Telugu Global
Sports

కేప్ టౌన్ టెస్టులో నేటినుంచే భారత్ కు డూ ఆర్ డై టెస్ట్!

టెస్టు క్రికెట్ టాప్ ర్యాంకర్ భారత్ సఫారీగడ్డపై నేలవిడిచి సాము చేస్తోంది. సిరీస్ లోని ఆఖరి టెస్టులో చావో బతుకో సమరానికిసిద్ధమయ్యింది.

కేప్ టౌన్ టెస్టులో నేటినుంచే భారత్ కు డూ ఆర్ డై టెస్ట్!
X

టెస్టు క్రికెట్ టాప్ ర్యాంకర్ భారత్ సఫారీగడ్డపై నేలవిడిచి సాము చేస్తోంది. సిరీస్ లోని ఆఖరి టెస్టులో చావో బతుకో సమరానికిసిద్ధమయ్యింది.

దక్షిణాఫ్రికాలో భారతజట్ల నెలరోజుల మూడు ఫార్మాట్ల టూర్ ముగింపు దశకు చేరింది. టీ-20 సిరీస్ ను సమం చేసి ..వన్డే సిరీస్ ను గెలుచుకొన్న టాప్ ర్యాంకర్ భారత్..ఐసీసీ టెస్టులీగ్ లో భాగంగా జరుగుతున్న రెండుమ్యాచ్ ల టెస్టు సిరీస్ లో మాత్రం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది.

సిరీస్ నెగ్గాలని వచ్చి.......

గత మూడుదశాబ్దాల కాలంలో దక్షిణాఫ్రికాలో తొమ్మిదో టెస్టు సిరీస్ ఆడుతున్న భారతజట్టు ఇప్పటి వరకూ కనీసం ఒక్కసారీ టెస్టు సిరీస్ విజేతగా నిలువలేకపోయింది.

రోహిత్ శర్మ నాయకత్వంలో దక్షిణాఫ్రికా ఫాస్ట్- బౌన్సీ పిచ్ లపైన తొలిసారి నెగ్గాలని ఆశపడిన భారత్ కు జోహెన్స్ బర్గ్ లోని సెంచూరియన్ పార్క్ వేదికగా జరిగిన తొలిటెస్టులో ఇన్నింగ్స్ 32 పరుగుల ఘోరపరాజయం ఎదురయ్యింది. దీంతో ..కేప్ టౌన్ న్యూలాండ్స్ వేదికగా నేటినుంచి ఐదురోజుల పాటు జరిగే ఆఖరి, రెండోటెస్టు భారత్ కు చావోబతుకో సమరంలా మారింది.

సిరీస్ ను సమం చేసి సగర్వంగా సఫారీటూర్ ను ముగించాలంటే భారత్ ఆరునూరైనా కేప్ టౌన్ టెస్టులో నెగ్గితీరాల్సి ఉంది.

ఒక్కగెలుపు లేని న్యూలాండ్స్.....

బ్యాటింగ్ , బౌలింగ్ కు సమానంగా ఉపకరించే వికెట్ గా పేరుపొందిన న్యూలాండ్స్ స్టేడియంలో భారత్ కు ఇప్పటి వరకూ ఒక్క గెలుపు లేకపోడం విశేషం.

సిరీస్ లోని ప్రస్తుత టెస్టుకు ముందు వరకూ కేప్ టౌన్ వేదికగా 6 టెస్టులు ఆడిన భారత్ 4 పరాజయాలు, 2 డ్రాల రికార్డుతోఉంది. సిరీస్ సాధించడంలో విఫలమైనా కనీసం న్యూలాండ్స్ లో తొలివిజయం నమోదు చేసిన రికార్డయినా దక్కించుకోవాలని కెప్టెన్ రోహిత్ శర్మ ఎదురుచూస్తున్నాడు.

యువబ్యాటర్లు రాణిస్తేనే....

భారతజట్టు విజయంతో సిరీస్ ను ముగించాలంటే యువబ్యాటర్లు యశస్వి జైశ్వాల్, శుభ్ మన్ గిల్ తో పాటు శ్రేయస్ అయ్యర్ స్థాయికి తగ్గట్టుగా రాణించితీరక తప్పదని కెప్టెన్ రోహిత్ శర్మ అంటున్నాడు.

