Telugu Global
Sports

లంకను ముంచి నాకౌట్ రౌండ్లో భారత్!

ప్రపంచకప్ రౌండ్ రాబిన్ లీగ్ లో టాప్ ర్యాంకర్ భారత్ సూపర్ షో కొనసాగుతోంది. వరుసగా 7వ విజయంతో సెమీఫైనల్స్ నాకౌట్ రౌండ్లో అధికారికంగా అడుగుపెట్టింది.

లంకను ముంచి నాకౌట్ రౌండ్లో భారత్!
X

లంకను ముంచి నాకౌట్ రౌండ్లో భారత్!

ప్రపంచకప్ రౌండ్ రాబిన్ లీగ్ లో టాప్ ర్యాంకర్ భారత్ సూపర్ షో కొనసాగుతోంది. వరుసగా 7వ విజయంతో సెమీఫైనల్స్ నాకౌట్ రౌండ్లో అధికారికంగా అడుగుపెట్టింది. శ్రీలంకను 302 పరుగుల తేడాతో చిత్తు చేసింది.

2023-ఐసీసీ వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్స్ నాకౌట్ రౌండ్ చేరిన తొలిజట్టుగా భారత్ నిలిచింది. 10 జట్ల రౌండ్ రాబిన్ లీగ్ లో మొదటి 7 మ్యాచ్ ల్లోనే 7 విజయాలు సాధించడం ద్వారా 14 పాయింట్లతో లీగ్ టేబుల్ టాపర్ గా నిలిచింది. నాలుగుజట్ల సెమీఫైనల్ నాకౌట్ కు ముందుగా చేరుకొన్నజట్టుగా నిలిచింది.

భారత్ విశ్వరూపం....

10 జట్లు, 9రౌండ్ల తొలిదశ రౌండ్ రాబిన్ లీగ్ తొలిరౌండ్ నుంచి 7వ రౌండ్ వరకూ నంబర్ వన్ టీమ్ భారత్ తిరుగులేని విజయాలు సాధిస్తూ తన జైత్రయాత్ర కొనసాగిస్తోంది.

తొలిరౌండ్లో ఆస్ట్ర్రేలియా, రెండోరౌండ్లో అప్ఘనిస్థాన్, మూడోరౌండ్లో పాకిస్థాన్, నాలుగోరౌండ్లో బంగ్లాదేశ్, 5వ రౌండ్లో న్యూజిలాండ్, 6వ రౌండ్లో ఇంగ్లండ్ జట్లను ఊదిపారేసిన భారత్ 7వ రౌండ్లో అతిపెద్ద విజయం నమోదు చేసింది.

ముంబై వాంఖడే స్టేడియం వేదికగా మాజీ చాంపియన్ శ్రీలంకతో జరిగిన ఏకపక్ష పోరులో భారత్ విశ్వరూపం ప్రదర్శించింది.

బ్యాటింగ్ లో టాపార్డర్ షో.....

టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన భారత్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 357 పరుగుల భారీస్కోరు నమోదు చేసింది. కెప్టెన్ కమ్ ఓపెనర్ రోహిత్ శర్మ (4) మినహా మిగిలిన టాపార్డర్ బ్యాటర్లంతా చెలరేగిపోయారు.

యువఓపెనర్ శుభ్ మన్ గిల్ ,రన్ మెషీన్ విరాట్ కొహ్లీ సెంచరీలకు చేరువగా వచ్చి అవుటయ్యారు. రెండోడౌన్ బ్యాటర్ శ్రేయస్ అయర్ సునామీ సిక్సర్లతో చెలరేగి పోయాడు.

డెంగ్యూ జ్వరంతో మొదటి రెండుమ్యాచ్ లకు అందుబాటులో లేకుండా పోయిన శుభ్ మన్ గిల్ ఆ తర్వాతి మూడుమ్యాచ్ ల్లో స్థాయికి తగ్గట్టుగా రాణించలేకపోయినా...

