Telugu Global
Sports

ఆసియా చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్!

ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ ఫైనల్స్ కు 4వ ర్యాంకర్ భారత్ నాలుగోసారి చేరుకొంది.

ఆసియా చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్!
X

ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ ఫైనల్స్ కు 4వ ర్యాంకర్ భారత్ నాలుగోసారి చేరుకొంది. సెమీస్ లో జపాన్ ను 5-0 గోల్స్ తో చిత్తు చేసి ఫైనల్లో మలేసియాతో తలపడటానికి అర్హత సంపాదించింది.

చెన్నైవేదికగా జరుగుతున్న 2023 ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీలో మాజీ చాంపియన్ భారత్ విజయపరంపర కొనసాగుతోంది. గత వారం రోజులుగా గ్రూప్ లీగ్ దశలో తిరుగులేని విజయాలు సాధించిన ఆతిథ్య భారత్ ..నాకౌట్ సెమీఫైనల్లో సైతం అదేజోరు కొనసాగించింది.

మేయర్ రాధాకృష్ణన్ స్టేడియం వేదికగా ముగిసిన రెండో సెమీఫైనల్లో 4వ ర్యాంకర్ భారత్ 5-0 గోల్స్ తో ఆసియా చాంపియన్ జపాన్ ను చిత్తు చేసి నాలుగోసారి ఫైనల్లో అడుగుపెట్టింది.

నాలుగో టైటిల్ కు భారత్ గురి...

ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో ఇప్పటికే మూడుసార్లు చాంపియన్ గా నిలిచిన భారత్ నాలుగో టైటిల్ కు చేరువయ్యింది. ప్రస్తుత టోర్నీలో లీగ్ దశ నుంచి సెమీస్ నాకౌట్ వరకూ తిరుగులేని విజయాలు సాధిస్తూ వచ్చిన భారత్ కు సెమీస్ లో ఎదురేలేకపోయింది.

లీగ్ దశలో 1-1తో భారత్ ను నిలువరించిన జపాన్..నాకౌట్ మ్యాచ్ లో తేలిపోయింది. భారత్ కు ఏవిధంగానూ సమఉజ్జీకాలేకపోయింది. ఆట తొలిక్వార్టర్ లో మాత్రమే భారత్ ను ప్రతిఘటించిన జపాన్ రెండోక్వార్టర్ నుంచి నీరుకారిపోతూ వచ్చింది.

భారత్ కు లభించిన తొలి పెనాల్టీ కార్నర్ ను జపాన్ గోల్ కీపర్ తకాషీ విజయవంతంగా అడ్డుకొన్నాడు. అయితే రెండో క్వార్టర్ లో ఆకాశ్ దీప్ సింగ్ సాధించిన గోల్ తో భారత్ 1-0తో బోణీ కొట్టింది. ఆ తర్వాత నుంచి దూకుడు పెంచిన భారత్ పదేపదే ప్రత్యర్థి గోల్ పైకి దాడులు చేసి ఒత్తిడిపెంచింది. ఆట 23వ నిముషంలో లభించిన పెనాల్టీకార్నర్ ను కెప్టెన్ హర్మన్ ప్రీత్ గోలుగా మలచడంతో భారత ఆధిక్యత 2-0కి పెరిగింది.

ఆట మొదటి భాగం ముగియటానికి కొద్ది సెకన్ల ముందు మన్ దీప్ సింగ్ సాధించిన గోలుతో భారత్ 3-0తో పైచేయి సాధించగలిగింది.

మన్ ప్రీత్ మిడ్ ఫీల్డ్ మ్యాజిక్...

భారత మిడ్ ఫీల్డర్ మన్ ప్రీత్ సింగ్ చక్కటి పాస్ లు అందిస్తూ, మ్యాచ్ ను తన నియంత్రణలో ఉంచుకొంటూ జపాన్ ను ఉక్కిరిబిక్కిరి చేశాడు. భారత ఫారర్వ్డ్ లైన్ కు తగిన సమయంలో పాస్ లు అందిస్తూ గోల్స్ చేయటంలో ప్రధానపాత్ర వహించాడు.

ఆట 51వ నిముషంలో యువఆటగాడు కార్తీ సెల్వమ్ చేసిన గోలుతో భారత్ 5-0 విజయంతో ఫైనల్ కు చేరుకోగలిగింది.

కొరియాకు మలేసియా షాక్...

అంతకుముందు జరిగిన తొలి సెమీఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ దక్షిణ కొరియాపైన మలేసియా 6-2 గోల్స్ తో సంచలన విజయం సాధించడం ద్వారా ఫైనల్లో అడుగుపెట్టింది.

హోరాహోరీగా సాగిన ఈ పోరు ఆట మొదటి భాగం ముగిసే సమయానికే మలేసియా 4-2 గోల్స్ తో ఆధిపత్యం సంపాదించింది. మలేసియా తరపున ఫైజల్ సారీ, సెల్లో సిల్వేరియస్, అబు కమల్ అజ్రాయ్, నజ్మీ జజ్లాన్ గోల్స్ సాధించగా..కొరియా ఆటగాళ్లలో వూ చియోన్ జీ, జోంగ్ హ్యున్ జాంగ్ చెరోగోలు మాత్రమే చేయగలిగారు.

ఆట 21వ నిముషానికే నాలుగు గోల్స్ సాధించిన మలేసియా..ఆ తర్వాత మరో రెండుగోల్స్ చేయడం ద్వారా విజేతగా నిలిచింది.

ఈ రోజు జరిగే టైటిల్ సమరంలో 4వ ర్యాంకర్ , హాట్ ఫేవరెట్ భారత్ తో మలేసియా అమీతుమీ తేల్చుకోనుంది. కాంస్య పతకం కోసం జరిగే మరో పోరులో దక్షిణ కొరియాతో జపాన్ పోటీపడుతుంది.

First Published:  12 Aug 2023 9:00 AM GMT
Next Story