రం నంబర్ వన్ స్థానంలో ఉంది. 121 పాయింట్లతో భారత్, 118 పాయింట్లతో ఆస్ట్ర్రేలియా మొదటి రెండుస్థానాలలో ఉన్నాయి.

ప్రపంచ విజేత ఆస్ట్ర్రేలియా వన్డే ర్యాంకింగ్స్ రెండోస్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

టీ-20 ఫార్మాట్లో 266 పాయింట్లు...

ధూమ్ ధామ్ టీ-20 ఫార్మాట్లో సైతం భారత్ కు ఎదురేలేకుండా పోయింది. 266 పాయింట్లతో ప్రపంచ నంబర్ వన్ జట్టుగా నిలిచింది. ఆస్ట్ర్రేలియా వేదికగా ముగిసిన ప్రపంచకప్ సెమీస్ లోనే పరాజయం పొందిన భారతజట్టు ర్యాంకింగ్స్ లో మాత్రం ఆధిక్యత నిరూపించుకోగలిగింది.

ఇంగ్లండ్ 256 పాయింట్లతో టీ-20 రెండోర్యాంక్ జట్టుగా ఉంది.

2023 సెప్టెంబర్ 23 నుంచి 2024 జనవరి వరకూ ప్రపంచ నంబర్ వన్ టెస్టుజట్టుగా కొనసాగిన భారత్...దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్ సిరీస్ ను డ్రాగా ముగించడం ద్వారా రెండోర్యాంక్ కు పడిపోయింది.

అదే సమయంలో పాకిస్థాన్ తో మూడుమ్యాచ్ ల టెస్టు సిరీస్ ను 3-0తో నెగ్గడం ద్వారా ఆస్ట్ర్రేలియాజట్టు ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ జట్టుగా నిలిచింది.

రోహిత్ శర్మ ఖాతాలో 10వ టెస్టు గెలుపు...

అత్యధిక టెస్టు విజయాలు సాధించిన భారత ఐదవ కెప్టెన్ గా రోహిత్ శర్మ రికార్డుల్లో చేరాడు. ఐదుగురు సీనియర్ ( విరాట్ , షమీ, రాహుల్, పూజారా, రిషభ్ పంత్ ) స్టార్ ప్లేయర్లు లేకుండానే ఎక్కువమంది యువఆటగాళ్లతో కూడిన జట్టుతో ఇంగ్లండ్ తో తలపడిన భారత్ సంచలన విజయం సాధించింది.

సీనియర్ ప్లేయర్ కమ్ కెప్టెన్ రోహిత్ తనజట్టుకు ముందు నిలిచి వరుస విజయాలతో కదం తొక్కించాడు.

ఈ క్రమంలో భారత్ కు నాయకత్వం వహించిన 16 టెస్టుల్లో 10 విజయాలు అందించిన కెప్టెన్ గా అవతరించాడు. అంతేకాదు..2012 తర్వాత నుంచి స్వదేశంలో ఆఢిన సిరీస్ ల్లో భారత్ 17వ విజయం నమోదు చేయడం ద్వారా అత్యంత విజయవంతమైన జట్టుగా మరో రికార్డు నెలకొల్పింది.

First Published:  11 March 2024 5:37 AM GMT
Next Story