Telugu Global
Sports

నేడే సూపర్ సండే ఫైట్..నువ్వానేనా అంటున్న భారత్, వెస్టిండీస్!

భారత్ - వెస్టిండీస్ జట్ల టీ-20 సిరీస్ లోని ఆఖరాటకు అమెరికాగడ్డపై రంగం సిద్ధమయ్యింది. రాత్రి 8 గంటలకు జరిగే సూపర్ సండే ఫైట్ లో రెండుజట్లూ సిరీస్ విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి.

నేడే సూపర్ సండే ఫైట్..నువ్వానేనా అంటున్న భారత్, వెస్టిండీస్!
X

భారత్ - వెస్టిండీస్ జట్ల టీ-20 సిరీస్ లోని ఆఖరాటకు అమెరికాగడ్డపై రంగం సిద్ధమయ్యింది. రాత్రి 8 గంటలకు జరిగే సూపర్ సండే ఫైట్ లో రెండుజట్లూ సిరీస్ విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి....

ధూమ్ ధామ్ టీ-20 క్రికెట్లో ప్రపంచ మాజీ చాంపియన్లు భారత్- వెస్టిండీస్ జట్ల పాంచ్ పటాకా సిరీస్ సమరం క్లయ్ మాక్స్ దశకు చేరింది. నీకో రెండు..నాకో రెండు అన్నట్లుగా సాగిన ఈ సిరీస్ లో భాగంగా ఈరోజు జరిగే ఆఖరి పోరులో నెగ్గినజట్టే విజేతగా నిలిచే అవకాశం ఉండటంతో రెండుజట్లూ నాకౌట్ పంచ్ కు సిద్ధమయ్యాయి.

టాప్ గేర్ లో భారత్...

సిరీస్ లో భాగంగా ఇప్పటి వరకూ జరిగిన నాలుగుమ్యాచ్ ల్లో ప్రపంచ నంబర్ వన్ ర్యాంకర్ భారత్, 7వ ర్యాంకర్ వెస్టిండీస్ జట్లకు ఒకేరకమైన ఫలితాలు ఎదురయ్యాయి.

ట్రినిడాడ్, గయానా వేదికలుగా జరిగిన మొదటి రెండుమ్యాచ్ ల్లో స్వల్పతేడాతో పరాజయం పొందిన భారత్..మూడు, నాలుగు మ్యాచ్ ల్లో మాత్రం ఏకపక్ష విజయాలు సాధించడం ద్వారా సిరీస్ ఆశల్ని సజీవంగా నిలుపుకోగలిగింది.

తొలి టీ-20లో విజయం అంచుల వరకూ వచ్చి 4 పరుగుల తేడాతో ఓడిన భారత్ కు..రెండో టీ-20లో సైతం 2 వికెట్ల పరాజయం తప్పలేదు. అయితే నెగ్గితీరాల్సిన మూడో మ్యాచ్ లో మిస్టర్ 360 స్ట్ర్రోక్ మేకర్ సూర్యకుమార్ యాదవ్ విశ్వరూపం ప్రదర్శించడంతో భారత్ 7 వికెట్ల అలవోక విజయంతో ఊపిరిపీల్చుకొంది. అంతేకాదు..

అమెరికా అంచెలో భాగంగా ఫ్లారిడా లౌడర్ హిల్ వేదికగా జరిగిన నాలుగో మ్యాచ్ లో సైతం భారత్ చెలరేగిపోయింది. కేవలం 17 ఓవర్లలోనే ప్రత్యర్థి ఉంచిన లక్ష్యాన్ని వికెట్ నష్టానికి సాధించడం ద్వారా టాప్ గేర్‌ లోకి వచ్చింది.

బౌలర్లు అర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్ స్థాయికి తగ్గట్టుగా రాణించి కరీబియన్ జట్టుకు పగ్గాలు వేస్తే..బ్యాటింగ్ లో యువఓపెనింగ్ జోడీ శుభ్ మన్ గిల్- యశస్వి జైశ్వాల్ 165 పరుగుల రికార్డు భాగస్వామ్యంతో పరుగుల మోత మోగించారు. సిరీస్ ను 2-2తో సమం చేయడంలో ప్రధానపాత్ర వహించారు.

ఈ రోజు జరిగే నిర్ణయాత్మక ఆఖరిమ్యాచ్ లో సైతం అదే దూకుడు కొనసాగించాలన్న పట్టుదలతో ఉన్నారు.

ఇది ఫైనల్ అంటున్న కరీబియన్ కెప్టెన్...

మరోవైపు ..రెండు వరుస విజయాలు, ఆ తర్వాత వరుసగా రెండు పరాజయాలతో గందరగోళంలో పడిపోయిన వెస్టిండీస్ జట్టు మాత్రం ఆఖరి పోరులో గెలుపు తమదేనన్న ధీమాతో ఉంది.

మొదటి నాలుగుమ్యాచ్ ల ఫలితాలతో తమకు సంబంధం లేదని, ఈ రోజు జరిగే మ్యాచ్ తమకు ఓ టోర్నీ ఫైనల్ లాంటిదని కరీబియన్ కెప్టెన్ రోవ్ మన్ పావెల్ చెప్పాడు.

