Telugu Global
Sports

భారత్ టీ-20 ప్రపంచకప్ విజేత..దక్షిణాఫ్రికాకు గుండెకోత!

బార్బెడోస్ వేదికగా ఆఖరి ఓవర్ వరకూ నరాలు తెగే ఉత్కంఠ నడుమ ముగిసిన 2024- టీ-20 ప్రపంచకప్ టైటిల్ సమరంలో టాప్ ర్యాంకర్ భారత్ 7 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా పై సంచలన విజయం సాధించింది.

భారత్ టీ-20 ప్రపంచకప్ విజేత..దక్షిణాఫ్రికాకు గుండెకోత!
X

టీ-20 ప్రపంచకప్ విజేతగా రెండోసారి నిలవాలన్న భారత్ లక్ష్యం నెరవేరింది. కెప్టెన్ గా ప్రపంచకప అందుకోవాలన్న రోహిత్ శర్మ కల సాకారమయ్యింది. ఐసీసీ టీ-20 ట్రోఫీని 2007 తరువాత తొలిసారిగా భారత్ గెలుచుకొంది.

ధూమ్ ధామ్ టీ-20 ప్రపంచకప్ లో రోహిత్ శర్మ నాయకత్వం, రాహుల్ ద్రావిడ్ నేతృత్వంలో భారత జైత్రయాత్ర విశ్వవిజేతగా ముగిసింది. బార్బెడోస్ వేదికగా ఆఖరి ఓవర్ వరకూ నరాలు తెగే ఉత్కంఠ నడుమ ముగిసిన 2024- టీ-20 ప్రపంచకప్ టైటిల్ సమరంలో టాప్ ర్యాంకర్ భారత్ 7 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా పై సంచలన విజయం సాధించింది. తన టీ-20 కెరియర్ లో చివరిమ్యాచ్ ఆడిన విరాట్ కొహ్లీ ప్లేయర్ ఆఫ్ ది ఫైనల్ అవార్డు అందుకొన్నాడు.

సస్పెన్స్ థ్రిల్లర్లా సాగిన టైటిల్ పోరు...

అమెరికా- వెస్టిండీస్ క్రికెట్ బోర్డుల సంయుక్త ఆతిథ్యంలో గత నాలుగువారాలుగా...55 మ్యాచ్ లుగా సాగిన ఈ టీ-20 ప్రపంచకప్ కు ఇటు భారత్, అటు దక్షిణాఫ్రికా గొప్పముగింపునే ఇచ్చాయి.

బ్రిడ్జిటౌన్ కెన్సింగ్టన్ ఓవల్ వేదికగా ఆట తొలి ఓవర్ నుంచి ఆఖరి ఓవర్ వరకూ నువ్వానేనా అన్నట్లుగా సాగిన సమరంలో భారత్, దక్షిణాఫ్రికాజట్లు కొదమసింహాల్లా తలపడ్డాయి.

ప్రస్తుత టోర్నీలో గ్రూప్ లీగ్ నుంచి సెమీస్ వరకూ ఓటమి అంటే ఏమిటో తెలియని ఈ రెండుజట్ల పోరు ఆధిక్యత చేతులు మారుతూ పట్టుగా సాగింది. కీలక టాస్ నెగ్గి..

ముందుగా బ్యాటింగ్ ఎంచుకొన్న భారత ఓపెనర్లు మొదటి రెండు ఓవర్లలోనే పరుగుల మోత మోగించారు. గత 7 మ్యాచ్ ల్లో 75 పరుగులు మాత్రమే చేయడం ద్వారా దారుణంగా విఫలమైన విరాట్ దూకుడుగా ఆడాడు.

పవర్ ప్లేలో భారత్ కు ట్రిపుల్ షాక్...

