Telugu Global
Sports

సిరీస్ స్వీప్ కు భారత్ గురి, నేడే ఆఖరివన్డే!

భారత్- శ్రీలంకజట్ల తీన్మార్ వన్డే సిరీస్ ఆఖరిఘట్టానికి చేరింది. ఆతిథ్య భారత్ వరుసగా మూడో గెలుపుతో సిరీస్ స్వీప్ సాధించడానికి ఉరకలేస్తోంది.

సిరీస్ స్వీప్ కు భారత్ గురి, నేడే ఆఖరివన్డే!
X

భారత్- శ్రీలంకజట్ల తీన్మార్ వన్డే సిరీస్ ఆఖరిఘట్టానికి చేరింది. ఆతిథ్య భారత్ వరుసగా మూడో గెలుపుతో సిరీస్ స్వీప్ సాధించడానికి ఉరకలేస్తోంది....

ఐసీసీ వన్డే ప్రపంచకప్ కు సన్నాహాలలో భాగంగా ప్రపంచ మాజీ చాంపియన్ జట్లు భారత్, శ్రీలంక ల మధ్య జరుగుతున్న మూడుమ్యాచ్ ల వన్డే సిరీస్ ముగింపు దశకు చేరింది.

సిరీస్ లోని మొదటి రెండువన్డేలు నెగ్గడం ద్వారా ఇప్పటికే సిరీస్ ను ఖాయం చేసుకొన్న భారత్ ..తిరువనంతపురం గ్రీన్ ఫీల్డ్ స్టేడియం వేదికగా ఈరోజు జరిగే ఆఖరిమ్యాచ్ లో సైతం నెగ్గడం ద్వారా 3-0తో ముగించాలన్న పట్టుదలతో ఉంది. మరోవైపు 8వ ర్యాంకర్ శ్రీలంక మాత్రం కనీసం ఆఖరిమ్యాచ్ లోనైనా నెగ్గి పరువుదక్కించుకోవాలని భావిస్తోంది.

సూర్య, ఇషాన్ లకు ఛాన్స్?

ధూమ్ ధామ్ టీ-20 ఫార్మాట్లో ప్రపంచ నంబర్ వన్ ర్యాంకర్ గా ఉన్న సూర్యకుమార్ యాదవ్ ...వన్డేలలో సైతం సత్తా చాటుకోడానికి తహతహలాడుతున్నాడు. తనవంతు కోసం ఎదురుచూస్తున్నాడు.

గౌహతి, కోల్ కతా వేదికలుగా ముగిసిన మొదటి రెండువన్డేలలో కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్, సూర్యకుమార్ తుదిజట్టులో చోటు దక్కించుకోలేకపోయారు. అయితే..ఇప్పటికే 2-0తో సిరీస్ ను భారత్ ఖాయం చేసుకోడంతో..ఈరోజు జరిగే ఆఖరివన్డే లో ఈ ఇద్దరికీ చోటు కల్పించాలని టీమ్ మేనేజ్ మెంట్ భావిస్తోంది.

ఓపెనర్ శుభమన్ గిల్, మిడిలార్డర్ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ లకు విశ్రాంతినివ్వగలిగితేనే..ఇషాన్, సూర్యలకు తుదిజట్టులో చోటు దక్కే అవకాశం ఉంది.

అందరిచూపు కుల్దీప్ యాదవ్ పైనే..

కోల్ కతా వన్డేలో తన స్పిన్ మ్యాజిక్ తో భారత్ ను విజేతగా నిలిపిన చైనామన్ స్పిన్నర్ ప్రస్తుత ఆఖరివన్డేలో సైతం భారత్ కు కీలకంకానున్నాడు. తన సూపర్ ఫామ్ ను

కొనసాగించడం ద్వారా భారతజట్టులో తన స్థానం పదిలం చేసుకోవాలని చూస్తున్నాడు.

