Telugu Global
Sports

మూడోటెస్టులో బుమ్రాకు ' రెస్ట్ ' తప్పదా?

బుమ్రాకు విశ్రాంతి ఇవ్వాలా..వద్దా అన్న అంశమై టీమ్ మేనేజ్ మెంట్ తర్జనభర్జన పడుతోంది.

మూడోటెస్టులో బుమ్రాకు  రెస్ట్  తప్పదా?
X

ఇంగ్లండ్ తో కీలక మూడోటెస్టులో ప్రపంచ నంబర్ వన్ బౌలర్ బూమ్ బూమ్ బుమ్రా లేకుండానే భారత్ బరిలోకి దిగే సాహసం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

బుమ్రాకు విశ్రాంతి ఇవ్వాలా..వద్దా అన్న అంశమై టీమ్ మేనేజ్ మెంట్ తర్జనభర్జన పడుతోంది.

ఐసీసీ టెస్టు లీగ్ లో భాగంగా భారత్- ఇంగ్లండ్ జట్ల నడుమ జరుగుతున్న ఐదుమ్యాచ్ ల సిరీస్ ఓవైపు రసపట్టుగా సాగుతుంటే..మరోవైపు విరాట్ కొహ్లీ లాంటి స్టార్ బ్యాటర్ తో పాటు పలువురు కీలక ఆటగాళ్ల ఫిట్ నెస్ సమస్యలతో రోహిత్ సేన ఉక్కిరిబిక్కిరవుతోంది.

హైదరాబాద్ వేదికగా జరిగిన సిరీస్ లోని తొలిటెస్టులో 18 పరుగుల ఓటమితో కంగు తిన్న భారత్..విశాఖ వేదికగా జరిగిన రెండోటెస్టులో మాత్రం దెబ్బతిన్న బెబ్బులిలా పోరాడి 106 పరుగుల భారీవిజయం సాధించడం ద్వారా 1-1తో సమఉజ్జీగా నిలువగలిగింది.

నిర్ణయాత్మకంగా రాజ్ కోట్ టెస్ట్....

ఐదుమ్యాచ్ ల సిరీస్ కే కీలకంగా, నిర్ణయాత్మకంగా మారిన మూడోటెస్టు ఈనెల 15న రాజ్ కోట్ నిరంజన్ షా స్టేడియం వేదికగా ప్రారంభంకావటానికి ముందే పలురకాల ఊహాగానాలు అభిమానులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.

భారత విజయంలో ప్రధానపాత్ర వహించిన మెరుపు ఫాస్ట్ బౌలర్ బుమ్రాకు మూడోటెస్టులో విశ్రాంతి ఇస్తారని, వ్యక్తిగత కారణాలతో మొదటి రెండుటెస్టులకు దూరంగా ఉన్న విరాట్ కొహ్లీ..మూడు, నాలుగు టెస్టులకూ అందుబాటులో ఉండబోడంటూ ప్రచారం జోరందుకొంది. ఈ విషయాలతో బీసీసీఐ ఎంపిక సంఘం ఓ అధికారిక ప్రకటనతో స్పష్టత ఇవ్వాల్సి ఉంది.

ప్రపంచ నంబర్ వన్ బౌలర్ లేకుండానే?

భారత స్టార్ క్రికెటర్లకు..ప్రధానంగా ఫాస్ట్ బౌలర్లకు ' వర్క్ లోడ్ మేనేజ్ మెంట్ ' వ్యూహంలో భాగంగా టీమ్ మేనేజ్ మెంట్ విశ్రాంతి ఇస్తూ వస్తోంది. వెన్నెముక గాయంతో ఏడాదిపాటు భారతజట్టుకు దూరమైన బుమ్రా శస్త్రచికిత్స తరువాత పూర్తిగా కోలుకొని..దక్షిణాఫ్రికాతో రెండుమ్యాచ్ ల సిరీస్ ద్వారా తిరిగి జట్టులో చేరాడు.

కేప్ టౌన్ టెస్టులో భారత్ విజయంలో బుమ్రా ప్రధానపాత్ర వహించాడు.

ఆ తర్వాత నుంచి తగిన విశ్రాంతి లేకుండా బుమ్రా ఆడుతూ వస్తున్నాడు. ప్రస్తుత ఇంగ్లండ్ సిరీస్ లోని మొదటి రెండుటెస్టుల్లోనూ అత్యుత్తమమంగా రాణించడం ద్వారా 15 వికెట్లు పడగొట్టిన బుమ్రా విశాఖటెస్టులో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును సైతం అందుకొన్నాడు.

ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ బౌలర్ గా...

అంతేకాదు..బుమ్రా తన కెరియర్ లోనే తొలిసారిగా ఐసీసీ టెస్ట్ టాప్ ర్యాంక్ బౌలర్ గా, ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ సాధించిన భారత తొలి ఫాస్ట్ బౌలర్ గానూ చరిత్ర సృష్టించాడు. గతంలో టాప్ ర్యాంక్ సాధించిన భారత దిగ్గజ బౌలర్లు బిషిన్ సింగ్ బేడీ, అశ్విన్, రవీంద్ర జడేజాల సరసన నిలిచాడు.

ఒక్కమాటలో చెప్పాలంటే ప్రస్తుత ఇంగ్లండ్ సిరీస్ లో బుమ్రా తనజట్టుకు ఆయువుపట్టుగా మారాడు.

తన కెరియర్ లో ఇప్పటి వరకూ 34 టెస్టులు మాత్రమే ఆడిన బుమ్రా 20.19 సగటుతో 155 వికెట్లు పడగొట్టాడు. వెన్నెముక శస్త్ర్రచికిత్స తరువాత ఆడిన 5 టెస్టుల్లోనే బుమ్రా 29 వికెట్లతో 13.06 సగటుతో వారేవ్వా అనిపించుకొన్నాడు.

అయితే..రాజ్ కోట వేదికగా జరిగే మూడోటెస్టులో బుమ్రాకు విశ్రాంతి ఇవ్వాలా..వద్దా అన్నఅంశమై తుదినిర్ణయం తీసుకొనే అవకాశం నంబర్ వన్ బౌలర్ కే విడిచిపెట్టాలని టీమ్ మేనేజ్ మెంట్ నిర్ణయించింది.

మహ్మద్ షమీ, విరాట్ కొహ్లీ లాంటి కీలక సీనియర్ ప్లేయర్లు అందుబాటులో లేని సమయంలో సూపర్ ఫామ్ లో ఉన్న బుమ్రా సైతం విశ్రాంతి పేరుతో జట్టుకు దూరమైతే..కష్టాలుతప్పవని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.

బుమ్రా లాంటి అరుదైన బౌలర్ ను తగిన విశ్రాంతి ఇస్తూ జాగ్రత్తగా కాపాడుకోవాలని టీమ్ మేనేజ్ మెంట్ భావిస్తోంది. ప్రస్తుత సిరీస్ లోని కీలక మూడోటెస్టులో పాల్గొనాలో..వద్దు నిర్ణయించుకోవాల్సింది బుమ్రా మాత్రమే.

రాజ్ కోట టెస్టు బరిలో బుమ్రా నిలిచేది..లేనిదీ తెలుసుకోవాలంటే మరికొద్దిరోజులపాటు వేచిచూడక తప్పదు.

First Published:  8 Feb 2024 11:52 AM GMT
Next Story