Telugu Global
Sports

ఆసియాక్రీడల బ్యాడ్మింటన్లో భారత్ కు 2 పతకాలు ఖాయం!

ఆసియాక్రీడల చరిత్రలోనే భారత్ అత్యధికంగా 86 పతకాలు సాధించడం ద్వారా సెంచరీకి గురిపెట్టింది. బ్యాడ్మింటన్లో రెండు పతకాలు ఖాయం చేసుకొంది.

ఆసియాక్రీడల బ్యాడ్మింటన్లో భారత్ కు 2 పతకాలు ఖాయం!
X

ఆసియాక్రీడల చరిత్రలోనే భారత్ అత్యధికంగా 86 పతకాలు సాధించడం ద్వారా సెంచరీకి గురిపెట్టింది. బ్యాడ్మింటన్లో రెండు పతకాలు ఖాయం చేసుకొంది.

19వ ఆసియాక్రీడల్లో భారత్ పతకాలవేట కొనసాగుతోంది. మొదటి 12 రోజుల పోటీలు ముగిసే సమయానికే 86 పతకాలతో..పతకాలపట్టిక 4వ స్థానంలో పటిష్టంగా నిలిచింది. భారత్ మొత్తం 21 స్వర్ణ, 32రజత, 33 కాంస్యపతకాలు దక్కించుకొంది.

క్రికెట్ పురుషుల సెమీస్ పోరులో బంగ్లాదేశ్ తో భారత్ తలపడనుంది. మహిళల కబడ్డీ సెమీస్ లో నేపాల్ తోను, పురుషుల సెమీఫైనల్లో పాకిస్థాన్ తోను భారత్ అమీతుమీ తేల్చుకోనుంది.

హాకీలో నేడే గోల్డ్ మెడల్ సమరం...

ఆసియాక్రీడల హాకీలో హాట్ ఫేవరెట్ భారత్ ఈ రోజు జరిగే బంగారు పతకంపోరులో డిఫెండింగ్ చాంపియన్ జపాన్ తో అమీతుమీ తేల్చుకోనుంది. సెమీఫైనల్లో దక్షిణ కొరియాను 5-3 గోల్స్ తో చిత్తు చేసిన భారత్..గ్రూపు లీగ్ దశలోనే 58 గోల్స్ తో సరికొత్త రికార్డు నమోదు చేసింది.

లీగ్ దశలో జపాన్ ను 4-2తో అధిగమించిన భారత్ ఈరోజు జరిగే టైటిల్ పోరులో మరింత పెద్ద విజయం సాధించాలన్న పట్టుదలతో ఉంది. గత ఆసియాక్రీడల్లో కేవలం కాంస్య పతకంతో సరిపెట్టుకొన్న భారత్ 9 సంవత్సరాల విరామం తర్వాతి తిరిగి టైటిల్ రౌండ్లో పోటీపడుతోంది.

మహిళల సెమీస్ లో చైనా చేతిలో ఘోరపరాజయం చవిచూసిన భారత్ చివరకు కాంస్య పతకం రేసులో మిగిలింది.

బ్యాడ్మింటన్ సెమీస్ లో ప్రణయ్, డబుల్స్ జోడీ..

ఆసియాక్రీడల బ్యాడ్మింటన్ వ్యక్తిగత విభాగం పురుషుల సింగిల్స్, డబుల్స్ విభాగాలలో భారత్ కు 2 పతకాలు ఖాయమయ్యాయి. పురుషుల సింగిల్స్ సెమీఫైనల్స్ కు ప్రపంచ 9వ ర్యాంక్ ప్లేయర్ ప్రణయ్ చేరుకోడం ద్వారా..41 సంవత్సరాల తర్వాత భారత్ కు సింగిల్స్ పతకం ఖాయం చేశాడు.

పురుషుల డబుల్స్ లో భారత సూపర్ జోడీ సాత్విక్- చిరాగ్ 21-7, 21-9తో సింగపూర్ జోడీ జూ జీ- జాన్ ప్రోజోగో లను చిత్తు చేశారు. ఫైనల్లో చోటు కోసం జరిగే పోరులో మలేసియా జోడీ ఆరోన్ చియా- సూ ఊ ఇక్ లతో అమీతుమీ తేల్చుకోనున్నారు.

పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్ లోనే పీవీ సింధు పోటీ ముగిసింది. చైనా ప్లేయర్ హి బింగ్ జియావో కేవలం 47 నిముషాలలోనే సింధు ను 21-16, 21-12తో కంగు తినిపించింది.

మహిళల సింగిల్స్ లో పతకం లేకుండా ఉత్త చేతులతో స్వదేశానికి తిరిగి రావడం గత 9 సంవత్సరాలలో సింధుకు ఇదే మొదటిసారి.

స్వ్వాష్ లో మరో స్వర్ణం...

స్క్వాష్ మిక్సిడ్ డబుల్స్ లో భారతజోడీ దీపిక పల్లికల్- హరిందర్ పాల్ సింగ్ బంగారు పతకం సాధించారు. పురుషుల సింగిల్స్ లో వెటరన్ సౌరవ్ గోశాల్ రజత పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

మహిళల కాంపౌండ్ ఆర్చరీ టీమ్ స్వర్ణ పతకాన్ని భారత్ కైవసం చేసుకొంది. జ్యోతి సురేఖ, ఆదితి, పర్నీత్ లతో కూడిన భారతజట్టు బంగారు పతకం సాధించింది.

విలువిద్య కాంపౌండ్ విభాగంలో భారత్ కు ఇది మూడో స్వర్ణం కావడం విశేషం.

First Published:  6 Oct 2023 2:45 AM GMT
Next Story