శ్రీలంకతో జరిగిన 7వ రౌండ్ మ్యాచ్ లో మాత్రం తనదైన శైలిలో పరుగుల మోత మోగించాడు. వన్ డౌన్ విరాట్ కొహ్లీతో కలసి రెండోవికెట్ కు 189 పరుగుల రికార్డు భాగస్వామ్యం నమోదు చేశాడు.

92 బంతుల్లో 92 పరుగులు...

బ్యాటింగ్ కు, ప్రధానంగా స్ట్ర్రోక్ ప్లేకి అంతగా అనువుగా లేని వాంఖడే పిచ్ పైన శుభ్ మన్ గిల్ 92 బంతులు ఎదుర్కొని 11 బౌండ్రీలు, 2 సిక్సర్లతో 92 పరుగులు చేసి సెంచరీకి 8 పరుగుల దూరంలో అవుటయ్యాడు. ఈ క్రమంలో 2023 సీజన్లో 1400 పరుగుల మైలురాయిని చేరిన తొలి బ్యాటర్ గా నిలిచాడు.

మరోవైపు..49వ సెంచరీ సాధించడం ద్వారా మాస్టర్ సచిన్ రికార్డును సమం చేయాలని కలలు కన్న విరాట్ కొహ్లీ 88 పరుగుల స్కోరుకు దొరికిపోయాడు. విరాట్ మొత్తం 94 బంతులు ఎదుర్కొని 11 బౌండ్రీలతో శతకానికి 12 పరుగుల దూరంలో అవుటయ్యాడు.

శ్రేయస్ అయ్యర్ రికార్డు సిక్సర్...

శుభ్ మన్ గిల్ అవుట్ కావడంతో క్రీజులోకి అడుగుపెట్టిన రెండోడౌన్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ తన హోం గ్రౌండ్లో రెచ్చిపోయి ఆడాడు. వచ్చి రావడంతో భారీషాట్లతో శ్రీలంక బౌలర్లపై ఎదురుదాడి మొదలు పెట్టాడు. 106 మీటర్ల దూరం పడేలా సిక్సర్ బాది రికార్డు నెలకొల్పాడు. ప్రస్తుత ప్రపంచకప్ లో సుదూర సిక్సర్ షాట్ ఆడిన తొలిబ్యాటర్ గా నిలిచాడు.

అయ్యర్ కేవలం 56 బంతుల్లోనే 82 పరుగుల స్కోరు సాధించాడు. ఇందులో అరడజను సిక్సర్లు, 3 బౌండ్రీలున్నాయి. అయ్యర్ మెరుపు బ్యాటింగ్ కారణంగానే భారత్ 357 పరుగుల భారీస్కోరు నమోదు చేయగలిగింది.

రాహుల్ 21, సూర్య 12 పరుగులకు అవుట్ కాగా...జడేజా 24 బంతుల్లో 35 పరుగుల స్కోరు నమోదు చేశాడు. శ్రీలంక బౌలర్లలో లెఫ్టామ్ పేసర్ మధుశంక 80 పరుగులిచ్చి 5 వికెట్ల పడగొట్టారు.

భారత పేసర్ల ముప్పేట దాడి....

358 పరుగుల భారీలక్ష్యంతో చేజింగ్ కు దిగిన శ్రీలంకకు భారత పేసర్ల త్రయం మహ్మద్ సిరాజ్, జస్ ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ..ఫ్లడ్ లైట్ల వెలుగులోనే చుక్కలు చూపించారు.

ఓపెనింగ్ బౌలర్ జస్ ప్రీత్ బుమ్రా తొలిబంతికే శ్రీలంక ఓపెనర్ నిస్సంకాను డకౌట్ గా పడగొట్టాడు. మరో ఓపెనర్ కరుణరత్నే సైతం సిరాజ్ బౌలింగ్ లో పరుగులేవీ చేయకుండానే అవుటయ్యాడు.

