Telugu Global
Sports

నేటినుంచే విశాఖ టెస్ట్...భారత కుర్రాళ్ల సత్తాకు అసలు పరీక్ష!

భారత్- ఇంగ్లండ్ జట్ల పాంచ్ పటాకా టెస్టు లీగ్ షో స్టీల్ సిటీ విశాఖకు చేరింది. ఈరోజు నుంచి ఐదురోజులపాటు జరిగే ఈ పోరు ఆతిథ్య భారత్ కు డూ ఆర్ డై గా మారింది.

నేటినుంచే విశాఖ టెస్ట్...భారత కుర్రాళ్ల సత్తాకు అసలు పరీక్ష!
X

భారత్- ఇంగ్లండ్ జట్ల పాంచ్ పటాకా టెస్టు లీగ్ షో స్టీల్ సిటీ విశాఖకు చేరింది. ఈరోజు నుంచి ఐదురోజులపాటు జరిగే ఈ పోరు ఆతిథ్య భారత్ కు డూ ఆర్ డై గా మారింది.

ఐసీసీ టెస్టులీగ్ లో భాగంగా రన్నరప్ భారత్, ఇంగ్లండ్ జట్ల నడుమ జరుగుతున్న ఐదుమ్యాచ్ ల సిరీస్ రెండో టెస్టుకే పోరు జోరందుకొంది. 2011 తర్వాత నుంచి సొంత గడ్డపై సిరీస్ ఓటమి అంటే ఏమిటో ఎరుగని భారత్ ప్రస్తుత సిరీస్ ను ఓటమితో మొదలు పెట్టింది.

ఓటమితో రగిలిపోతున్న భారత్...

హైదరాబాద్ వేదికగా ముగిసిన తొలిటెస్ట్ మ్యాచ్ మూడురోజుల ఆటలో సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించి..190 పరుగుల కీలక తొలిఇన్నింగ్స్ సాధించినా..నాలుగో ఇన్నింగ్స్ లో తేలిపోయిన భారత్ 28 పరుగులతో ఓటమి పాలుకావడాన్నిఏమాత్రం జీర్ణించుకోలేకపోతోంది.

తొలిటెస్టులో జరిగిన తప్పిదాలను సవరించుకోడం ద్వారా ఇంగ్లండ్ ను దెబ్బకు దెబ్బ తీయాలన్న కసితో బరిలోకి దిగుతోంది.

సీనియర్ స్టార్లు లేకుండానే.....

విరాట్ కొహ్లీ, మహ్మద్ షమీ, కెఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, చతేశ్వర్ పూజారా లాంటి సీనియర్ స్టార్లు లేకుండానే భారత్ సొంతగడ్డపై ' బజ్ బాల్ బ్రాండ్ ' ఇంగ్లండ్ జట్టుతో తలపడుతోంది.

విరాట్ కొహ్లీ లాంటి పరుగుల మేటి లేని లోటును తొలిటెస్టులో పూడ్చడంలో జట్టులోని నవతరం బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. ప్రధానంగా కెప్టెన్ రోహిత్ శర్మ, వన్ డౌన్ గిల్ , మూడో డౌన్ శ్రేయస్ అయ్యర్ స్థాయికి తగ్గట్టుగా రాణించలేకపోయారు.

అపార ప్రతిభకలిగిన శుభ్ మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ ల వరుస వైఫల్యాలు భారతీ టీమ్ మేనేజ్ మెంట్ సహనానికి పరీక్షగా మారింది. ఈ ఇద్దరు బ్యాటర్లకూ గత 10 టెస్టు ఇన్నింగ్స్ లో కనీసం ఒక్క హాఫ్ సెంచరీ లేకపోడం విశేషం.

దీనికితోడు మిడిలార్డర్లో రాహుల్, జడేజా లాంటి కీలకజోడీ లేకపోడం కూడా భారత్ ను మరింత ఒత్తిడిలో పడేసింది.

ఈ ఇద్దరిలో ఎవరికో చోటు ?

నిలకడగా రాణించడానికి మరో పేరైన కెఎల్ రాహుల్ గాయంతో జట్టుకు దూరం కావడంతో..ఆ స్థానం కోసం యువబ్యాటర్లు రజత్ పాటిదార్, సర్ ఫ్రాజ్ ఖాన్ పోటీపడుతున్నారు.

దేశవాళీ క్రికెట్లో గత మూడేళ్లుగా టన్నుల కొద్దీ పరుగులు, సెంచరీల మోత మోగించడం ద్వారా సుదీర్ఘ పోరాటం తరువాత భారతజట్టులోకి దూసుకు వచ్చిన

ముంబై బ్యాటర్ సర్ ఫ్రాజ్ ఖాన్ కు తుదిజట్టులో చోటు దక్కుతుందా అన్నది అంతుచిక్కని ప్రశ్నగా మారింది.