గత రెండుమ్యాచ్ ల్లో తమ ఓటమికి కారణాలను విశ్లేషించుకొని పొరపాట్లు పునరావృతం కాకుండా జాగ్రత్త పడతామని ప్రకటించాడు.

ఫ్లారిడా పిచ్ బ్యాటింగ్ కు, స్ట్ర్రోక్ మేకర్లకు స్వర్గం లాంటిదని, తాము సద్వినియోగం చేసుకొంటామని, తనజట్టుపై పూర్తి విశ్వాసం ఉందని తెలిపాడు. ఓపెనర్లు కైల్ మేయర్స్, బ్రెండన్ కింగ్ తో పాటు కెప్టెన్ పావెల్, విధ్వంసకర బ్యాటర్ నికోలస్ పూరన్, వీరబాదుడు హేట్ మేయర్ స్థాయికి తగ్గట్టుగా ఆడితే భారత్ కు కష్ట్లాలు తప్పవు.

భారత స్పిన్నర్లను ..ప్రధానంగా చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ను ఎంత సమర్థవంతంగా ఎదుర్కొనగలమన్న అంశంపైనే వెస్టిండీస్ సిరీస్ విజయం అవకాశాలు ఆధారపడి ఉంటాయి.

గత ఏడేళ్లుగా సిరీస్ ఓటమిలేని భారత్...

వెస్టిండీస్ ప్రత్యర్థిగా గత ఏడు సంవత్సరాలుగా సిరీస్ ఓటమి లేని భారత్ తన ఆధిపత్యాన్ని కొనసాగించగలనన్న ఆత్మవిశ్వాసంతో ఉంది. 2016 తర్వాత నుంచి కరీబియన్ జట్టుతో ఆడిన ప్రతిసిరీస్ లోనూ నెగ్గుతూ వచ్చిన భారత్..ప్రస్తుత సిరీస్ లోని మొదటి నాలుగుమ్యాచ్ లు ముగిసే వరకూ వెస్టిండీస్ పై 19 విజయాల రికార్డుతో ఉంది. 9 మ్యాచ్ ల్లో మాత్రమే పరాజయాలు ఎదుర్కొంది.

దానికితోడు..ఫ్లారిడా వేదికగా 2022లో చివరిసారిగా వెస్టిండీస్ తో ఆడిన రెండుకు రెండుమ్యాచ్ ల్లోనూ భారతజట్టే విజేతగా నిలిచింది. 191, 188 స్కోర్లను భారతజట్టు కాపాడుకోగలిగింది.

చేజింగ్ లోనూ మ్యాచ్ నెగ్గిన భారత్...

ఫ్లారిడా పిచ్ పైన ముందుగా బ్యాటింగ్ కు దిగిన జట్లే విజేతగా నిలుస్తాయన్న రికార్డును భారత్ పటాపంచలు చేసింది. ప్రస్తుత సిరీస్ లోని నాలుగోమ్యాచ్ లో టాస్ ఓడి ముందుగా ఫీల్డింగ్ కు దిగాల్సి వచ్చినా...చేజింగ్ లో 179 పరుగుల విజయలక్ష్యాన్ని మంచినీళ్ల ప్రాయంగా చేధించింది.

లౌడర్ హిల్ గ్రౌండ్ లో ఇప్పటి వరకూ జరిగిన 14 అంతర్జాతీయ టీ-20 మ్యాచ్ ల్లో ముందుగా బ్యాటింగ్ కు దిగిన జట్లే 11సార్లు విజేతగా నిలిచాయి. మూడుసార్లు మాత్రమే చేజింగ్ కు దిగిన జట్లు విన్నర్ గా నిలిచాయి.

190కి పైగా స్కోరు సాధించగలిగితేనే...

సూపర్ సండే ఫైట్ గా ఈరోజు జరిగే ఆఖరాటలో టాస్ నెగ్గి ముందుగా బ్యాటింగ్ కు దిగిన జట్టు ఏదైనా..విజేతగా నిలవాలంటే 190 నుంచి 200కు పైగా స్కోరు సాధించక తప్పని పరిస్థితి కనిపిస్తోంది.

రెండుజట్లలోనూ వీరబాదుడు బ్యాటర్లు ఉండటంతో సిక్సర్ల హోరు, బౌండ్రీల జోరు, పరుగుల వెల్లువ ఖాయమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. భారత కాలమాన ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ ను తిలకించడానికి ఫ్లారిడాలోని భారత సంతతి అభిమానులతో పాటు..అమెరికాలోని వివిధ ప్రాంతాలలో ఉన్న రెండుజట్ల అభిమానులు భారీసంఖ్యలో తరలి రానున్నారు.

ప్రస్తుత సిరీస్ లో వరుసగా మూడో విజయంతో భారత్ సిరీస్ నిలుపుకొంటుందా? లేక..2016 తర్వాత భారత్ పై వెస్టిండీస్ తొలి సిరీస్ విజయం సాధిస్తుందా? తెలుసుకోవాలంటే మరికొద్దిగంటలపాటు వేచిచూడక తప్పదు.

First Published:  13 Aug 2023 10:21 AM GMT
Next Story