Telugu Global
Sports

భారత్ కు మరో రెండు క్రీడల్లో ఒలింపిక్స్ అర్హత!

పారిస్ ఒలింపిక్స్ లో పాల్గొనటానికి మరో రెండు క్రీడల్లో భారత క్రీడాకారులు అర్హత సాధించారు.

భారత్ కు మరో రెండు క్రీడల్లో ఒలింపిక్స్ అర్హత!
X

పారిస్ ఒలింపిక్స్ లో పాల్గొనటానికి మరో రెండు క్రీడల్లో భారత క్రీడాకారులు అర్హత సాధించారు. రోయింగ్ క్రీడలో భారత తొలి బెర్త్ ను బాల్ రాజ్ పన్వర్ కైవసం చేసుకోగా..మిక్సిడ్ రిలే వాక్ విభాగంలో సైతం భారతజోడీ ఆకాశ్ దీప్- ప్రియాంకా ఒలింపిక్స్ అర్హతను సంపాదించారు.

దక్షిణ కొరియాలోని చుంగ్జు వేదికగా జరిగిన 2024 ప్రపంచ, ఆసియా-ఓషీనియా ఒలింపిక్స్ అర్హత రెగెట్టా పోటీల సింగిల్స్ స్కల్ విభాగంలో బాల్ రాజ్ పన్వర్ మూడోస్థానంలో నిలవడం ద్వారా పారిస్ టికెట్ ఖాయం చేసుకోగలిగాడు.

భారత సైనిక దళాలకు చెందిన 25 సంవత్సరాల పన్వర్ 2వేల మీటర్ల రేస్ ను 7 నిముషాల 01.27 సెకన్ల సమయంలో పూర్తి చేయడం ద్వారా మూడోస్థానంలో నిలిచాడు.

హర్యానాలోని కర్నాల్ కు చెందిన పన్వర్ తన రేస్ మొదటి 500 మీటర్ల దూరాన్ని నిదానంగా పూర్తి చేసినా..ఆ తరువాత పుంజుకొని వేగం పెంచాడు. ఇదే విభాగంలో కజకిస్థాన్ రోయర్ వ్లాదిస్లావ్ యోక్వలేవ్, హాంకాంగ్ కు చెందిన హిన్ చున్ చి స్వర్ణ, రజతాలు సాధించగా పన్వర్ కాంస్య పతకం అందుకొన్నాడు.

ఒలింపిక్స్ అర్హత నిబంధనల ప్రకారం మొత్తం 20 మందిలో మొదటి ఐదుస్థానాలలో నిలిచినవారికి మాత్రమే పారిస్ గేమ్స్ లో పాల్గొనే అవకాశం దక్కుతుంది.

గత ఒలింపిక్స్ డబుల్ స్కల్స్ విభాగంలో పాల్గొన్న భారత క్రీడాకారులు..ప్రస్తుత ఒలింపిక్స్ కు అర్హత సాధించడంలో విఫలమయ్యారు.

భారతజోడీ ఉజ్వల్ కుమార్- అరవిందసింగ్ మొదటి రెండుస్థానాలలో నిలవడంలో సఫలం కాలేకపోయారు.

మిక్సిడ్ రిలే వాక్ లో...

టర్కీలోని అంటాల్యా వేదికగా జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ రేస్ వాకింగ్ టీమ్ చాంపియన్షిప్ లో భాగంగా నిర్వహించిన మిక్సిడ్ రిలే వాక్ విభాగంలో భారతజోడీ ఆకాశ్ దీప్ సింగ్- ప్రియాంకా పన్వర్ 18వ స్థానంలో నిలవడం ద్వారా ఒలింపిక్స్ కు అర్హత సంపాదించగలిగారు. మొత్తం 22 దేశాల జట్లు తలపడితే భారతజోడీ 18వ స్థానంలో నిలిచారు.