భారత ఇన్నింగ్స్ మొదటి 2 ఓవర్లలో రోహిత్ సేన పైచేయి సాధిస్తే..ఆ తర్వాతి రెండు ఓవర్లలో సఫారీబౌలర్లు చెలరేగిపోయారు. కెప్టెన్ రోహిత్ 9, వన్ డౌన్ రిషభ్ పంత్ 0, మిస్టర్ 360 హిట్టర్ సూర్యకుమార్ యాదవ్ 3 పరుగుల స్కోర్లకే 4.3 ఓవర్లలోనే అవుట్ కావడంతో భారత్ పీకలోతు కష్టాలలో కూరుకుపోయింది. అయితే...సూర్య స్థానంలో పించ్ హిట్టర్ గా క్రీజులోకి అడుగుపెట్టిన అక్షర్ పటేల్ తో కలసి విరాట్ తన అనుభవాన్నంతా ఉపయోగించి ఆడి 72 పరుగుల కీలక భాగస్వామ్యంతో తనజట్టును తిరిగి గాడిలో పెట్టాడు.

స్పిన్ ఆల్ రౌండర్ అక్షర్ 31 బంతుల్లో ఓ ఫోరు, 4 సిక్సర్లతో సఫారీబౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. చివరకు 47 పరుగుల స్కోరుకు రనౌట్ కావడంతో భారత్..106 పరుగుల వద్ద 4వ వికెట్ నష్టపోయింది. అక్షర్ స్థానంలో వచ్చిన వీరబాదుడు శివందూబే సైతం బ్యాట్ ఝళిపించాడు. కేవలం 16 బంతుల్లోనే 3 ఫోర్లు, ఓ సిక్సర్ తో 27 పరుగులు చేయడం ద్వారా తనవంతు పాత్ర నిర్వర్తించాడు.

మరోవైపు..విరాట్ బాధ్యతాయుతంగా తన బ్యాటింగ్ ను కొనసాగించి..59 బంతుల్లో 2 సిక్సర్లు, 6 ఫోర్లతో 76 పరుగుల స్కోరుకు అవుటయ్యాడు. చివరకు భారత్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 176 పరుగుల మ్యాచ్ విన్నింగ్ స్కోరు చేయగలిగింది.

కెన్సింగ్టన్ వేదికగా జరిగిన టీ-20 మ్యాచ్ ల్లో మాత్రమే కాదు..ప్రపంచకప్ ఫైనల్స్ లో ఓ జట్టు సాధించిన అత్యధిక స్కోరు భారత్ నమోదు చేసిన స్కోరే కావడం మరో రికార్డు.

దక్షిణాఫ్రికా బౌలర్లలో మహారాజ్, నోర్కే చెరో 2 వికెట్లు, జాన్సన్, రబడ, చెరో వికెట్ పడగొట్టారు.

పేసర్లు హిట్...స్పిన్నర్లు ప్లాప్...

ప్రపంచకప్ నెగ్గాలంటే..20 ఓవర్లలో 177 పరుగుల భారీలక్ష్యంతో చేజింగ్ కు దిగిన దక్షిణాఫ్రికా ను పవర్ ప్లే ఓవర్లలోనే భారత పేసర్లు దెబ్బ మీద దెబ్బ కొట్టారు. ఓపెనర్ రీజా హెండ్రిక్స్ ( 4 ) ను బుమ్రా, కెప్టెన్ మర్కరమ్ ( 4 )ను అర్షదీప్ సింగ్ పడగొట్టారు.

3వ వికెట్ కు డికాక్ తో కలసి యువబ్యాటర్ స్టబ్స్ కీలక భాగస్వామ్యం నమోదు చేయడం ద్వారా పరిస్థితి చక్కదిద్దాడు. చివరకు స్టబ్స్ 21 బంతుల్లో 31 పరుగుల స్కోరుకు అవుటయ్యాడు.

ఓపెనర్ డికాక్ తో కలసి సఫారీ డైనమిక్ హిట్టర్ క్లాసెన్ మిడిల్ ఓవర్లలో చెలరేగిపోయాడు. ధూమ్ ధామ్ బ్యాటింగ్ తో భారత బౌలర్లపై విరుచుకు పడ్డాడు. ఒకదశలో భారత్ ఓటమి ఖాయమనుకొనేలా చేశాడు. కేవలం 27 బంతుల్లోనే 2 ఫోర్లు, 5 సిక్సర్లతో సుడిగాలి హాఫ్ సెంచరీ (52 ) పరుగులకు అవుట్ కావడంతో భారత్ ఊపిరి పీల్చుకోగలిగింది.

