Telugu Global
Sports

సిరీస్ స్వీప్ వైపు భారత్ చూపు, నేడే ఆఖరి టెస్ట్!

బంగ్లాదేశ్ తో రెండుమ్యాచ్ ల టెస్టు సిరీస్ స్వీప్ కు భారత్ గురిపెట్టింది. మీర్పూర్ వేదికగా ఈరోజు జరిగే ఆఖరిటెస్టు భారత్ కు చెలగాటం, ఆతిథ్య బంగ్లాకు సిరీస్ సంకటంగా మారింది.

సిరీస్ స్వీప్ వైపు భారత్ చూపు, నేడే ఆఖరి టెస్ట్!
X

సిరీస్ స్వీప్ వైపు భారత్ చూపు, నేడే ఆఖరి టెస్ట్!

బంగ్లాదేశ్ తో రెండుమ్యాచ్ ల టెస్టు సిరీస్ స్వీప్ కు భారత్ గురిపెట్టింది. మీర్పూర్ వేదికగా ఈరోజు జరిగే ఆఖరిటెస్టు భారత్ కు చెలగాటం, ఆతిథ్య బంగ్లాకు సిరీస్ సంకటంగా మారింది....

ఐసీసీ 2022-23 టెస్టు లీగ్ లో భాగంగా బంగ్లాదేశ్ తో జరుగుతున్న రెండుమ్యాచ్ ల సిరీస్ లో వరుసగా రెండో విజయంతో సిరీస్ స్వీప్ కు భారత్ ఉరకలేస్తోంది.

చోటాగ్రామ్ వేదికగా ముగిసిన తొలిటెస్టులో 188 పరుగుల భారీవిజయంతో 1-0 ఆధిక్యం సాధించిన భారత్...తుదిజట్టులో మార్పులేవీ లేకుండానే పోటీకి దిగుతోంది.

మరోవైపు... వన్డే సిరీస్ లో భాగంగా మీర్పూర్ వేదికగానే ముగిసిన మొదటి రేండువన్డేలలో భారత్ ను కంగుతినిపించిన ఆత్మవిశ్వాసంతో బంగ్లాజట్టు పోటీకి సిద్ధమయ్యింది.

తుదిజట్టులో ఒకటి లేదా రెండుమార్పులతో సమరానికి సై అంటోంది.

బౌలింగ్ కు షకీబుల్ రెడీ...

తొలిటెస్టులో భుజం గాయంతో బౌలింగ్ కు దూరంగా ఉన్న కెప్టెన్ షకీబుల్ రెండోటెస్టుకు ఫిట్ నెస్ సాధించడంతో బంగ్లాబౌలింగ్ కు అదనపు బలం చేకూరినట్లయ్యింది. పేసర్ ఇబాదత్ హుస్సేన్ సైతం గాయంతో బాధపడుతూ ఉండడంతో బంగ్లాతుదిజట్టులో మార్పు అనివార్యంగా కనిపిస్తోంది. బ్యాటింగ్ లో సైతం బంగ్లాటాపార్డర్ నిలకడలేమి ఆందోళనకు గురి చేస్తోంది. మాజీ కెప్టెన్ మోమినుల్ హక్ తుదిజట్టులో చేరడం ఖాయం కాగా...లిట్టన్ దాస్ వికెట్ కీపర్ బ్యాటర్ గా జంట విధులు నిర్వర్తించనున్నాడు.

భారత్ మాత్రం ఇద్దరు పేసర్లు, ముగ్గురు స్పిన్నర్లతో మరోసారి బంగ్లాటాపార్డర్ పనిపట్టాలని భావిస్తోంది. నెట్ ప్రాక్టీసులో పాల్గొంటూ స్టాప్ గ్యాప్ కెప్టెన్ రాహుల్ గాయపడినా..

పూర్తి ఫిట్ నెస్ తో మ్యాచ్ కు సిద్ధమని బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ ప్రకటించారు.