వన్ డౌన్ కుశల్ మెండిస్ 1 పరుగు, రెండోడౌన్ సదీర విక్రమసింగే 0 పరుగులకు సిరాజ్ బౌలింగ్ లో చిక్కారు. చేంజ్ బౌలర్ గా వచ్చిన షమీ సైతం నిప్పులు చెరగడంతో చరిత అసలంకా 1 పరుగు, దుషాన్ హేమంత డకౌట్ గా వెనుదిరిగారు. పవర్ ప్లే ఓవర్లు ముగియకుండానే శ్రీలంక 14 పరుగులకే 6 టాపార్డర్ వికెట్లు నష్టపోయి పీకలోతు కష్టాలలో కూరుకుపోయింది.

సీనియర్ బ్యాటర్ ఏంజెలో మాథ్యూస్ 12, లోయర్ ఆర్డర్ బ్యాటర్లు మధుశంక 12, రజత 14 పరుగులు చేయడంతో శ్రీలంక 19.4 ఓవర్లలో 55 పరుగులకే కుప్పకూలి 302 పరుగుల భారీ ఓటమి మూటగట్టుకొంది.

భారత బౌలర్లలో మహ్మద్ షమీ 5 ఓవర్లలో 18 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుత ప్రపంచకప్ లో 5 వికెట్ల ఘనత సాధించడం షమీకి ఇది రెండోసారి. ధర్మశాల వేదికగా న్యూజిలాండ్ పై 5 వికెట్లు పడగొట్టిన షమీ...శ్రీలంకపైన సైతం అదేజోరు కొనసాగించగలిగాడు.

మహ్మద్ షమీ 7 ఓవర్లలో 16 పరుగులిచ్చి 3 వికెట్లు, బుమ్రా 5 ఓవర్లలో 8 పరుగులిచ్చి 1 వికెట్టు, జడేజా 1 వికెట్టు పడగొట్టారు. భారత భారీ విజయంలో ప్రధాన పాత్ర వహించిన మహ్మద్ షమీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

శ్రీలంకకో 99వ విజయం...

శ్రీలంక ప్రత్యర్థిగా ప్రస్తుత ప్రపంచకప్ మ్యాచ్ వరకూ 168సార్లు తలపడిన భారత్ కు ఇది 99వ గెలుపు కావడం విశేషం. ప్రపంచకప్ లో భారత్ సాధించిన అతిపెద్ద విజయాలలో ఈ 302 పరుగుల గెలుపు సైతం ఓరికార్డుగా మిగిలిపోతుంది.

2023 ఆసియాకప్ ఫైనల్లో శ్రీలంకను 50 పరుగులకే కుప్పకూల్చిన భారత్ ప్రపంచకప్ పోరులో 55 పరుగులకే పరిమితం చేయగలిగింది. పైగా ఐదుగురు శ్రీలంక బ్యాటర్లను డకౌట్ చేసిన జట్టుగా కూడా భారత్ మరో రికార్డు నమోదు చేసింది.

48 సంవత్సరాల ప్రపంచకప్ చరిత్రలో ఓ జట్టుకు చెందిన 5గురుబ్యాటర్లు డకౌట్ కావడం ఇది ఎనిమిదోసారి. 2003 ప్రపంచకప్ లో భాగంగా భారత్ పై జోహెన్స్ బర్గ్ లో ఐదుగురు శ్రీలంక బ్యాటర్లు డకౌట్లుగా కాగా..ప్రస్తుత ప్రపంచకప్ లో సైతం అదే రికార్డు తిరిగి చోటు చేసుకొంది.

ఈ విజయంతో భారత్ 14 పాయింట్లు సాధించడం ద్వారా సెమీస్ బెర్త్ ఖాయం చేసుకొన్న తొలిజట్టుగా నిలిచింది. కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగే సూపర్ సండే 8వ రౌండ్ పోరులో పవర్ ఫుల్ దక్షిణాఫ్రికాతో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది.

First Published:  3 Nov 2023 3:05 AM GMT
Next Story