Telugu Global
Sports

సఫారీలతో సిరీస్ లో భారత్ బోణీ!

ప్రపంచ మూడో ర్యాంకర్ దక్షిణాఫ్రికాతో ప్రారంభమైన తీన్మార్ టీ-20 సిరీస్ లో టాప్ ర్యాంకర్ భారత్ 8 వికెట్ల విజయంతో బోణీ కొట్టింది. బౌలింగ్, బ్యాటింగ్ విభాగాలలో సంపూర్ణ ఆధిక్యం ప్రదర్శించింది.

సఫారీలతో సిరీస్ లో భారత్ బోణీ!
X

ప్రపంచ మూడో ర్యాంకర్ దక్షిణాఫ్రికాతో ప్రారంభమైన తీన్మార్ టీ-20 సిరీస్ లో టాప్ ర్యాంకర్ భారత్ 8 వికెట్ల విజయంతో బోణీ కొట్టింది. బౌలింగ్, బ్యాటింగ్ విభాగాలలో సంపూర్ణ ఆధిక్యం ప్రదర్శించింది.

ప్రపంచకప్ కు తుదివిడత సన్నాహాలలో భాగంగా ప్రపంచ మూడో ర్యాంక్ టీమ్ దక్షిణాఫ్రికాతో ప్రారంభమైన మూడుమ్యాచ్ ల టీ-20 సిరీస్ ను భారత్ భారీవిజయంతో ప్రారంభించింది.

తిరువనంతపురం గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ముగిసిన లోస్కోరింగ్ థ్రిల్లర్లో భారత్ 8 వికెట్ల విజయంతో ..మూడుమ్యాచ్ ల సిరీస్ లోని మొదటి పోటీ ముగిసే సమయానికి 1-0 ఆధిక్యం సంపాదిచింది.

Advertisement

అర్షదీప్,చహార్ స్వింగ్ మ్యాజిక్...

ప్రపంచ చాంపియన్ ఆస్ట్ర్రేలియాతో ముగిసిన సిరీస్ కు భిన్నంగా దక్షిణాఫ్రికాతో సిరీస్ కు భారత్ పలుమార్పులతో జట్టును ఎంపిక చేసింది. స్వింగ్ బౌలింగ్ జోడీ అర్షదీప్ సింగ్, దీపక్ చహార్ లతో పాటు వెటరన్ ఆఫ్ స్పిన్ ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్, వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ రిషభ్ పంత్ కు తుదిజట్టులో చోటు కల్పించింది.

బౌలింగ్ కు అనువుగా ఉన్న గ్రీన్ ఫీల్డ్ పిచ్ పై భారత కెప్టెన్ రోహిత్ శర్మ ముందుగా కీలక టాస్ నెగ్గి...మరో ఆలోచన లేకుండా ఫీల్డింగ్ ఎంచుకొన్నాడు. పిచ్ పై పచ్చిక ఎక్కువగా ఉండటం, ఆకాశం మేఘావృతం కావడం పేస్ , స్వింగ్ బౌలర్ల పాలిట వరంగా మారింది.

Advertisement

సఫారీల టాపార్డర్ టపటపా...

క్వింటన్ డి కాక్. టెండు బవుమాలతో ఇన్నింగ్స్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా ఒక్క పరుగు స్కోరుకే రెండు వికెట్లు నష్టపోయి ఎదురీత మొదలు పెట్టింది. కెప్టెన్ బవుమాను దీపక్ చహార్, డికాక్, వన్ డౌన్ రూసోలను అర్షదీప్ పడగొట్టారు.

దీపక్ చహార్, అర్షదీప్ పిచ్ పైనున్న పచ్చికను తమకు అనువుగా మార్చుకోడం ద్వారా బంతిని ఇరువైపులా స్వింగ్ చేయగలిగారు. ఇన్, అవుట్ స్వింగర్లతో చెలరేగిపోయారు.

భారత పేస్ జోడీ స్వింగ్ మ్యాజిక్ కు సఫారీ టాపార్డర్ పేకమేడలా కూలిపోయింది.

