Telugu Global
Sports

ప్రపంచకప్ హాకీలో భారత్ శుభారంభం!

2023 హాకీ పురుషుల ప్రపంచకప్ హాకీ గ్రూప్ లీగ్ తొలిపోరులో భారత్ విజయంతో శుభారంభం చేసింది. స్పెయిన్ పై 2-0 గోల్స్ తో విజేతగా నిలిచింది.

ప్రపంచకప్ హాకీలో భారత్ శుభారంభం!
X

2023 హాకీ పురుషుల ప్రపంచకప్ హాకీ గ్రూప్ లీగ్ తొలిపోరులో భారత్ విజయంతో శుభారంభం చేసింది. స్పెయిన్ పై 2-0 గోల్స్ తో విజేతగా నిలిచింది...

భారతగడ్డపై నాలుగోసారి జరుగుతున్న పురుషుల హాకీ ప్రపంచకప్ టోర్నీని భారత్ చక్కటి విజయంతో మొదలుపెట్టింది. రూర్కెలాలోని బిర్సాముండా ఇంటర్నేషనల్ హాకీ స్టేడియం వేదికగా ముగిసిన గ్రూప్- డీ లీగ్ తొలిపోరులో భారత్ 2-0 గోల్స్ తో ప్రపంచ రెండోర్యాంకర్ స్పెయిన్ ను కంగుతినిపించింది.

ఇతర గ్రూప్ లీగ్ పోటీలలో ఆస్ట్ర్రేలియా, ఇంగ్లండ్, అర్జెంటీనా తొలివిజయాలతో బోణీ కొట్టాయి.

టాప్ గేర్ లో భారత్...

హాకీప్రపంచకప్ ను 1975 తర్వాత మరోసారి గెలుచుకోవాలని తహతహలాడుతున్న భారత్ ప్రస్తుత 2023 ప్రపంచకప్ లో ఆతిథ్యదేశం హోదాలో పోటీపడుతోంది.

ఇంగ్లండ్, వేల్స్, స్పెయిన్ జట్లతో కూడిన గ్రూప్- డీ లీగ్ లో భారత్ పోటీపడుతోంది.

ప్రస్తుత ప్రపంచకప్ హాకీ టోర్నీ కోసమే నిర్మించిన రూర్కెలాలోని బిర్సాముండా స్టేడియం తొలిపోటీ ప్రారంభానికి ముందే కిక్కిరిసిపోయింది. 250 కోట్ల రూపాయల భారీఖర్చుతో నిర్మించిన ఈ హాకీ స్టేడియం కాంప్లెక్స్ లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆస్ట్ర్ర్రోటర్ఫ్ మైదానం ప్రారంభమ్యాచ్ లో భారత్- స్పెయిన్ జట్ల పోటీ నిర్వహించారు.

ఆట తొలినిముషం నుంచే భారత్ ఆధిపత్యంతో కొనసాగిన ఈ పోరు ఆట మొదటి క్వార్టర్ 12వ నిముషంలోనే లభించిన పెనాల్టీ కార్నర్ ద్వారా స్థానిక ఆటగాడు అమిత్ రోహిదాస్ తొలిగోలుతో భారత్ కు 1-0 ఆధిక్యం అందించాడు.

ఆ తర్వాతి క్వార్టర్స్ లో భారత్ దూకుడుగా ఆడి పలుమార్లు గోల్స్ సాధించే అవకాశాలను సంపాదించినా సద్వినియోగం చేసుకోలేకపోయింది. ఎక్కువమంది యువఆటగాళ్లతో కూడిన స్పెయిన్ జట్టును భారత డిఫెండర్లు సమర్థవంతంగా నిలువరించారు.

ఆట రెండో క్వార్టర్ లో హార్థిక్ సింగ్ సోలోగా డ్రిబ్లింగ్ చేసుకొంటూ ప్రత్యర్థిగోలు లోకి చొచ్చుకుపోయి ఓ చూడముచ్చటైన ఫీల్డ్ గోల్‌ తో ఆధిక్యాన్ని 2-0కు పెంచాడు. ఆట చివరి రెండు క్వార్టర్లలో భారత్ కు గోల్ సాధించే అవకాశాలు వచ్చిన ప్రయోజనం లేకపోయింది. భారత్ కు మొత్తం 5 పెనాల్టీ కార్నర్లు దక్కితే ఒక్కగోల్ మాత్రమే చేయగలిగింది.

ఆట మూడోక్వార్టర్ లో లభించిన పెనాల్టీ స్ట్ర్రోక్ ను కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ గోలుగా మలచడంలో విఫలం కావడంతో భారత్ ఆధిక్యం 2-0 గోల్స్ కే పరిమితమయ్యింది.

భారత హాకీ జట్టుకు ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్న ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం.. జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఇద్దరు ప్లేయర్లకు చెరో పది లక్షలు నజరానాగా అందచేసింది. ఈ మ్యాచ్ లో భారతజట్టులో సభ్యుడుగా ఉన్న అమిత్‌ రోహిదాస్ కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు దక్కింది.

ఇతర గ్రూప్ లీగ్ తొలిరౌండ్ పోటీలలో ఇంగ్లండ్‌ 5-0తో వేల్స్‌ ను, మూడుసార్లు ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియా 8-0తో ఫ్రాన్స్‌ ను చిత్తు చేశాయి. మరోపోటీలో అర్జెంటీనా గట్టిపోటీ ఎదుర్కొని ఆఫ్రికా చాంపియన్ దక్షిణాఫ్రికాను 1-0తో అధిగమించగలిగింది.

గ్రూప్- డీ లీగ్ లో భాగంగా ఈనెల 15న జరిగే రెండోరౌండ్ పోటీలో పవర్ ఫుల్ ఇంగ్లండ్ తో 6వ ర్యాంకర్ భారత్ అమీతుమీ తేల్చుకోనుంది.

First Published:  14 Jan 2023 9:14 AM GMT
Next Story