Telugu Global
Sports

ఆసియాకప్ ఫైనల్ కు భారత్ గురి, నేడు శ్రీలంకతో పోరు!

2023 -ఆసియాకప్ సూపర్ -4 రౌండ్లో భారత్ మరో కీలక మ్యాచ్ కు సిద్ధమయ్యింది. కొలంబో వేదికగా ఆతిథ్య శ్రీలంకతో తలపడనుంది.

ఆసియాకప్ ఫైనల్ కు భారత్ గురి, నేడు శ్రీలంకతో పోరు!
X

ఆసియాకప్ ఫైనల్ కు భారత్ గురి, నేడు శ్రీలంకతో పోరు!

2023 -ఆసియాకప్ సూపర్ -4 రౌండ్లో భారత్ మరో కీలక మ్యాచ్ కు సిద్ధమయ్యింది. కొలంబో వేదికగా ఆతిథ్య శ్రీలంకతో తలపడనుంది.

ఐసీసీ వన్డే ప్రపంచకప్ కు సన్నాహకంగా హైబ్రిడ్ మోడల్ లో తొలిసారిగా నిర్వహిస్తున్న ఆసియాకప్ వన్డే క్రికెట్ సూపర్-4 రౌండ్ సమరం హాట్ హాట్ గా మారింది.

తమ ప్రారంభమ్యాచ్ ల్లో కళ్లు చెదిరే విజయాలు సాధించిన భారత్, శ్రీలంక ఈరోజు జరిగే కీలక పోరులో అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్ లో నెగ్గిన జట్టే ముందుగా ఫైనల్ బెర్త్ ఖాయం చేసుకోగలుగుతుంది.

భారత స్టార్ల సత్తాకు పరీక్ష...

సూపర్-4 రౌండ్లో భారత్ గత మూడురోజుల్లో రెండోమ్యాచ్ కు సిద్ధమయ్యింది. వర్షంకారణంగా రిజర్వ్ డే తో కలుపుకొని రెండురోజులపాటు చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో కొనసాగిన ప్రారంభమ్యాచ్ లో భారత్ 228 పరుగుల అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది. అయితే...పాక్ పై విజయం సాధించిన కొద్ది గంటల విరామం లోనే..

రెండోరౌండ్ పోరులో డిఫెండింగ్ చాంపియన్ శ్రీలంకతో తలపడాల్సి ఉంది.

పాకిస్థాన్ తో కీలకపోరులో 350 పరుగుల భారీస్కోరు సాధించడంతో పాటు..ప్రత్యర్థిని కుప్పకూల్చడం ద్వారా భారత్ సూపర్ -4 రౌండ్లో సూపర్ ఆరంభం చేసింది.

ఈ క్రమంలో సెంచరీ హీరోలు కెఎల్ రాహుల్, విరాట్ కొహ్లీ లాంటి కీలక ఆటగాళ్లు తీవ్రంగా అలసిపోయారు. అయినా..శ్రీలంకతో మరో కీలక సమరానికి సై అంటున్నారు.

స్థానబలంతో శ్రీలంక...

భారత్ తర్వాత అత్యధికసార్లు ఆసియాకప్ నెగ్గిన జట్టుగా పేరున్న శ్రీలంక స్థానబలంతో వరుసగా రెండో విజయానికి ఉరకలేస్తోంది. తన ప్రారంభమ్యాచ్ లో బంగ్లాదేశ్ ను 21 పరుగుల తేడాతో అధిగమించడం ద్వారా 2 పాయింట్లు తన ఖాతాలో వేసుకోగలిగింది.

రెండురోజుల పూర్తి విశ్రాంతి అనంతరం శ్రీలంకజట్టు పూర్తి ఫిట్ నెస్ తో దసున్ సనక నాయకత్వంలో భారత్ ను ఢీ కొనబోతోంది. పతుమ్ నిస్సంక, కరుణరత్నే, కుశల్ మెండిస్, సమరవిక్రమసింగే, చరిత అసలంక, ధనుంజయ డి సిల్వా, వెల్లలగే, మహీశ్ తీక్షణ, కసున్ రజత, మతీశ్ పతీరన, కుశల్ పెరెరా, బినురా ఫెర్నాండే, ప్రమోద్ మధుసూదన, హేమంతలతో శ్రీలంక సమతూకంతో కనిపిస్తోంది. భారత తుదిజట్టులో సూర్యకుమార్?

గత మూడురోజుల్లో రెండోమ్యాచ్ కు సిద్ధమైన భారత్.. ఆటగాళ్ల రొటేషన్ పాలసీ ప్రకారం తుదిజట్టులో ఒకటి లేదా రెండుమార్పులు చేసే అవకాశం ఉంది. మిస్టర్ 360 హిట్టర్ సూర్యకుమార్ యాదవ్ తో పాటు స్పిన్ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ లను తుదిజట్టులో చేర్చుకొనే అవకాశం ఉంది. కీలక ఆటగాళ్లకు ఫిట్ నెస్ సమస్యలు తలెత్తకుండా భారత టీమ్ మేనేజ్ మెంట్ రొటేషన్ పాలసీని అమలు చేస్తోంది.

పవర్ ఫుల్ బ్యాటింగ్ లైనప్ కలిగిన భారతజట్టులోని మొదటి నలుగురు ( రోహిత్, శుభ్ మన్ గిల్, విరాట్, రాహుల్ ) కళ్లు చెదిరే ఫామ్ లో ఉండడంతో శ్రీలంక బౌలర్లకు కష్ట్లాలు తప్పవు.

మిడిలార్డర్లో ఇషాన్ కిషన్ కు బదులుగా సూర్యకుమార్ యాదవ్ ను, జడేజా స్థానంలో అక్షర్ పటేల్ ను బరిలో నిలిపే అవకాశం ఉంది. అయితే ..సొంతగడ్డపై అత్యంత ప్రమాదకరమైనజట్టుగా పేరున్న శ్రీలంకను భారత్ తక్కువగా అంచనావేస్తే భారీమూల్యం తప్పదు.

పాకిస్థాన్ పై కనబరచిన జోరునే భారత్ వరుసగా రెండోమ్యాచ్ లోనూ కొనసాగించగలిగితే...బ్యాక్ టు బ్యాక్ విజయాలతో ఆసియాకప్ ఫైనల్స్ కు చేరుకోడం ఏమంత కష్టంకాబోదు.

సూపర్-4 తొలిమ్యాచ్ కే టాప్ గేర్ కు చేరుకొన్న భారత ధాటికి శ్రీలంక నిలువగలదా?...శ్రీలంక నుంచి భారత్ కు అడుగడుగునా గట్టిపోటీ ఎదురుకానుందా ? తెలుసుకోవాలంటే మరి కొద్దిగంటలపాటు వేచిచూడక తప్పదు.

First Published:  12 Sep 2023 8:07 AM GMT
Next Story