Telugu Global
Sports

ప్రయోగాలకు స్వస్తి, సిరీస్ కోసం కుస్తీ!

ప్రపంచ మాజీ చాంపియన్లు భారత్, వెస్టిండీస్ జట్ల తీన్మార్ వన్డే సిరీస్ క్లయ్ మాక్స్ దశకు చేరింది. ఈరోజు జరిగే ఆఖరి వన్డేలో నెగ్గినజట్టే సిరీస్ విజేతగా నిలువగలుగుతుంది.

ప్రయోగాలకు స్వస్తి, సిరీస్ కోసం కుస్తీ!
X

ప్రపంచ మాజీ చాంపియన్లు భారత్, వెస్టిండీస్ జట్ల తీన్మార్ వన్డే సిరీస్ క్లయ్ మాక్స్ దశకు చేరింది. ఈరోజు జరిగే ఆఖరి వన్డేలో నెగ్గినజట్టే సిరీస్ విజేతగా నిలువగలుగుతుంది....

ఐసీసీ వన్డే ప్రపంచకప్ కు మాజీ చాంపియన్ భారత్ సన్నాహాలు పడుతూ లేస్తూ సాగుతున్నాయి. భారత్ వేదికగా 2023 వన్డే ప్రపంచకప్ ప్రారంభానికి మరో 66 రోజుల సమయం మాత్రమే ఉండగా..ఇప్పటికీ తుదిజట్టును ఖరారు చేసుకోలేక భారత టీమ్ మేనేజ్ మెంట్ ప్రయోగాల దశలోనే ఉండిపోయింది.

ప్రపంచకప్ కు అర్హత సాధించడంలో విఫలమైన వెస్టిండీస్ తో కరీబియన్ గడ్డపై జరుగుతున్న తీన్మార్ వన్డే సిరీస్ లో రెండుజట్లూ చెరో మ్యాచ్ నెగ్గి సమఉజ్జీలుగా నిలిచాయి. తారుబాలో బ్రయన్ లారా స్టేడియం వేదికగా ఈరోజు జరిగే నిర్ణయాత్మక ఆఖరి వన్డేలో నెగ్గినజట్టే సిరీస్ ను కైవసం చేసుకోగలుగుతుంది.

బార్బడోస్ కెన్సింగ్టన్ ఓవల్ వేదికగా జరిగిన మొదటి వన్డేలో 5 వికెట్లతో నెగ్గిన భారత్..అదే వేదికగా జరిగిన రెండోవన్డేలో భారీగా ప్రయోగాలకు వెళ్లి 6 వికెట్ల పరాజయం చవిచూసింది. దీంతో సిరీస్ లోని ఆఖరివన్డే డూ ఆర్ డైగా మారింది.

సిరీస్ వైపే భారత్ చూపు...

వెస్టిండీస్ ప్రత్యర్థిగా గత 15 వన్డే సిరీస్ ల్లోనూ విజేతగా నిలుస్తూ వచ్చిన భారత్ 16వ సిరీస్ విజయానికి గురిపెట్టింది.2006లో చివరిసారిగా వెస్టిండీస్ చేతిలో వన్డే సిరీస్ ఓటమి చవిచూసిన భారత్ ఆ తర్వాత మరి వెనుదిరిగి చూసింది లేదు. ప్రస్తుత సిరీస్ లోని మొదటి రెండువన్డేలు ముగిసే వరకూ ఈ రెండుజట్లూ 141 వన్డేల్లో తలపడితే భారత్ 71 విజయాలు, వెస్టిండీస్ 64 విజయాల రికార్డుతో ఉన్నాయి. రెండుమ్యాచ్ ల టై కాగా..నాలుగు వన్డేలు ఫలితం తేలకుండానే ముగిశాయి.