మరోవైపు..మధ్యప్రదేశ్ బ్యాటర్, గత రెండు ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ల్లో బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు బాదిన రజత్ పాటిదార్ సైతం తనవంతు కోసం ఆశతో ఎదురుచూస్తున్నాడు.

ఈ కీలక మ్యాచ్ ద్వారా టెస్టు అరంగేట్రం చేసేది ఎవరన్నది కొద్దిగంటల్లో తేలిపోనుంది.

నలుగురు స్పిన్నర్లతో పోరుకు?

బెన్ స్టోక్స్ నాయకత్వంలోని ఇంగ్లండ్ జట్టు నలుగురు స్పిన్నర్ల వ్యూహంతో భారత్ ను తొలిటెస్టులోనే గట్టి దెబ్బ కొడితే..ఆతిథ్య భారత్ మాత్రం ఇద్దరు పేసర్లు, ముగ్గురు స్పిన్నర్ల వ్యూహం అనుసరిస్తూ వస్తోంది.

నల్లమట్టితో తీర్చిదిద్దిన విశాఖ పిచ్ పైన బంతి స్పిన్ తో పాటు రివర్స్ స్వింగ్ అయ్యే అవకాశం ఉండటంతో పేసర్ సిరాజ్ ను కొనసాగించే అవకాశం లేకపోలేదు.

తొలిటెస్టులో కేవలం 11 ఓవర్ల బౌలింగ్ కే పరిమితమై కనీసం ఒక వికెట్టు పడగొట్టలేకపోయిన సిరాజ్ కు బదులుగా...ఆఫ్ స్పిన్ ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ ను తుదిజట్టులోకి తీసుకొన్నా ఆశ్చర్యపోనక్కరలేదు.

అశ్విన్ వికెట్ల అడ్డా విశాఖ....

విశాఖ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి స్టేడియం వేదికగా ఇప్పటి వరకూ భారత్ ఆడిన రెండుకు రెండుటెస్టుల్లోనూ విజేతగా నిలిచింది. ఇంగ్లండ్, దక్షిణాఫ్రికాజట్లపై భారత్ భారీవిజయాలు సాధించడంలో స్పిన్ జాదూ రవిచంద్రన్ అశ్విన్ కీలకపాత్ర పోషించాడు.

2019 లో ఇదే గ్రౌండ్లో ఆడిన అశ్విన్ కు 5 వికెట్లు పడగొట్టిన ఘనత సైతం ఉంది. అంతేకాదు..మరో 4 వికెట్లు పడగొట్టగలిగితే..టెస్టు చరిత్రలో 500 వికెట్ల మైలురాయిని చేరిన 9వ బౌలర్ గా అశ్విన్ చరిత్రలో నిలిచిపోగలుగుతాడు.

కెప్టెన్ రోహిత్ శర్మకు సైతం విశాఖ వేదికగా భారీశతకం బాదిన అనుభవం ఉంది.

టాస్ నెగ్గినజట్టుకే విజయావకాశాలు?

భారత్ స్పిన్ పిచ్ లపైన జరిగే టెస్టుమ్యాచ్ ల్లో టాస్ నెగ్గి ముందుగా బ్యాటింగ్ ఎంచుకొన్న జట్లకే విజయావకాశాలు ఉంటాయి. స్పిన్ బౌలర్ల కు విపరీతంగా అనుకూలించే నాలుగో ఇన్నింగ్స్ లో చేజింగ్ కు దిగటం కత్తిమీద సాములా మారటమే దీనికి కారణంగా మారింది. హైదరాబాద్ వేదికగా ముగిసిన తొలిటెస్టు 4వ ఇన్నింగ్స్ లో 231 పరుగుల లక్ష్యంతో చేజింగ్ కు దిగిన భారత్ 28 పరుగుల తేడాతో పరాజయం పాలు కావాల్సి వచ్చింది.

ఈరోజు ఉదయం 9-30 గంటలకు ప్రారంభమయ్యే ఈ టెస్టు రోజుకు 90 ఓవర్ల చొప్పున రానున్న ఐదురోజులపాటు కొనసాగనుంది. ఐదుమ్యాచ్ ల ఈ సిరీస్ లో ఇంగ్లండ్ ఆధిక్యాన్ని తగ్గించాలంటే ఆరునూరైనా విశాఖ టెస్టులో ఆతిథ్య భారత్ నెగ్గితీరాల్సి ఉంది.

కెప్టెన్ గా రోహిత్ కు మాత్రమే కాదు...జట్టులోని యువబ్యాటర్ల సత్తాకు విశాఖ వేదికగా జరిగే ఈ మ్యాచ్ రియల్ టెస్టు అనడంలో ఏమాత్రం సందేహం లేదు.

First Published:  2 Feb 2024 3:24 AM GMT
Next Story