ఒకదశలో 9 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన సఫారీ టీమ్ ను మర్కరమ్, కేశవ్ మహరాజ్ ఆదుకున్నారు. మర్కరమ్ 25, కేశవ్ మహరాజ్ 41, పార్నెల్ 24 పరుగులు చేయడంతో 20 ఓవర్లలో 8 వికెట్లకు 106 పరుగుల స్కోరు సాధించడం ద్వారా దక్షిణాఫ్రికా పరువు దక్కించుకొంది.

భారత బౌలర్లలో అర్షదీప్ 3 వికెట్లు,చహార్, హర్షల్ చెరో 2 వికెట్లు, అక్షర్ 1 వికెట్ పడగొట్టారు. ఆఫ్ స్పిన్నర్ అశ్విన్ తన కోటా 4 ఓవర్లలో 8 పరుగులు మాత్రమే ఇవ్వడం ద్వారా సఫారీలకు పగ్గాలు వేశాడు.

రాహుల్- సూర్య టాప్ గేర్...

107 పరుగుల టార్గెట్ తో చేజింగ్ కు దిగిన భారత్ ప్రారంభ ఓవర్లలోనే కెప్టెన్ రోహిత్, వన్ డౌన్ విరాట్ కొహ్లీల వికెట్లు నష్టపోయి ఎదురీత ప్రారంభించింది. రోహిత్ డకౌట్ కాగా ..విరాట్ 3 వరుగులకే అవుటయ్యాడు. అయితే...మరో ఓపెనర్ రాహుల్ తో కలసి మిస్టర్ 360 స్టార్ సూర్యకుమార్ యాదవ్ 97 పరుగుల అజేయ భాగస్వామ్యంతో అలవోక విజయం అందించాడు.

రాహుల్ 56 బాల్స్ లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 51 పరుగులు, సూర్యకుమార్ యాదవ్ 33 బాల్స్ లోనే 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 50 పరుగులతో అజేయంగా నిలవడంతో భారత్ 16.4 ఓవర్లలో 2 వికెట్లకే విజయలక్ష్యాన్ని చేరుకోగలిగింది.

భారత్ విజయంలో ప్రధానపాత్ర వహించిన స్వింగ్ బౌలర్ అర్షదీప్ సింగ్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. దక్షిణాఫ్రికా ప్రత్యర్థిగా ఇప్పటి వరకూ 21సార్లు తలపడిన భారత్ కు ఇది 11వ గెలుపు కాగా...9 సార్లు పరాజయాలు చవిచూసింది.

చేజింగ్ లో 14వ గెలుపు...

టీ-20 ఫార్మాట్లో చేజింగ్ విజయాలు సాధించడంలో భారత్ తనకుతానే సాటిగా నిలిచింది. ప్రస్తుత సీజన్లో ఇప్పటి వరకూ ఆడిన మ్యాచ్ ల్లో భారత్ మొత్తం 15సార్లు

చేజింగ్ కు దిగడం ద్వారా 14సార్లు విజేతగా నిలిచింది.లక్ష్యచేధనలో ఒక్కసారి మాత్రమే విఫలమయ్యింది.

హైదరాబాద్ వేదికగా ఆస్ట్రేలియాతో ముగిసిన ఆఖరి టీ-20లో భారీస్కోరును అధిగమించిన భారత్..దక్షిణాఫ్రికాతో ముగిసిన తొలిపోరులో 108 పరుగుల లక్ష్యాన్ని చేధించగలిగింది.

22 విజయాలతో సరికొత్త రికార్డు..

టీ-20 ఫార్మాట్లో గతేడాది 20 మ్యాచ్ లు నెగ్గడం ద్వారా పాకిస్థాన్ నెలకొల్పిన ప్రపంచ రికార్డును హైదరాబాద్ టీ-20 మ్యాచ్ విజయం ద్వారా అధిగమించిన భారత్...తిరువనంతపురం విజయంతో మరింత మెరుగుపరచుకొంది.

ఓ క్యాలెండర్ ఇయర్ లో అత్యధికంగా 22 విజయాలు సాధించిన ఏకైకజట్టుగా అవతరించింది.దక్షిణాఫ్రికాతో మూడుమ్యాచ్ ల సిరీస్ లోని రెండోపోరు..గౌహతీలోని బార్సపారా స్టేడియం వేదికగా అక్టోబర్ 2న జరుగనుంది.

Next Story