Telugu Global
Sports

ప్రపంచకప్ వేటలో భారత్ అసలుసిసలు హీరో!

వన్డే ప్రపంచకప్ టైటిల్ కు భారత్ అడుగుదూరంలో నిలిచింది. పది వరుస విజయాలతో మూడోసారి ట్రోఫీ అందుకోడానికి ఉరకలేస్తోంది.

ప్రపంచకప్ వేటలో భారత్ అసలుసిసలు హీరో!
X

వన్డే ప్రపంచకప్ టైటిల్ కు భారత్ అడుగుదూరంలో నిలిచింది. పది వరుస విజయాలతో మూడోసారి ట్రోఫీ అందుకోడానికి ఉరకలేస్తోంది. భారత్ ఈ జైత్రయాత్ర వెనుక ఓ నిస్వార్థ క్రికెట్ యోధుడి త్యాగం అంతాఇంతా కాదు.

క్రికెట్..జట్టుగా ఆడే క్రీడ. తుదిజట్టులోని 11 మంది ఆటగాళ్ళు కలసి కట్టుగా ఆడితేనే విజయాలు సాధ్యమవుతాయి. అయితే..కొన్ని సందర్భాలలో ఒంటిచేత్తో జట్టుకు విజయాలు అందించే మొనగాళ్లు సైతం లేకపోలేదు.

ప్రస్తుత వన్డే ప్రపంచకప్ లో 10జట్ల లీగ్ దశ నుంచి సెమీఫైనల్స్ నాకౌట్ పోరు ముగిసే వరకూ అత్యంత విజయవంతమైన జట్టు ఏదంటే భారత్ అన్నమాటే వినిపిస్తుంది.

రౌండ్ రాబిన్ లీగ్ దశలో తొమ్మిదికి తొమ్మిది మ్యాచ్ లూ నెగ్గడంతో పాటు..సెమీఫైనల్ నాకౌట్ రౌండ్లో న్యూజిలాండ్ ను 70 పరుగుల తేడాతో చిత్తు చేయడం ద్వారా భారత్ నాలుగోసారి ప్రపంచకప్ ఫైనల్లో అడుగుపెట్టింది.

సెంచరీలు, రికార్డుల కోసం కాదు...

భారత్ ఈ విజయపరంపర వెనుక బ్యాటర్లు, బౌలర్ల సమష్టికృషి ఎంతో ఉంది. చీఫ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ అండ్ కో వ్యూహాలు, ఆ వ్యూహాలను ఫీల్డ్ లో అమలు చేయటంలో కెప్టెన్ రోహిత్ శర్మ చాతుర్యం, సమర్థత కూడా భారత్ ను అత్యంత విజయవంతమైనజట్టుగా నిలిపాయి.

మాజీ కెప్టెన్ విరాట్ కొహ్లీ ఇప్పటికే మూడు సెంచరీలు, 7 హాఫ్ సెంచరీలతో సహా పలు ప్రపంచ రికార్డులు నమోదు చేస్తే..ఓపెనర్ శుభ్ మన్ గిల్, మిడిలార్డర్ బ్యాటర్లు శ్రేయస్ అయ్యర్, కెఎల్ రాహుల్ సైతం శతకాలు నమోదు చేయగలిగారు.

వన్డే క్రికెట్ చరిత్రలోనే మూడుసార్లు డబుల్ సెంచరీలు, ఒకే ప్రపంచకప్ లో ఐదుశతకాలు బాదిన ఏకైక క్రికెటర్ గా రోహిత్ శర్మ ప్రపంచ రికార్డులు నెలకొల్పాడు. ప్రస్తుత ప్రపంచకప్ లో మాత్రం రోహిత్ ఇప్పటి వరకూ ఆడిన 10 మ్యాచ్ ల్లో ఒకే ఒక్క సెంచరీతో పాటు 3 హాఫ్ సెంచరీలు మాత్రమే సాధించగలిగాడు.

రోహిత్ వ్యక్తిగత రికార్డుల కోసమే ఆడి ఉంటే కనీసం 5 శతకాలు బాది ఉండేవాడేనని సునీల్ గవాస్కర్, నాసిర్ హుస్సేన్, రవిశాస్త్ర్రి, గౌతం గంభీర్ లాంటి క్రికెట్ దిగ్గజాలు చెబుతున్నారు.

సైలెంట్ హీరో రోహిత్ శర్మ....

భారత క్రికెట్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ప్రస్తుత ప్రపంచకప్ లో జట్టు ప్రయోజనాల కోసమే నిస్వార్థంగా ఆడుతూ సైలెంట్ హీరోగా తన పాత్ర నిర్వర్తిస్తున్నాడని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్, క్రికెట్ వాఖ్యాత నాసిర్ హుస్సేన్ కితాబిచ్చాడు.

