Telugu Global
Sports

రేపటి నుంచే భారత్- ఆస్ట్రేలియా వన్డే సిరీస్!

ఐసీసీ వన్డే ప్రపంచకప్ కు సన్నాహకంగా ప్రపంచ మాజీ చాంపియన్లు భారత్- ఆస్ట్రేలియా జట్ల తీన్మార్ వన్డే సిరీస్ మొహాలీ వేదికగా శుక్రవారం ప్రారంభంకానుంది. నలుగురు స్టార్ ప్లేయర్లు లేకుండా ఆతిథ్య భారత్ పోటీకి దిగుతోంది.

రేపటి నుంచే భారత్- ఆస్ట్రేలియా వన్డే సిరీస్!
X

రెండుసార్లు ప్రపంచ చాంపియన్ భారత్, ఐదుసార్లు విశ్వవిజేత ఆస్ట్రేలియా జట్లు.. 2023 ఐసీసీ వన్డే ప్రపంచకప్ కు గురిపెట్టాయి. తమదైన శైలిలో సన్నాహాలు ప్రారంభించాయి. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ లో ఆస్ట్రేలియా పాల్గొంటే.. శ్రీలంక వేదికగా ముగిసిన ఆసియాకప్ టోర్నీలో పాల్గొనటమే కాదు.. తిరుగులేని విజేతగా నిలవడం ద్వారా భారత్ సన్నాహాల జోరును పెంచాయి. భారత్ వేదికగా అక్టోబర్‌లో ప్రారంభం కానున్న 2023 వన్డే ప్రపంచకప్ ప్రారంభానికి ముందే ఈ రెండుజట్లూ తీన్మార్ వన్డే సిరీస్ లో తలపడాలని నిర్ణయించాయి.

కెప్టెన్, వైస్ కెప్టెన్ లేకుండానే..

ఆస్ట్రేలియాతో శుక్రవారం మొహాలీ వేదికగా ప్రారంభమయ్యే తీన్మార్ సన్నాహక సిరీస్ మొదటి రెండు వన్డేలలోనూ భారత్ నలుగురు స్టార్ ప్లేయర్లు లేకుండా పోటీకి దిగుతోంది. కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యా, దిగ్గజ బ్యాటర్ విరాట్ కొహ్లీలతో పాటు జాదూ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కు సైతం విశ్రాంతినిచ్చారు. వెటరన్ ఆఫ్ స్పిన్ ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ తో పాటు యువ ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ కు సైతం భారతజట్టులో చోటు కల్పించారు. సిరీస్ లోని ఆఖరి వన్డేలో మాత్రమే భారత్ స్టార్ ప్లేయర్లతో బరిలోకి దిగనుంది. ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ సైతం సిరీస్ లోని మూడో వన్డేకి మాత్రమే అందుబాటులోకి రానున్నాడు.

మొహాలీ టు రాజ్ కోట్..

ఈ తీన్మార్ వన్డే సిరీస్ కు మొహాలీ, ఇండోర్, రాజ్ కోట్ నగరాలను వేదికలుగా ఎంపిక చేశారు. సిరీస్ లోని తొలివన్డేను సెప్టెంబర్ 22న మొహాలీలోని పంజాప్ క్రికెట్ సంఘం వేదికగా నిర్వహిస్తారు. సెప్టెంబర్ 24న జరిగే సూపర్ సండే వన్డేకి ఇండోర్ లోని హోల్కార్ స్టేడియం ఆతిథ్యమివ్వనుంది. రాజ్ కోటలోని సౌరాష్ట్ర‌ క్రికెట్ సంఘం స్టేడియం వేదికగా సిరీస్ లోని ఆఖరివన్డేను సెప్టెంబర్ 27న నిర్వహించనున్నారు.

రాహుల్ చేతికి భారతజట్టు పగ్గాలు..

కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ హార్థిక్ పాండ్యాలకు విశ్రాంతి నివ్వడంతో.. ఆస్ట్రేలియాతో సిరీస్ లోని మొదటి రెండు వన్డేలలో పాల్గొనే భారతజట్టుకు వికెట్ కీపర్ బ్యాటర్ కెఎల్ రాహుల్ నాయకత్వం వహించనున్నాడు. సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్ లు సైతం తమ సత్తా చాటుకోవ‌డానికి ఈ సిరీస్ ను వినియోగించుకోనున్నారు. హైదరాబాదీ బ్యాటర్ తిలక్ వర్మ, పేసర్ ప్రసిద్ధ కృష్ణలకు సైతం భారతజట్టులో చోటు లభించింది.

మొదటి రెండువన్డేలకు ఇదీ భారతజట్టు

కెఎల్ రాహుల్ ( కెప్టెన్ ), శుభ్ మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, జస్ ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ, తిలక్ వర్మ, ప్రసిద్ధ‌ కృష్ణ, రవిచంద్రన్ అశ్విన్, వాషింగ్టన్ సుందర్.

ఆఖరి వన్డేకు భారత జట్టు..

రాజ్ కోట వేదికగా సెప్టెంబర్ 27న జరిగే ఆఖరివన్డేలో పాల్గొనే భారతజట్టుకు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ నాయకత్వం వహించనున్నాడు. జట్టులోని ఇతర సభ్యుల్లో శుభ్ మన్ గిల్, కెఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, జస్ ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ, హార్ధిక్ పాండ్యా, విరాట్ కొహ్లీ, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, వాషింగ్టన్ సుందర్.

ఐసీసీ వన్డే తాజా ర్యాంకింగ్స్ ప్రకారం పాకిస్థాన్, భారత్, ఆస్ట్రేలియా మొదటి మూడు ర్యాంకుల్లో కొనసాగుతున్నాయి.

*

First Published:  21 Sep 2023 10:37 AM GMT
Next Story