మొత్తం 42.195 కిలోమీటర్ల దూరాన్ని భారత జోడీ 3 గంటల 5 నిముషాల 3 సెకన్ల సమయంలో పూర్తి చేయగలిగారు. పురుషులు, మహిళలు కలసి పాల్గొనే ఈ రిలే వాక్ ను తొలిసారిగా పారిస్ ఒలింపిక్స్ లో పతకం అంశంగా నిర్వహిస్తున్నారు.

ఆడమగ జట్టుగా పాల్గొనే ఈ రేస్ లో మహిళా వాకర్ 10 కిలోమీటర్ల దూరం నడిస్తే..ఆమె భాగస్వామి 12.195 కిలోమీటర్ల దూరం నడవాల్సి ఉంటుంది. ఈ ఇద్దరి సగటు వేగాన్ని బట్టి విజేతలుగా నిర్ణయిస్తారు.

ఇటాలియన్ జోడీ ఫ్రాన్సిస్కో ఫార్చునాటో- వాలెంటీనా ట్రాప్ లెట్టీ 2 గంటల 56 నిముషాల 45 సెకన్ల రికార్డు టైమ్ తో బంగారు పతకం అందుకొన్నారు. జపాన్ జోడీ కోకీ ఇకెడా- కుమికో ఒకాడా 2 గంటల 57 నిముషాల 4 సెకన్లతో రజత, స్పెయిన్ జోడీ అల్వారో మార్టిన్- లారా గార్షియా-కారో 2 గంటల 57 నిముషాల 47 సెకన్ల టైమింగ్ తో రజత, కాంస్య పతకాలు సాధించారు.

గత ఒలింపిక్స్ లో 125 మందికి పైగా అథ్లెట్ల బృందంతో బరిలోకి దిగిన భారత్ ప్రస్తుత పారిస్ ఒలింపిక్స్ ప్రారంభానికి మరో మూడుమాసాల సమయం ఉండగా..ఇప్పటి వరకూ 50కి పైగా ఒలింపిక్స్ బెర్త్ లు మాత్రమే సాధించగలిగింది.

టోక్యో ఒలింపిక్స్ పతకాల పట్టిక 48వ స్థానంలో నిలిచిన భారత్..ప్రస్తుత పారిస్ ఒలింపిక్స్ లో మెరుగైన ఫలితాలు సాధించాలన్న పట్టుదలతో ఉంది. మీరాబాయి చాను, లవ్లీనా బోర్గోహెయిన్, పీవీ సింధు, రవికుమార్ దహియా, బజరంగ్ పూనియా,నీరజ్ చోప్రా వ్యక్తిగత విభాగాలలో పతకాలు తెస్తే..పురుషుల హాకీలో భారత్ కాంస్య పతకం గెలుచుకోడం ద్వారా సంచలనం సృష్టించింది.

పురుషుల జావలిన్ త్రోలో నీరజ్ చోప్రా సాధించిన బంగారు పతకం పుణ్యమా అని భారత్ గత నాలుగు దశాబ్దాల ఒలింపిక్స్ చరిత్రలో అత్యుత్తమంగా 48వ స్థానం సంపాదించగలిగింది.

కుస్తీ ప్రీ-స్టయిల్ విభాగంలో ఇప్పటికే నలుగురు భారత మహిళా వస్తాదులు అర్హత సంపాదించారు. షూటింగ్ విభాగంలో మొత్తం 24 బెర్త్ లు అందుబాటులో ఉండగా భారత షూటర్లు ఇప్పటికే 20 బెర్త్ లు సాధించడం ద్వారా సరికొత్త రికార్డు నెలకొల్పారు.

పారిస్ ఒలింపిక్స్ లో మొత్తం 32 క్రీడల్లో 329 బంగారు పతకాల కోసం 204 దేశాలకు చెందిన 10వేల మంది అథ్లెట్లు తలపడనున్నారు.

First Published:  22 April 2024 4:14 AM GMT
Next Story