మ్యాచ్ ను మలుపు తిప్పిన సూర్య క్యాచ్....

క్లాసెన్ అవుటైనా..దక్షిణాఫ్రికాజట్టుకే విజయం సాధించే అవకాశం ఉంది. అయితే..ఇన్నింగ్స్ చివరి మూడు ఓవర్లలో బుమ్రా, అర్షదీప్, హార్ధిక్ పాండ్యా అసాధారణంగా రాణించారు. పొదుపుగా బౌల్ చేయడంతో పాటు కీలక వికెట్లు పడగొట్టడం ద్వారా భారత గెలుపుకు మార్గం సుగమం చేశారు.

మిడిలార్డర్ హిట్టర్ డేవిడ్ మిల్లర్ క్రీజులో ఉన్నంతసేపు భారతజట్టు టెన్షన్ టెన్షన్ గానే కనిపించింది. కెప్టెన్ రోహిత్ మాత్రం తొణకని బెణకని తన నాయకత్వ ప్రతిభతో..జట్టును ముందుండి నడిపించాడు. ఏమాత్రం ఒత్తిడికి లోను కాకుండా ఫీల్డర్లను సరైన స్థానాలలో మోహరించి...మిల్లర్ కు సవాలు విసిరి బుట్టలో పడేశాడు.

మిల్లర్ సిక్సర్ షాట్ కు ప్రయత్నించి..బౌండ్రీ లైన్ పైన సూర్యకుమార్ పట్టిన అనితరసాధ్యమైన క్యాచ్ కు దొరికిపోడంతో భారత్ గెలుపు ఖాయమైపోయింది.

ఆఖరి 6 బంతుల్లో 11 పరుగులు చేయాల్సిన సఫారీజట్టు 4 పరుగులు మాత్రమే చేయగలిగింది. 20 ఓవర్లలో 8 వికెట్లకు 169 పరుగులకే భారత బౌలర్లు కట్టడి చేయగలిగారు. దీంతో భారత్ 7 పరుగుల సంచలన విజయంతో రెండోసారి టీ-20 ప్రపంచకప్ చాంపియన్ గా నిలువగలిగింది.

భారత బౌలర్లలో హార్థిక్ పాండ్యా 3 వికెట్లు, బుమ్రా, అర్షదీప్ చెరో 2 వికెట్లు, అక్షర్ పటేల్ 1 వికెట్ పడగొట్టారు.

భారత్ రికార్డుల మోత...

టీ-20 ప్రపంచకప్ చరిత్రలో కనీసం ఒక్కమ్యాచ్ ఓడి పోకుండా వరుస విజయాలతో చాంపియన్ గా నిలిచిన తొలిజట్టుగా భారత్ రికార్డు నెలకొల్పింది. గ్రూప్ లీగ్ దశలో మూడు, సూపర్-3 రౌండ్లో మూడు విజయాలు చొప్పున సాధించిన రోహిత్ సేన నాకౌట్ రౌండ్లో సెమీస్, ఫైనల్స్ నెగ్గడం ద్వారా అజేయంగా నిలవడం ద్వారా రికార్డు సాధించింది.

2014 ప్రపంచకప్ లో వరుస విజయాలు సాధించినా ఫైనల్లో కంగుతిన్న భారత్..ప్రస్తుత ప్రపంచకప్ లో మాత్రం ఓటమి అంటే ఏమిటో తెలియని చాంపియన్ గా నిలువగలిగింది.

భారత స్టార్ బ్యాటర్ గా ప్రపంచకప్ అందుకోలేకపోయిన రాహుల్ ద్రావిడ్ ప్రస్తుత ప్రపంచకప్ లో మాత్రం భారతజట్టు ప్రధాన శిక్షకుడుగా ట్రోఫీని సాధించడం, విరాట్, రోహిత్ తమ కెరియర్ లో భారత్ తరపున ఆఖరి టీ-20 మ్యాచ్ లు ఆడి రిటైర్మెంట్ ప్రకటించడం హైలైట్స్ గా మిగిలిపోతాయి.

First Published:  30 Jun 2024 5:00 AM GMT
Next Story