తొలిటెస్టును పోలిన ఫాస్ట్, బౌన్సీ పిచ్ నే రెండోటెస్టుకూ సిద్ధం చేశారని, సఫారీ పేస్, బౌన్సీ సవాలును ఎదుర్కొనడానికి తాము సిద్ధమని రోహిత్ ప్రకటించాడు.

సీనియర్ బ్యాటర్లలో రాహుల్, విరాట్ కొహ్లీ మాత్రమే తొలిటెస్టులో రాణించగలిగారు. కెప్టెన్ రోహిత్ శర్మ 5, 0 స్కోర్లకే అవుట్ కావడం జట్టు అవకాశాలను దెబ్బతీసింది.

ప్రధానంగా సఫారీ ఫాస్ట్ బౌలర్ల త్రయం నాంద్రే బర్గర్, రబడ, మార్కో జెన్సన్ లను ఎదుర్కొనడం అసలు సిసలు సవాలుగా మారింది. బౌలర్లు సైతం ఆశించిన స్థాయిలో రాణించలేకపోడం తొలిటెస్టులో భారత్ ను దెబ్బతీసింది.

పేసర్లలో బుమ్రా ఒక్కడే 4 వికెట్లు పడగొట్టినా సిరాజ్, ప్రసిద్ధ, శార్దూల్ దారుణంగా విఫలమయ్యారు. రెండోటెస్టులో బౌలర్లు మెరుగైన ఆటతీరు ప్రదర్శించాల్సి ఉంది.

జడేజా, ముకేశ్ లకు చోటు....

గాయంతో తొలిటెస్టుకు దూరమైన స్పిన్ ఆల్ రౌండర్ జడేజాతో పాటు..స్వింగ్ బౌలర్ ముకేశ్ కుమార్ ను సైతం భారత్ తుదిజట్టులోకి తీసుకొనే అవకాశం ఉంది.

ఆఫ్ స్పిన్ ఆల్ రౌండర్ అశ్విన్, యువఫాస్ట్ బౌలర్ ప్రసిద్ధ కృష్ణలకుతుదిజట్టులో చోటు అనుమానంగా మారింది. మరోవైపు శ్రేయస్ అయ్యర్, శార్దూల్ లను తప్పించి అశ్విన్, ప్రసిద్ధలను కొనసాగించే అవకాశాలు సైతం లేకపోలేదు. ఆవేశ్ ఖాన్ తో టెస్టు అరంగేట్రం చేయించే అవకాశం సైతం కనిపిస్తోంది. బౌలర్లపైనే ప్రధానంగా భారత జయాపజయాలు ఆధారపడి ఉన్నాయి.

వీడ్కోలు టెస్టులో ఎల్గర్ నాయకత్వం..

ఆతిథ్య దక్షిణాఫ్రికా సిరీస్ విజయానికి గురిపెట్టింది. వరుసగా రెండో విజయంతో భారత్ ను బ్లాక్ వాష్ చేయాలన్న పట్టుదలతో ఉంది. తన కెరియర్ లో ఆఖరిటెస్టు ఆడుతున్న సీనియర్ ఓపెనర్ డీన్ ఎల్గర్ కు సిరీస్ గెలుపుతో ఘనమైన వీడ్కోలు పలకాలని సఫారీజట్టు సభ్యులు భావిస్తున్నారు.

కెప్టెన్ బవుమా గాయంతో అందుబాటులో లేకపోడంతో..తొలిటెస్టు సెంచరీ హీరో డీన్ ఎల్గర్ చేతికి జట్టు పగ్గాలను అప్పగించారు. సిరీస్ విజయంతో కెప్టెన్ గా తన కెరియర్ ను ముగించాలని ఎల్గర్ ఎదురుచూస్తున్నాడు.

ఫాస్ట్ బౌలర్ గెరాల్డ్ కొట్జే గాయంతో అందుబాటులో లేకపోడంతో స్పిన్ ఆల్ రౌండర్ కేశవ్ మహారాజ్ తుదిజట్టులో చేరడం ఖాయంగా కనిపిస్తోంది.

భారత కాలమానం ప్రకారం ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు ఈపోరు ప్రారంభంకానుంది.

First Published:  3 Jan 2024 1:44 AM GMT
Next Story