ఈ రెండుజట్లు తలపడిన గత 10 వన్డేలలో 9-1 రికార్డుతో ఉన్న భారత్ ఈరోజు జరిగే ఆఖరివన్డేలో నెగ్గాలన్నా, సిరీస్ కైవసం చేసుకోవాలన్నా ప్రయోగాలను పక్కనపెట్టి..స్టార్ జోడీ రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీలతో పాటు లెఫ్టామ్ స్పిన్ ఆల్ రౌండర్ రవీంద్రజడేజాను తుదిజట్టులోకి తీసుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది.

గత మ్యాచ్ లో తమకు లభించిన అవకాశాన్ని సంజు శాంసన్, అక్షర్ పటేల్ సద్వినియోగం చేసుకోడంలో విఫలమయ్యారు. వీరికి మరో అవకాశం లభించడం అనుమానమే.

విజయోత్సాహంతో విండీస్ టీమ్...

వన్డే క్రికెట్ 10వ ర్యాంకర్ వెస్టిండీస్ ఈరోజు జరిగే ఆఖరి వన్డేలో సైతం గెలుపు తమదేనన్న ధీమాతో ఉంది. భారత్ ప్రత్యర్థిగా ఆడిన గత 10 వన్డేలలో తొలివిజయం సాధించిన జోరుతో ఆఖరి వన్డేకి సిద్ధమయ్యింది.

కెప్టెన్ షాయ్ హోప్, కేసీ కార్టర్ కరీబియన్ బ్యాటింగ్ ఆర్డర్ కి ప్రధానబలంగా ఉన్నారు. సీనియర్ బ్యాటర్లు కీల్ మేయర్స్, హెట్ మేయర్ సైతం ధాటిగా ఆడగలిగితే నామమాత్రంగా ఉన్న భారత బౌలింగ్ ఎటాక్ కు కష్టాలు తప్పవు.

మరోవైపు బౌలింగ్ లో విండీస్ జట్టు కుదురుకొన్నట్లే కనిపిస్తోంది. లెఫ్టామ్ స్పిన్నర్ గుడకేష్ మోతే, ఫాస్ట్ బౌలర్ రొమారియో షెఫర్డ్ భారత బ్యాటర్లకు కొరకరాని కొయ్యగా మారారు.

బ్యాటింగ్ కు అనువుగా లారా స్టేడియం..

మ్యాచ్ కు వేదికగా ఉన్న బ్రయన్ లారా ఇంటర్నేషనల్ స్టేడియం పిచ్ బ్యాటింగ్ పూర్తిస్థాయిలో అనుకూలంగా ఉంటుందని క్యూరేటర్ చెబుతున్నారు. స్ట్ర్రోక్ మేకర్లకు చేతినిండా పనేనని భావిస్తున్నారు.

కెప్టెన్ రోహిత్, రన్ మెషీన్ విరాట్ కొహ్లీ తిరిగి తుదిజట్టులో చేరితే వెస్టిండీస్ కు ఓటమి తప్పదు. రెండోవన్డేలో కేవలం 40.5 ఓవర్లు మాత్రమే ఆడిన భారత్..ప్రస్తుత ఆఖరివన్డేలో పూర్తి 50 ఓవర్లు బ్యాటింగ్ చేయాలన్న పట్టుదలతో ఉంది.

మొదటి రెండువన్డేలకు ఆతిథ్యమిచ్చిన బార్బడోస్ వికెట్ తో పోల్చిచూస్తే..ఆఖరివన్డే వేదికగా లారా స్టేడియం బ్యాటింగ్ స్వర్గధామం కావడంతో..భారీస్కోరింగ్ మ్యాచ్ గా సాగే అవకాశం ఉంది.

భారత తుదిజట్టులో లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చహాల్ కు చోటు దక్కుతుందా?...వేచి చూడాల్సిందే. భారత కాలమానం ప్రకారం ఈ కీలకపోరు రాత్రి 7 గంటలకు ప్రారంభంకానుంది.

First Published:  1 Aug 2023 3:56 AM GMT
Next Story