పూజారా, అశ్విన్ లను ఊరిస్తున్న రికార్డులు...

తొలిటెస్టులో అంచనాలకు తగ్గట్టుగా రాణించిన నయావాల్ చతేశ్వర్ పూజారా, స్పిన్ ఆల్ రౌండర్ అశ్విన్ ను అరుదైన రికార్డులు ఊరిస్తున్నాయి. ఈరోజు ప్రారంభమయ్యే రెండోటెస్టులో పూజారా మరో 16 పరుగులు సాధిస్తే...8వేల పరుగుల మైలురాయిని, అశ్విన్ మరో 11 పరుగులు సాధించగలిగితే 3వేల పరుగుల రికార్డును అందుకోగలుగుతారు.

ఇప్పటికే బౌలర్ గా 400కు పైగా వికెట్లు పడగొట్టిన అశ్విన్ 3వేల పరుగుల మైలురాయిని చేరగలిగితే..గతంలో ఇదే ఘనత సాధించిన దిగ్గజ ఆల్ రౌండర్లు కపిల్ దేవ్, షేన్ వార్న్, రిచర్డ్ హాడ్లీ, షాన్ పోలాక్ ల సరసన నిలువగలుగుతాడు. అంతే కాదు మరో 7 వికెట్లు పడగొట్టగలిగితే 450 వికెట్ల రికార్డును సైతం పూర్తి చేయగలుగుతాడు.

అశ్విన్ ఇప్పటి వరకూ ఆడిన 87 టెస్టుల్లో 443 వికెట్లు సాధించాడు. 30 సార్లు 5 వికెట్ల చొప్పున పడగొట్టాడు.

తొలిటెస్ట్ మొదటి ఇన్నింగ్స్ లో 90, రెండో ఇన్నింగ్స్ లో అజేయ శతకం బాదిన పూజారా మరో 16 పరుగులు చేయగలిగితే...8వేల పరుగుల రికార్డుతో సచిన్, లక్ష్మణ్, సెహ్వాగ్, కొహ్లీ, ద్రావిడ్, సునీల్ గవాస్కర్, సౌరవ్ గంగూలీల సరసన చేరగలుగుతాడు.

బంగ్లాపై భారత్ అజేయరికార్డు..

ప్రస్తుత సిరీస్ లోని తొలిటెస్టు వరకూ బంగ్లా ప్రత్యర్థిగా 11 టెస్టులు ఆడిన భారత్ 9 విజయాలతో అజేయ రికార్డుతో ఉంది. రెండుటెస్టులు మాత్రమే డ్రాల పద్దులో చేరాయి.

భారత్ పై ఇప్పటి వరకూ బంగ్లాదేశ్ కు ఒక్కటెస్టు విజయమూ లేదు.

మరోవైపు..తొలిటెస్టు వేదిక చోటాగ్రామ్ వికెట్ తో పోల్చితే...రెండోటెస్టు వేదిక మీర్పూర్ పిచ్ కాస్త బౌన్స్ తో ఫాస్ట్ బౌలర్లకు సహకరించే అవకాశం ఉంది. ముందుగా బ్యాటింగ్ కు దిగిన జట్లకే ఎక్కువ విజయాలు సాధించిన రికార్డు సైతం మీర్పూర్ స్టేడియానికి ఉంది.

మీర్పూర్ వేదికగా ఆడినటెస్టుల్లో పర్యాటకజట్లు 14 విజయాలు నమోదు చేస్తే...బంగ్లాజట్టుకు ఆరు విజయాలు మాత్రమే ఉన్నాయి.

గణాంకాలు ఎలా ఉన్నా..సిరీస్ లోని ఈ ఆఖరిటెస్టు భారత్ కు చెలగాటం, ఆతిథ్య బంగ్లాకు సిరీస్ సంకటం అని చెప్పక తప్పదు.

First Published:  22 Dec 2022 4:08 AM GMT
Next Story