Telugu Global
Sports

ప్రపంచ జూనియర్ హాకీ సెమీఫైనల్లో భారత్!

2023- జూనియర్ ప్రపంచకప్ హాకీ సెమీఫైనల్స్ కు మాజీ చాంపియన్ భారత్ సంచలన విజయంతో చేరుకొంది. ఫైనల్లో చోటు కోసం జర్మనీతో తలపడనుంది.

ప్రపంచ జూనియర్ హాకీ సెమీఫైనల్లో భారత్!
X

2023- జూనియర్ ప్రపంచకప్ హాకీ సెమీఫైనల్స్ కు మాజీ చాంపియన్ భారత్ సంచలన విజయంతో చేరుకొంది. ఫైనల్లో చోటు కోసం జర్మనీతో తలపడనుంది...

ప్రపంచ హాకీ సీనియర్ , జూనియర్ విభాగాలలో భారతజట్ల విజయపరంపర కొనసాగుతోంది. పురుషుల విభాగంలో సీనియర్లు మాత్రమే కాదు..జూనియర్లు సైతం అదగొడుతున్నారు.

ఓటమి అంచుల నుంచి బయటపడి....

2023 ప్రపంచకప్ జూనియర్ గ్రూపులీగ్ దశలో మిశ్రమ ఫలితాలు ఎదుర్కొన్న భారత్ క్వార్టర్ ఫైనల్ నాకౌట్ రౌండ్లో ఓటమి అంచుల నుంచి బయటపడి..ఆఖరి నిముషం గోలుతో నెదర్లాండ్స్ పై 4-3 గోల్స్ తో సంచలన విజయం సాధించడం ద్వారా సెమీస్ బెర్త్ ఖాయం చేసుకొంది.

పవర్ ఫుల్ నెదర్లాండ్స్ తో హోరాహోరీగా సాగిన పోరు మొదటి భాగంలో బాగా వెనుకబడిన భారత్ ఆట ఆఖరి క్వార్టర్ లో చెలరేగి ఆడి అరుదైన విజయం సొంతం చేసుకోగలిగింది.

ఆట మొదటి భాగంలో భారతజట్టు ఆత్మరక్షణ వ్యూహంతో ఆడటంతో డచ్ జట్టు దూకుడుగా ఆడింది. 5వ నిముషంలో టిమో బోయర్స్, 16వ నిముషంలో వాండెర్ హిజ్డెన్ చెరో గోల్ సాధంచడంతో నెదర్లాండ్స్ 2-0తో పైచేయి సాధించింది.

రెండుగోల్స్ తో వెనుకబడిన భారత్ ఆ తర్వాత వ్యూహం మార్చింది. ప్రత్యర్థి గోల్ పైకి మెరుపుదాడులు చేసింది. ఆట 34వ నిముషంలో ఆదిత్య లాలాజీ, 35వ నిముషంలో అర్జీత్ సింగ్ హుండాల్ గోల్స్ సాధించడంతో భారత్ 2-2తో సమఉజ్జీగా నిలువగలిగింది.

ఆట 44వ నిముషంలో ఆలీవర్ గోల్ తో నెదర్లాండ్స్ 3-2తో పైచేయి సాధించింది. ఆ తర్వాత నుంచి పోరు నువ్వానేనా అన్నట్లుగా సాగింది. ఆ తర్వాత ఎనిమిది నిముషాలపాటు భారత్ ఈక్వలైజర్ కోసం హోరాహోరీ సమరమే చేసింది. ఆట 52వ నిముషంలో సౌరవ్ ఆనంద్ సాధించిన గోలుతో భారత్ స్కోరును 3-3తో సమం చేయగిలిగింది.

వరుసగా మూడోసారి సెమీస్ బెర్త్...

ఆట మరో మూడు నిముషాలలో ముగుస్తుందనగా భారత జట్టు ఆలౌట్ ఎటాక్ తో విజయానికి అవసరమైన గోల్ సాధించగలిగింది. 57వ నిముషంలో ఉత్తమ్ సింగ్ సాధించిన గోలుతో భారత్ 4-3తో ఆధిక్యాన్ని కొనసాగించింది. చివరి మూడు నిముషాలు పటిష్టమైన డిఫెన్స్ తో డచ్ జట్టును నిలువరించింది.

భారత గోల్ కీపర్ మోహిత్ శశికుమార్ ప్రత్యర్థిజట్టుకు అడ్డుగోడలా నిలిచాడు. గోల్స్ చేయటానికి చేసిన ప్రయత్నాలను వమ్ము చేశాడు. నెదర్లాండ్స్ కు 7 పెనాల్టీ కార్నర్ లు లభించినా భారత్ గోల్ కానివ్వకుండా అడ్డుకోడం ద్వారా 4-3 గోల్స్ తో విజేతగా నిలిచింది. 2016 ప్రపంచకప్ విజేతగా నిలిచిన భారతజట్టు వరుసగా మూడోసారి సెమీస్ చేరుకోగలిగింది.

ఫైనల్లో చోటు కోసం జర్మనీతో ఢీ..

ప్రపంచకప్ ఫైనల్లో చోటు కోసం జరిగే సెమీస్ పోరులో జర్మనీతో భారత్ తలపడనుంది. గత ప్రపంచకప్ సెమీఫైనల్లో 2-4తో జర్మనీ చేతిలో పరాజయం పొందిన భారత్..ప్రస్తుత టోర్నీలో సైతం అదేజట్టును ఢీకోనుంది. గత ప్రపంచకప్ సెమీస్ ఓటమికి ప్రస్తుత ప్రపంచకప్ లో జర్మనీపై బదులు తీర్చుకోవాలన్న పట్టుదలతో భారత కుర్రాళ్లు ఉన్నారు.

భారత ఆటగాళ్లలో అరైజీత్ సింగ్ హుండాల్, మోహిత్ శశికుమార్, డ్రాగ్ ఫ్లిక్ స్పెషలిస్ట్ రోహిత్, మిడ్ ఫీల్డర్ విష్ణుకాంత్ సింగ్, ఫార్వర్డ్ ఉత్తమ్ సింగ్, డిఫెండర్ అమన్ దీప్ లాక్రా అత్యుత్తమంగా రాణించారు.

First Published:  14 Dec 2023 9:57 AM GMT
Next Story