Telugu Global
Sports

పాక్ తో పోరులో భారత తురుపుముక్క !

ఆసియాకప్ గ్రూపులీగ్ లో అసలుసిసలు పోరాటానికి కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది. చిరకాల ప్రత్యర్థులు భారత్, పాక్ జట్లు సై అంటే సై అంటున్నాయి.

పాక్ తో పోరులో భారత తురుపుముక్క !
X

ఆసియాకప్ గ్రూపులీగ్ లో అసలుసిసలు పోరాటానికి కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది. చిరకాల ప్రత్యర్థులు భారత్, పాక్ జట్లు సై అంటే సై అంటున్నాయి.

హైబ్రిడ్ మోడల్ లో తొలిసారిగా రెండుదేశాలు ( పాకిస్థాన్, శ్రీలంక ) కలసి నిర్వహిస్తున్న 2023 ఆసియాకప్ వన్డే టోర్నీ గ్రూప్ -ఏ లీగ్ రెండోమ్యాచ్ లోనే చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ తలపడబోతున్నాయి.

శ్రీలంకలోని పల్లెకెలీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా..సూపర్ సండే ఫైట్ గా జరుగనున్న పోరులో టాప్ ర్యాంకర్ పాకిస్థాన్, మూడో ర్యాంకర్ భారత్ తమతమ ప్రధాన అస్త్ర్రాలతో బరిలోకి దిగనున్నాయి.

14 మాసాల తర్వాత బూమ్ బూమ్ బుమ్రా!

భారత పేస్ బౌలింగ్ ఎటాక్ కు వెన్నెముక లాంటి యార్కర్ల కింగ్ జస్ ప్రీత్ బుమ్రా వెన్నెముక శస్త్ర్రచికిత్స కారణంగా గత 11 మాసాలుగా జట్టుకు దూరంగా ఉంటూ వచ్చాడు.

బుమ్రా లేకుండానే భారతజట్టు ఐసీసీ టీ-20 ప్రపంచకప్ తో పాటు..ఐసీసీ టెస్టు లీగ్ టైటిల్ పోరులోనూ పాల్గొనాల్సి వచ్చింది. ఇక వన్డేలలో భారత్ తరపున బుమ్రా తన చివరిమ్యాచ్ ను 14 మాసాల క్రితం మాత్రమే ఆడాడు.

ఆపరేషన్ తర్వాత గాయం నుంచి పూర్తిగా కోలుకొని నూటికి నూరుశాతం ఫిట్ నెస్ సాధించిన బుమ్రా..ఇటీవలే ఐర్లాండ్ తో ముగిసిన తీన్మార్ టీ-20 సిరీస్ ద్వారా రీ-ఎంట్రీ చేసి..రెండుమ్యాచ్ ల్లో 4 వికెట్లు పడగొట్టడం ద్వారా తన సత్తా చాటుకొన్నాడు. తనలో వాడివేడీ ఏమాత్రం తగ్గలేదని చాటుకొన్నాడు.

ఆసియాకప్ కు భారత క్రికెట్ బోర్డు ప్రకటించిన 17 మంది సభ్యుల జట్టులో సైతం చోటు సంపాదించాడు. పాకిస్థాన్ తో ఆదివారం జరిగే ఆసియాకప్ ప్రారంభమ్యాచ్ లో భారత్ తన తురుపుముక్కగా బుమ్రాను ప్రయోగించనుంది.

భారత పేస్ ఎటాక్ కు బుమ్రా పవర్!

ప్రస్తుత ఆసియాకప్ తో పాటు..భారత్ వేదికగా అక్టోబర్ లో జరిగే ఐసీసీ వన్డే ప్రపంచకప్ లోనూ భారత్ కు బుమ్రా కీలకం కానున్నాడు. బుమ్రా పూర్తిస్థాయిలో రాణించే పక్షంలో భారత్ బౌలింగ్ కష్టాలు తీరినట్లే.

2022 జులై తర్వాత బుమ్రా 2023 సెప్టెంబర్ లో మాత్రమే భారత వన్డే జట్టుకు అందుబాటులోకి వచ్చాడు. బుమ్రా రాకతో తమ బౌలింగ్ బలం వెయ్యిరెట్లు పెరిగినట్లుగా ఉందని సహ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ ధీమాగా చెబుతున్నాడు.

భారత వన్డేజట్టు కీలక ఆటగాళ్లలో బుమ్రా ఒకడని కితాబిచ్చాడు. బుమ్రా తన విలక్షణ బౌలింగ్ తో మ్యాచ్ ను మలుపుతిప్పగల మొనగాడని, ప్రస్తుతం మహ్మద్ సిరాజ్ సైతం కుదురుగా బౌల్ చేస్తున్నట్లు చెప్పాడు.

ప్రారంభమ్యాచ్ లో భారీసెంచరీలతో జోరుమీదున్న పాక్ కెప్టెన్ బాబర్ అజమ్ తో సహా బ్యాటింగ్ లైనప్ కు బుమ్రా, షమీ, సిరాజ్ లతో కూడిన భారత పేస్ ఎటాక్ పగ్గాలు వేయటం ఖాయంగా కనిపిస్తోంది.

తమకు జట్టు ప్రయోజనాలే ముఖ్యమని, తుదిజట్టులో ఎవరికి చోటు దక్కినా పూర్తిస్థాయిలో రాణించడానికి పాటుపడతామని షమీ ప్రకటించాడు.

29 సంవత్సరాల బుమ్రాకు తన కెరియర్ లో ఇప్పటి వరకూ ఆడిన 30 టెస్టుల్లో 128 వికెట్లు, 72 వన్డేలలో 121 వికెట్లు, 62 అంతర్జాతీయ టీ-20 మ్యాచ్ ల్లో 74 వికెట్లు, 120 ఐపీఎల్ మ్యాచ్ ల్లో 145 వికెట్లు పడగొట్టిన అసాధారణ రికార్డు ఉంది.

భారత్ 2023 ఆసియాకప్, టీ-20 ప్రపంచకప్ టోర్నీలలో విజేతగా నిలవాలంటే బుమ్రా అత్యుత్తమంగా రాణించితీరక తప్పదు.

First Published:  1 Sep 2023 3:47 AM GMT
Next Story