పవర్ ప్లే ( మొదటి 10 ) ఓవర్లలోనే రోహిత్ శర్మ తన వికెట్ ను, వ్యక్తిగత రికార్డుల మోహాన్ని పక్కనపెట్టి భారీషాట్లతో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకు పడుతున్న కారణంగానే విరాట్ కొహ్లీ వ్యక్తిగతంగా రికార్డుల పంట పండించుకోగలుగుతున్నాడని మరికొందరు క్రికెట్ పండితులు అభిప్రాయపడుతున్నారు. భారతజట్టులోని మిగిలిన దిగ్గజ బ్యాటర్లు వ్యక్తిగత రికార్డుల కోసం పాకులాడుతుంటే..కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం తన వ్యక్తిగత రికార్డుల స్వార్థాన్ని పక్కనబెట్టి..ప్రపంచకప్ కోసం వెంపర్లాడుతున్నాడని అంటున్నారు.

రౌండ్ రాబిన్ లీగ్ లోని తొమ్మిది రౌండ్ల మ్యాచ్ లతో పాటు..సెమీఫైనల్స్ నాకౌట్ వరకూ 10 మ్యాచ్ లు ఆడిన రోహిత్ 120 స్ట్ర్రయిక్ రేట్ తో 550 పరుగులు సాధించాడు.ఇందులో 131 పరుగుల శతకంతో పాటు ..మూడు అర్థసెంచరీలు మాత్రమే ఉన్నాయి.

పవర్ ప్లే ఓవర్లలో 300కు పైగా పరుగులతో పాటు అత్యధికంగా 21 సిక్సర్లు బాదిన ఏకైక ఓపెనర్ ఘనతను రోహిత్ సొంతం చేసుకొన్నాడు. ప్రపంచకప్ టోర్నీలలో రోహిత్ 51 సిక్సర్లు బాదడం ద్వారా కరీబియన్ దిగ్గజం క్రిస్ గేల్ పేరుతో ఉన్న 49 సిక్సర్ల ప్రపంచ రికార్డును సైతం అధిగమించగలిగాడు.

రోహిత్ కు ఇదే ఆఖరి ప్రపంచకప్!

రోహిత్ శర్మ 2011 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. ఆ తర్వాత జరిగిన టోర్నీలలో భారత్ సెమీఫైనల్స్ దశలోనే విఫలమవుతూ వచ్చింది.

ప్రస్తుతం రోహిత్ వయసు 36 సంవత్సరాల 203 రోజులు. తన కెరియర్ లో ఇదే చివరి ప్రపంచకప్. ఇప్పుడు కాకపోతే మరెప్పుడూ తాను ప్రపంచకప్ అందుకోలేనన్న భావనం రోహిత్ లో బలంగా నాటుకు పోయింది. అందుకేనేమో తెగించి మరీ ఆడుతున్నాడు. తనకు వ్యక్తిగత రికార్డుల కంటే ప్రపంచకప్ సాధనే ప్రధానమన్న ధోరణిలో తన పోరాటం కొనసాగిస్తున్నాడు.

2023 ఆసియాకప్ ట్రోఫీలో భారత్ ను తిరుగులేని విజేతగా నిలిపిన రోహిత్..ఐసీసీ వన్డే ప్రపంచకప్ లో సైతం అదేస్థాయి విజయాన్ని తనజట్టుకు అందించాలన్న పట్టుదలతో ఉన్నాడు.

ప్రస్తుత ప్రపంచకప్ లో తమ ఆటతీరు తనకు, తన జట్టు సభ్యులకు చిరస్మరణీయంగా మిగిలిపోవాలని కోరుకొంటున్నట్లు ప్రకటించాడు. విజయవంతమైన గొప్ప జ్ఞాపకాలను మిగుల్చుకోవాలని తపన పడిపోతున్నాడు. సెమీఫైనల్స్ వరకూ రోహిత్ అనుకొన్నట్లే జరిగింది. ఆదివారం ఆస్ట్ర్రేలియాతో జరిగే సూపర్ సండే టైటిల్ సమరంలో సైతం అదే జరగాలని దేశవిదేశాలలోని కోట్లాదిమంది అభిమానులతో పాటు కెప్టెన్ రోహిత్ శర్మ, జట్టులోని మిగిలిన సభ్యులు కోరుకోడం అత్యాశకాబోదు.

First Published:  18 Nov 2023 3:30 AM GMT
Next Story