Telugu Global
Sports

ప్రపంచకప్ కీలక్ మ్యాచ్ లో నీరుగారిన భారత్!

హాకీ ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్స్ కు నేరుగా చేరుకోడంలో ఆతిథ్య భారత్ విఫలమయ్యింది.

ప్రపంచకప్ కీలక్ మ్యాచ్ లో నీరుగారిన భారత్!
X

హాకీ ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్స్ కు నేరుగా చేరుకోడంలో ఆతిథ్య భారత్ విఫలమయ్యింది. అత్యంత బలహీనమైన వేల్స్ జట్టుతో జరిగిన కీలకపోరులో 4-2 గోల్స్ తో విజేతగా నిలిచినా ప్రయోజనం లేకపోయింది...

భారతగడ్డపై నాలుగోసారి జరుగుతున్న ప్రపంచకప్ హాకీ టోర్నీలో ఆతిథ్య భారతజట్టు నేరుగా క్వార్టర్ ఫైనల్స్ చేరడంలో విఫలమయ్యింది. గ్రూప్-డీ లీగ్ విన్నర్ గా నిలువలేకపోయింది.

వేల్స్, స్పెయిన్, ఇంగ్లండ్ జట్లతో కూడిన గ్రూప్ -డీ లీగ్ లో భారత్ మూడురౌండ్లలో రెండువిజయాలు, ఓ డ్రాతో 7 పాయింట్లు సాధించడం ద్వారా 5వ ర్యాంకర్ ఇంగ్లండ్ తో సమఉజ్జీగా నిలిచినా..సాధించిన గోల్స్ ప్రాతిపదికన రెండోస్థానంలో నిలవాల్సి వచ్చింది.

భారత్ ను నిలువరించిన వేల్స్..

గ్రూప్ లీగ్ లో ఇంగ్లండ్ చేతిలో 0-5, స్పెయిన్ చేతిలో 1-5 గోల్స్ తేడాతో పరాజయాలు పొందిన 14వ ర్యాంకర్ వేల్స్ జట్టు...6వ ర్యాంకర్ భారత్ తో జరిగిన ఆఖరిరౌండ్ పోరులో గట్టిపోటీ ఇచ్చింది.

గ్రూపులోనే బలహీనమైనజట్టుగా ఉన్న వేల్స్ తో జరిగిన పోటీలో భారత్ 8 గోల్స్ తో నెగ్గితేనే నేరుగా క్వార్టర్ ఫైనల్స్ చేరే అవకాశం ఉంది. ఎనిమిదిగోల్స్ సాదించగలిగితేనే..ఇంగ్లండ్ ను అధిగమించే అవకాశం ఉంది.

అయితే..భారత్ మాత్రం 4-2 గోల్స్ తో మ్యాచ్ నెగ్గడం ద్వారా నాకౌట్ బెర్త్ ఆశల్ని క్లిష్టం చేసుకొంది. వేల్స్ కు రెండుగోల్స్ చేసే అవకాశం ఇవ్వడం కూడా భారత అవకాశాలను దెబ్బతీసింది.

ఆట మొదటి భాగం రెండుక్వార్టర్లలో భారత్ ఆధిపత్యం ప్రదర్శించినా కేవలం ఒక్కగోలు మాత్రమే చేయగలిగింది. రెండో భాగంగా మూడో క్వార్టర్లో వేల్స్ వెంటవెంటనే రెండుగోల్సు చేసి భారత్ ను ఆత్మరక్షణలో పడేసింది. చివరకు భారత్ రెండో భాగంలో మూడుగోల్స్ చేయడం ద్వారా..4-2 గోల్స్ తో విజేతగా నిలిచింది.

భారత్ తరపున ఆట 21వ నిముషంలో షంషేర్ సింగ్, 32, 45 నిముషాలలో ఆకాశ్ దీప్ సింగ్, 59వ నిముషంలో కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ గోల్స్ సాధించారు.

వేల్స్ తరపున 42వ నిముషంలో గారెత్ ఫర్లాంగ్, 44వ నిముషంలో జేకబ్ డ్రాపర్ చెరో గోలు సాధించారు.

గ్రూప్- డీ నుండి ఇంగ్లండ్ నేరుగా క్వార్టర్ ఫైనల్స్ చేరుకోగా..రన్నరప్ గా నిలిచిన భారత్ మాత్రం..క్రాస్ ఓవర్ మ్యాచ్ లో న్యూజిలాండ్ తో అమీతుమీ తేల్చుకోవాల్సి ఉంది.

అంతకుముందు జరిగిన గ్రూప్ -డి లీగ్ మరో ఆఖరిరౌండ్ పోరులో ఇంగ్లండ్ 4-0 గోల్సుతో స్పెయిన్ ను కంగుతినిపించింది.

First Published:  20 Jan 2023 5:14 AM GMT
Next Story