తిరువనంతపురం వికెట్ స్పిన్ బౌలర్లకు సైతం అనుకూలించే అవకాశం ఉండడంతో కుల్దీప్ మరోసారి కీలకం కానున్నాడు. లెఫ్టామ్ పేస్ బౌలర్ అర్షదీప్ సింగ్ కు సైతం

తుదిజట్టులో చోటు కల్పించే అవకాశం ఉంది. ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ రెండోవన్డేలో స్థాయికి తగ్గట్టుగా రాణించడంలో విఫలమైన భారత టాపార్డర్ బ్యాటర్లు రోహిత్, శుభ్ మన్, విరాట్ మరోసారి భారీస్కోర్లకు గురిపెట్టారు.

చేజింగ్ జట్టుకే అనుకూలం..

మ్యాచ్ కు వేదికగా ఉన్న గ్రీన్ ఫీల్డ్ పిచ్..పేసర్లతో పాటు స్పిన్ బౌలర్లకు అనువుగా ఉంటుందని, ముందుగా బ్యాటింగ్ చేసిన జట్టు కంటే..చేజింగ్ కు దిగిన జట్టుకే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయని గ్రౌండ్ రికార్డులు చెబుతున్నాయి.

ఈమ్యాచ్ లో టాస్ నెగ్గినజట్టు కెప్టెన్ మరో ఆలోచన లేకుండా ఫీల్డింగ్ ఎంచుకోడం ఖాయంగా కనిపిస్తోంది. చిన్నగ్రౌండ్ కావడంతో బౌండ్రీల వర్షం కురుస్తుందని క్యూరేటర్ అంటున్నారు.

మధ్యాహ్నం 1-30కి ప్రారంభంకానున్న ఈ మ్యాచ్ జరుగుతున్నంతసేపూ ఆకాశం మేఘావృతమై ఉంటుందని, వర్షంతో మ్యాచ్ కు అంతరాయం కలిగే ప్రమాదం లేదని వాతావరణశాఖ ప్రకటించింది.

రెండో ఇన్నింగ్స్ జరిగే సమయంలో మాత్రం మంచుప్రభావం ఫీల్డింగ్ కు దిగిన జట్టుపైన తీవ్రంగా పడే అవకాశం లేకపోలేదు.

శ్రీలంకపై భారత్ దే పైచేయి...

2007 నుంచి శ్రీలంక ప్రత్యర్థిగా జరిగిన ద్వైపాక్షిక సిరీస్ ల్లో భారత్ కు తిరుగులేని రికార్డే ఉంది. 2007 నుంచి 2021 వరకూ భారత్ కు సిరీస్ ఓటమి అన్నదే లేకపోడం విశేషం.

ప్రస్తుత సిరీస్ లోని కోల్ కతా వన్డే వరకూ శ్రీలంక ప్రత్యర్థిగా ఆడిన మ్యాచ్ ల్లో భారత్ కు 94 విజయాలు, 57 పరాజయాల రికార్డు ఉంది.

స్వదేశీగడ్డపై శ్రీలంకతో ఆడిన 52 వన్డేల్లో భారత్ కు 75 శాతం విజయాల రికార్డు ఉంది. 37 విజయాలు, 12 పరాజయాల రికార్డుతో ఉంది. మరో మూడుమ్యాచ్ లు ఫలితం తేలకుండానే ముగిశాయి.

2007 నుంచి 2021 మధ్యకాలంలో శ్రీలంక ప్రత్యర్థిగా ఆడిన ద్వైపాక్షిక సిరీస్ ల్లో 10సార్లు భారత్ విజేతగా నిలిచింది.1998 నుంచి శ్రీలంక చేతిలో భారత్ కు ఒక్క ఓటమి లేకపోడం విశేషం.

2021 నుంచి స్వదేశీగడ్డపై భారత్ ఆడిన మొత్తం 11 వన్డేలలో 9 విజయాల రికార్డుతో ఉంది. అదే శ్రీలంక మాత్రం ఇంటా, బయటా ఆడిన 28 వన్డేలలో 16 పరాజయాలు చవిచూసింది.

సిరీస్ లోని ప్రస్తుత ఆఖరివన్డేలో సైతం భారత్ జోరు కొనసాగుతుందా? లేక శ్రీలంక కంటితుడుపు విజయంతో ఓదార్పు పొందుతుందా?..తెలుసుకోవాలంటే..మరికొద్దిగంటలపాటు వేచిచూడాల్సిందే.

First Published:  15 Jan 2023 6:38 AM GMT
Next Story